
బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే నరేంద్ర వర్మ వికృత వ్యాఖ్యలు
వైఎస్సార్‌సీపీ నేతలను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలపై నాయీ బ్రాహ్మణులు, బీసీలు ఫైర్
అవి తమను కించపరిచేలా ఉన్నాయని మండిపాటు
ఫోన్లుచేసి మరీ ఆయా వర్గాల నేతలు తిట్ల వర్షం
సోషల్ మీడియాలోనూ ఎమ్మెల్యేపై మిన్నంటిన ఆగ్రహజ్వాలలు
తక్షణం ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
చివరికి.. ఈ దాడిని తట్టుకోలేక క్షమాపణలు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ‘పనిలేని మం..లోడు అదేదో బొచ్చు పీకినట్లు’ అంటూ బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోషల్ మీడియాలోనూ, నాయీ బ్రాహ్మణులు, బీసీ వర్గాల నుంచి పెద్దఎత్తున నిరసన వెల్లువెత్తింది. ఫోన్లు చేసి మరీ ఆయనపై విరుచుకుపడ్డారు. వివరాలివీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నిర్వహించిన చలో మెడికల్ కళాశాల నిరసన కార్యక్రమానికి కౌంటర్‌గా శనివారం బాపట్ల శివారులోని మెడికల్ కళాశాల వద్ద ఎమ్మెల్యే నరేంద్ర వర్మ హడావుడి చేశారు.
అనంతరం మీడియా సమక్షంలోనే ఆయన ‘పనిలేని మం...లోడు అదేదో బొచ్చు పీకినట్లు’ అంటూ వైఎస్సార్‌సీపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అయితే, ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు బూమరాంగ్ అయి తీవ్ర వివాదాస్పదమయ్యాయి. సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే మాటలు నాయీ బ్రాహ్మణులను కించపరిచేలా ఉన్నాయని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆయన్ను తీవ్రస్థాయిలో దుమ్మెత్తి పోశారు.
ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా నాయీ బ్రాహ్మణులతోపాటు బీసీలు కూడా ఆగ్రహంతో ఊగిపోయారు. ఎమ్మెల్యే నరేంద్రవర్మపై విరుచుకుపడి నానా చీవాట్లు పెట్టారు. బీసీ సంఘాలు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. అధికార గర్వం తలకెక్కి మాట్లాడారని, తక్షణం ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ నాయీ బ్రాహ్మణులతోపాటు బీసీలు డిమాండ్ చేశారు.
ఫోన్లు చేసి మరీ ఎమ్మెల్యేకు చీవాట్లు!?
ఇదిలా ఉంటే.. రాష్ట్ర, జాతీయస్థాయి నాయీ బ్రాహ్మణ, బీసీ సంఘాల నేతలైతే ఎమ్మెల్యేకు నేరుగా ఫోన్‌చేసి చీవాట్లు పెట్టినట్లు సమాచారం. నాయీ బ్రాహ్మణ సేవా సంఘం స్టేట్ జాయింట్ సెక్రటరీ పెనుబాల వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే వేగేశనకు నేరుగా ఫోన్‌చేసి నిలదీసిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నాయీ బ్రాహ్మణులను తిట్టకూడదన్న విషయం తెలియని నువ్వు ఎమ్మెల్యే ఎలా అయ్యావంటూ ఆయన మండిపడ్డారు. బీసీలతో కలిసి వారు ఓట్లేస్తేనే ఎమ్మెల్యే అయ్యావన్నది గుర్తులేకపోతే ఎలాగంటూ నిలదీశారు.
మీ కులాన్ని సామెతలతో తిట్టిపోస్తే ఊరుకుంటారా? అంటూ ప్రశ్నించారు. మనిషి పుట్టుక నుంచి చావుదాకా నాయీ బ్రాహ్మణులు ఉండాలన్న విషయం తెలుసుకోవాలన్నారు. ఇలా అన్ని వైపుల నుంచి పెద్దఎత్తున నిరసన వెల్లువెత్తడంతో ఎమ్మెల్యే ఉక్కిరిబిక్కిరయ్యారు. చివరికి.. నాయీ బ్రాహ్మణులు, బీసీ కులాల ముప్పేట దాడిని తట్టుకోలేక ఎమ్మెల్యే వర్మ దిగొచ్చి వారికి క్షమాపణలు చెబుతూ సాయంత్రం వీడియో విడుదల చేశారు.