వైఎస్సార్‌సీపీ నాయకురాలిపై హత్యాయత్నం | Assassination attempt on YSRCP leader | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నాయకురాలిపై హత్యాయత్నం

Apr 5 2026 5:00 AM | Updated on Apr 5 2026 5:00 AM

Assassination attempt on YSRCP leader

తిరుపతి జిల్లా పుత్తూరులో దారుణం 

వీధిలైట్లు ఆఫ్‌ చేసి ఇంట్లోకి చొరబడి రాడ్లతో దాడి చేసిన దుండగులు 

నిందితులకు టీడీపీ నాయకుల అండ 

దాడి చేశారని ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు 

బాధితులకు బాసటగా నిలిచిన మాజీ మంత్రి ఆర్కే రోజా 

పుత్తూరు: తిరుపతి జిల్లా గేట్‌ పుత్తూరులో కొందరు దుండగులు వైఎస్సార్‌సీపీ మహిళ నాయకురాలి కుటుంబంపై శుక్రవారం రాత్రి రెండు దఫాలు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడి లో పుత్తూరుకు చెందిన వైఎస్సార్‌సీపీ అంగన్‌వాడీ మహిళా అధ్యక్షురాలు ఎం.వాణి(40), ఆమె తమ్ముడు శ్రీకాంత్‌(26), మేనమామ చొక్కలింగం(56), చెల్లెళ్లు సుమతి(36) లోకేశ్వరి(28) పవిత్ర(28) తీవ్రంగా గాయపడ్డారు. వాణి తలకు రక్తగాయం కావడంతో 6 కుట్లు, చొక్కలింగానికి 11 కుట్లు పడ్డాయి. మిగిలిన వారికి రక్తగాయాలయ్యాయి. 

పథకం ప్రకారం జరిగిన ఈ హత్యాయత్నం కేసును పక్కదారి పట్టించేందుకు టీడీపీ నాయకులు రంగంలోకి దిగారు. ఓ దశలో రాజీ చేసుకోవాలంటూ హుకుం జారీచేశారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా శనివారం పుత్తూరు పోలీస్‌ స్టేషన్‌కు నేరుగా వచ్చి మహిళలపై జరిగిన హత్యాయత్నం కేసుపై సీఐ శేఖర్‌రెడ్డితో మాట్లాడారు.  

పాత కక్షలను మనసులో పెట్టుకుని.. 
శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో తొరూరు రోడ్డులో మోటర్‌ సైకిల్‌పై ఇంటికి వెళ్తున్న శ్రీకాంత్‌ అనే యువకుడిని ఆనంబట్టు రోడ్డుకు చెందిన శీన, మదన్, నోమేష్, మురళి అడ్డుకుని తీవ్రంగా గాయపరిచారు. తనపై జరిగిన దాడి విషయాన్ని శ్రీకాంత్‌.. తన మేనమామ చొక్క లింగం, అక్కలకు చెప్పి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారు తమపై మళ్లీ కూడా దాడి చేస్తారని వారు పోలీసులను ప్రాధేయపడ్డారు. అయినా కూడా భోజనానికి వెళ్లాలి.. రేపు రండి అంటూ పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చి పంపించారు. 

అయితే బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారన్న కోపంతో మరోమారు వారిపై దాడికి తెగబడ్డారు. వాణి ఇంటి ముందు ఉన్న వీధి లైట్లు ఆఫ్‌ చేసి ఇంట్లో ఉన్న శ్రీకాంత్, చొక్కలింగం, వాణి, సుమతి, లోకేశ్వరి, పవిత్రపై ఇనుప రాడ్లతో మరోమారు దాడి చేశారు. తమపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తారా? ఎవరు అండగా వస్తారో చూస్తామంటూ బెదిరించారు. గాయపడిన వాణి కుటుంబ సభ్యులను చుట్టుపక్కల వారు 108 ద్వారా పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  

పోలీసుల నిర్లక్ష్యంపై మాజీ మంత్రి రోజా మండిపాటు 
‘‘మహిళలనే కనీస మానవత్వం లేకుండా ఇనుప రాడ్లతో హత్యాయత్నానికి పాల్పడితే కేసు నమోదు చేయకుండా ఆలస్యం చేస్తున్నారు. మీ నిర్లక్ష్యం కారణంగానే రెండో దఫా దాడి జరిగింది. తమ సోదరుడు శ్రీకాంత్‌పై నలుగురు దాడి చేశారని, వారి నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ నలుగురు మహిళలు పోలీస్‌ స్టేషన్‌కు  వెళ్లి ఫిర్యాదు చేస్తే భోజనానికి వెళ్లాలి.. రేపు రండి అంటూ సమాధానం చెప్పడం ఎంతవరకు సమంజసం ? ఇంత జరిగినా కేసు నమోదు చేయకపోతే ఏమనుకోవాలి? జరిగిన దారుణం కంటి ముందు కనిపిస్తోంది’’ అంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా సీఐ శేఖర్‌రెడ్డిని నిలదీశారు.  

Advertisement
 
Advertisement
Advertisement