వెంకటరెడ్డి
పల్నాడులో టీడీపీ జంగిల్ రాజ్
మందా సాల్మన్ హత్య మరువకముందే మరో వైఎస్సార్‌సీపీ నేతపై హత్యాయత్నం
దాచేపల్లి మండలం రామాపురం ఎంపీటీసీ భర్త వెంకటరెడ్డిపై దాడి
దారికాచి ఇనుపరాడ్లు, సుత్తులతో చెలరేగిన గూండాలు.. ఊళ్లో ఉంటే చంపేస్తామని బెదిరింపులు
తీవ్రంగా గాయపడిన వెంకటరెడ్డికి పిడుగురాళ్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స
పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి
దాచేపల్లి: ఒకప్పుడు జంగిల్‌రాజ్ అంటే బిహార్ గుర్తుకొచ్చేది. ఇప్పుడు పల్నాడులో జంగిల్‌రాజ్ అరాచకత్వం రాజ్యమేలుతోంది. పచ్చినెత్తురు మరిగిన పచ్చమూకలు రెచ్చిపోతున్నాయి. టీడీపీ ఫ్యాక్షన్ దాహాగ్ని చల్లారడం లేదు. గురజాల నియోజకవర్గంలో మందా సాల్మన్ హత్యను మరవక ముందే మరో వైఎస్సార్‌సీపీ నేతపై టీడీపీ గూండాలు హత్యాయత్నానికి తెగబడ్డారు.
దాచేపల్లి మండలం రామాపురం ఎంపీటీసీ సభ్యురాలు ఆకూరి రాజేశ్వరి భర్త, వైఎస్సార్‌సీపీ నేత ఆకూరి వెంకటరెడ్డిపై దారికాచి ఇనుపరాడ్లు, సుత్తులతో దాడి చేశారు. భీతావహ వాతావరణం సృష్టించారు. వెంకటరెడ్డి చనిపోయాడని భావించి వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన వెంకటరెడ్డి ప్రస్తుతం పిడుగురాళ్లలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కారుతో అడ్డగించి బీభత్సకాండ
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వెంకటరెడ్డిని పలుమార్లు టీడీపీ నాయకులు తీవ్రస్థాయిలో బెదిరించారు. ఊళ్లో ఉంటే చంపేస్తామని హెచ్చరించారు. అయినా చలించని వెంకటరెడ్డి ప్రతి రోజూ ఉదయాన్నే రామాపురం నుంచి దాచేపల్లికి వచ్చి తన పనులు చూసుకుని రాత్రికి సొంతూరికి వస్తున్నారు. బుధవారం ఉదయం ఇంటినుంచి ద్విచక్ర వాహనంపై వెంకటరెడ్డి దాచేపల్లికి బయలుదేరగా.. అద్దంకి–నార్కెట్‌పల్లి హైవే రోడ్డు వద్ద టీడీపీ నాయకులు కారుతో అడ్డగించారు.
వెంకటరెడ్డి చొక్కా పట్టుకుని లాగి కిందపడేశారు. ఇనుపరాడ్లు, ఇనుప సుత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ దాడిలో వెంకటరెడ్డి రెండుకాళ్లకు, కుడి చేతికి బలమైన గాయాలు కాగా ఎడమచేయి ఎముకలు విరిగాయి. 10మందికిపైగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు వెంకటరెడ్డిపై దాడికి తెగబడ్డారు. ‘‘ఎంత ధైర్యం ఉంటే వైఎస్సార్‌సీపీ తరఫున తిరుగుతావు.. నువ్వు ఊళ్లో నుంచి వెళ్లాల్సిందేరా నా కొడకా అంటూ దుర్భాషలాడారు.
దాడిలో వెంకటరెడ్డి చనిపోయాడని భావించిన టీడీపీ నాయకులు దర్జాగా కారులో రామాపురం ఊరిలోకి వెళ్లి సంబరాలు చేసుకున్నారు. తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉన్న వెంకటరెడ్డిని స్థానికులు గమనించి ఆటో ద్వారా దాచేపల్లికి తీసుకువచ్చి అక్కడి నుంచి మెరుగైన వైద్య సేవల కోసం పిడుగురాళ్లలోని పల్నాడు హాస్పిటల్స్‌కు తరలించారు.
వైఎస్సార్‌సీపీ అద్దంకి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి ఆశోక్‌కుమార్ గాయపడిన వెంకటరెడ్డికి వైద్య సేవలు అందించారు. ఆకూరి వెంకటరెడ్డిని ఆ పార్టీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి పరామర్శించి, దాడి గురించి అడిగి తెలుసుకున్నారు. టీడీపీ నేతల దాష్టీకాన్ని తీవ్రంగా ఖండించారు.


