
ట్రంప్ టారీఫ్‌ల నేపథ్యంలో సంక్షోభంలో ఆక్వా సాగు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ఆదుకోవాలి
సీఎంకు, మత్స్యశాఖామంత్రులకు వినతిపత్రాలు
జిల్లా స్థాయిలో సదస్సులు.. నిరసన కార్యక్రమాలు
కేంద్రం దిగిరాకుంటే భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ
‘ట్రంప్ పన్నులు–ఆక్వా రైతుల ప్రభావం’పై రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
సాక్షి, అమరావతి: ట్రంప్ టారీఫ్‌ల నేపథ్యంలో సంక్షోభంలో కూరుకుపోతున్న ఆక్వా రంగాన్ని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఇందుకోసం దశల వారీగా ఆందోళనలు చేపట్టడం ద్వారా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పన్నులు–ఆక్వా రంగం ప్రభావంపై విజయవాడ బాలోత్సవ భవన్లో ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య అధ్యక్షతన మంగళవారం రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
సంక్షోభం నుంచి ఆక్వా రైతులను ఆదుకోవాలని వక్తలు డిమాండ్ చేశారు. దీనిపై మత్స్య శాఖ మంత్రి, ముఖ్యమంత్రిలకు వినతిపత్రాలు ఇవ్వాలని, ఆక్వా సాగు ఉన్న అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సులు, బహిరంగ నిరసనలు తెలియజేయాలని నిర్ణయించారు. సమావేశంలో తొలుత ఏపీ రైతుసంఘం పూర్వ రాష్ట్ర అధ్యక్షులు బి.బలరాం మాట్లాడుతూ రాష్ట్రంలో 8 తీరప్రాంత జిల్లాల్లో 4 లక్షల ఎకరాలకు పైగా సాగవుతున్న ఆక్వా రంగంపై లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారని చెప్పారు.
ఏటా రాష్ట్రం నుంచి 7.16 లక్షల టన్నులు ఆక్వా ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని పేర్కొన్నారు. ఆక్వా ఎగుమతులపై అమెరికా సుంకాలను 50 శాతానికి పెంచడంతో టన్నుకు రూ.లక్ష నుంచి రూ.50 వేలు అదనంగా చెల్లించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
రొయ్యల ధరలు పతనం
ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య మాట్లాడుతూ ట్రంప్ సుంకాల ప్రభావంతో ఇప్పటికే రొయ్యల ధరలు పతనమయ్యాయని, ఇతర దేశాలకు ఎగుమతి చేసే రొయ్యలు, కౌంట్ ధరలను కూడా తగ్గించేశారని విమర్శించారు. రైతులు సుమారు టన్నుకు రూ.40వేల వరకు నష్టపోతున్నారని వివరించారు. రైతు సంఘం నేత వై. కేశవరావు మాట్లాడుతూ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఎంపెడా ద్వారా ధరలు తగ్గకుండా చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికపై ఏపీ కౌలురైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు ప్రవేశపెట్టిన తీర్మానాలను రౌండ్ టేబుల్‌సమావేశం ఆమోదించింది.
రౌండ్ టేబుల్ సమావేశంలో ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి. రమాదేవి, ఆక్వా టెక్ ఎడిటర్ కోనా జోసెఫ్, ఆక్వా రంగం నిపుణులు షేక్ అలీ హుస్సేన్, ఆక్వా రైతుల సంఘం పశి్చమగోదావరి జిల్లా కనీ్వనర్ ఆర్.సూర్యనారాయణ రాజు (యువరాజు), సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు ఎ.వి.నాగేశ్వరరావు, వ్యవసాయ కారి్మక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి పాల్గొన్నారు.
తీర్మానాలివీ..
» కేంద్ర ప్రభుత్వం ఎంపెడా కౌంటర్ గ్యారెంటీ ఇచ్చి ఆక్వా ఉత్పత్తుల ధరలకు భరోసా ఇవ్వాలి.
» కేంద్ర ఎక్స్‌పోర్టర్స్ ధర తగ్గించి కొనుగోలు చేయకుండా తగు చర్యలు తీసుకోవాలి.
» అమెరికా సుంకాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి.
» ఆక్వా రంగాన్ని వ్యవసాయంగా గుర్తించాలి. దేశంలో అంతర్గత (డొమెస్టిక్) వినియోగానికి చర్యలు తీసుకోవాలి.
» నాణ్యమైన సీడ్, ఫీడ్ అందేలా చూడాలి. ధరలు నియంత్రించాలి. విద్యుత్ రాయితీ అమలు చేయాలి.