భగ్గుమన్న ఆక్వా రైతులు | Aqua farmers fires on Chandrababu Govt for Increase in feed prices | Sakshi
Sakshi News home page

బాబు ప్రభుత్వ తీరుపై భగ్గుమన్న ఆక్వా రైతులు

May 13 2026 5:07 AM | Updated on May 13 2026 5:07 AM

Aqua farmers fires on Chandrababu Govt for Increase in feed prices

పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం ప్రధాన రహదారిపై మేత బస్తాలకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేస్తున్న ఆక్వా రైతులు

మేత ధరల పెంపుపై ఆందోళన 

ఫీడ్‌ బస్తాలకు నిప్పుపెట్టి నిరసన 

రాష్ట్రంలో పలుచోట్ల రాస్తారోకోలు, ధర్నాలు 

సాగు సమ్మెకు సిద్ధమన్న రైతులు

సాక్షి, అమరావతి/పాలకొల్లు సెంట్రల్‌/ఒంగోలు సబర్బన్‌: ఆక్వా ఫీడ్‌ కంపెనీలు భారీగా ధరలను పెంచడంపై ఆక్వా రైతులు భగ్గుమన్నారు. ధరల పెంపును అడ్డుకోవడంలో విఫలమైన ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఆందోళనలకు దిగారు. ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టి చంద్రబాబు ప్రభుత్వ తీరుపై నిరసన గళం విప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో మేత బస్తాలకు నిప్పుపెట్టారు. ధరల పెంపు అమల్లోకి వచ్చాక అడ్డుకుంటామన్న ప్రభుత్వ ప్రకటనపై మండిపడ్డారు. ప్రభుత్వానికి తెలియకుండా కంపెనీలు ఏకపక్షంగా ఫీడ్‌ ధరలు ఏ విధంగా పెంచుతాయని నిలదీశారు.  

మేత బస్తాలకు నిప్పుపెట్టి.. 
ఏపీ ఆక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (అప్సడా) అనుమతి లేకుండానే ఫీడ్‌ కంపెనీలు మేత ధరలను టన్నుకు రూ.8,420 నుంచి రూ,10,530 వరకు పెంచడాన్ని నిరసించారు. మూడు నెలల వ్యవధిలో రెండుసార్లు ఫీడ్‌ ధరలు పెంచిన కంపెనీల ఏకపక్ష ధోరణిపై కన్నెర్రజేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు. పెంచిన ఫీడ్‌ ధరలను తక్షణమే ఉపసంహరించుకోవడంతో పాటు కనీస గిట్టుబాటు ధరలు కల్పించకపోతే సాగు సమ్మెకు దిగుతామని నరసాపురం, ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాలకు చెందిన రైతులు అల్టిమేటం ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. మేత బస్తాలకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు. 

ప్రకాశం జిల్లా  ఒంగోలులో జిల్లా మత్స్యశాఖ కార్యాలయం ఎదుట రొయ్య రైతులు ధర్నా చేశారు. ఫీడ్‌ కంపెనీలకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫీడ్‌ తయారీలో వాడే ముడి పదార్థాల ధరలు పెరగలేదని.. సోయా మీల్‌ ధర కిలోకు రూ.100 నుంచి రూ.35కు తగ్గాయని చెప్పారు. వేట నిషేధ వేళలో ఏటా పెరిగే ఫిష్‌మీల్‌ ధరలను సాకుగా చూపి ధరలు పెంచడం అన్యాయమని ధ్వజమెత్తారు. ఫీడ్‌ కంపెనీలన్నీ టీడీపీ నేతల చేతుల్లోనే ఉన్నాయని, ప్రభుత్వానికి చెప్పకుండా, పెద్దల అనుమతి లేకుండా ఏ విధంగా ఫీడ్‌ ధరలు పెంచుతాయని సంఘం నేతలు ప్రశ్చించారు. తక్షణం పెంచిన ఫీడ్‌ ధరలను ఉపసంహరించుకోవాలని, అప్సడా అనుమతి లేకుండా ధరలు పెంచిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేశాయి. 

ఇలాగైతే క్రాప్‌ హాలిడే ప్రకటిస్తాం 
ఆక్వా ఫీడ్‌ ధరలను కంపెనీలు ఏకపక్షంగా పెంచడాన్ని నిరసిస్తూ ఆగస్టు 1 నుంచి సెపె్టంబర్‌ 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా క్రాప్‌ హాలిడే ప్రకటించాలని జై భారత్‌ క్షీరారామ ఆక్వా రైతు సంఘం నిర్ణయించింది. మంగళవారం పాలకొల్లులో నిర్వహించిన అత్యవసర సమావేశంలో సంఘాధ్యక్షుడు గొట్టుముక్కల గాం«దీభగవాన్‌రాజు మాట్లాడుతూ.. వనామీ రొయ్య ఫీడ్‌పై కేజీకి రూ.8, టైగర్‌ రొయ్య ఫీడ్‌పై రూ.10 పెంచడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ముడిసరుకు ధరలు తగ్గినప్పుడు ధరలు తగ్గించని కంపెనీలకు, ఇప్పుడు పెంచాలనే ఆతృత ఎందుకని ప్రశ్చించారు. ప్రభుత్వం కూడా రైతుల కంటే కంపెనీలకే ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తోందని విమర్శించారు. సమస్య పరిష్కారమయ్యే వరకు కంపెనీలతోపాటు ప్రభుత్వంతోనూ పోరాటానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తొలుత ధరలు పెంచిన కంపెనీలను బహిష్కరించాలని, ఫ్యాక్టరీల వద్ద ధర్నాలు చేపట్టాలని రైతులకు పిలుపునిచ్చారు. బుధవారం రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించి భవిష్యత్‌ కార్యాచరణ ఖరారు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆక్వా సంఘం కార్యదర్శి బోణం చినబాబు, రంగయ్య నాయుడు, జాన్‌రాజు పాల్గొన్నారు. 

నేడు ఆక్వా రైతులు, ఫీడ్‌ కంపెనీలతో భేటీ 
ఆక్వా రైతుల ఆందోళనలు, నిరసనల నేపథ్యంలో వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు స్పందించారు. ఫీడ్‌ కంపెనీలు ఏకపక్షంగా ధరలు పెంచడం సరైన విధానం కాదని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే సాగు వ్యయాలు పెరిగి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులపై ధరల పెంపు మరింత భారంగా మారుతుందన్నారు. అప్సడా చట్టం ప్రకారం రైతు సంఘాలతో చర్చించిన తర్వాత మాత్రమే ధరల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నప్పటికీ, ఫీడ్‌ కంపెనీలు ఏకపక్షంగా పెంచేశాయని ఆరోపించారు. పెంచిన ధరల అమలును తక్షణమే నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ అంశంపై రైతు సంఘాలు, ఫీడ్‌ తయారీ సంస్థల ప్రతినిధులతో బుధవారం సమావేశమై చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని  తెలిపారు. 

మేత ధరల పెంపును అడ్డుకోవాలి 
మేత ధరల పెంపును అడ్డుకోవాలని ఏపీ వ్యవసాయ మిషన్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. టైగర్‌ రొయ్యల మేతపై టన్నుకు రూ.10,530, వెనామీ రొయ్యల మేత ధర రూ.8,420 చొప్పున పెంచడంతో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతుందన్నారు. ఇప్పటికే వైరస్‌లతో దిగుబడులు రాక, కౌంట్‌ ధరలు పతనమై అల్లాడుతున్న ఆక్వా రైతులకు ఈ ధరల పెంపు అశనిపాతంగా మారిందన్నారు. తక్షణమే అప్సడా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి మేత ధరలను పూర్తిస్థాయిలో ఉపసంహరింపజేయాలని డిమాండ్‌ చేశారు. కాగా.. ఆక్వా రైతులతో సంప్రదించకుండా మేత ధరలు పెంచడాన్ని ఏపీæ కౌలు రైతుల సంఘం అధ్యక్షుడు బి.బలరామ్, కార్యదర్శి ఎం.హరిబాబు తప్పుబట్టారు. మూడు నెలల్లో రెండోసారి ధరలు పెంచడం సరికాదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండేళ్లుగా రొయ్య రైతులు గిట్టుబాటు ధరలేక తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. పెంచిన ఫీడ్‌ ధరలతో పాటు ఫిబ్రవరిలో పెంచిన ధరలను కూడా పూర్తిగా ఉపసంహరింప చేయాలని డిమాండ్‌ చేశారు. ఏకపక్షంగా ధరలు పెంచిన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

Advertisement
 
Advertisement
Advertisement