చట్టసభల్లో పనిచేసిన అనుభవంలేని వ్యక్తిని అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌గా ఎలా నియమిస్తారు?
కనీసం విద్యార్హతలను కూడా పట్టించుకోని ప్రభుత్వం
ఎస్‌ఓ కంటే తక్కువ కేడర్ ఉద్యోగికి అసెంబ్లీలో అత్యున్నత పోస్టా?
సీఎస్ కంటే అత్యధికంగా రూ.4.90 లక్షల జీతమా?
వెంటనే ఆయన్ను తొలగించాలి.. లేకుంటే న్యాయ పోరాటం చేస్తాం
ప్రభుత్వానికి ఏపీజీఈఎఫ్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి హెచ్చరిక
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసన వ్యవస్థలో అర్హతలేకుండా అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌గా నియమితులైన సూర్యదేవర ప్రసన్నకుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని ఏపీ ప్రభుత్వోద్యోగుల సమాఖ్య చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. సెక్షన్ ఆఫీసర్ (ఎస్‌వో) కంటే తక్కువ కేడర్ వ్యక్తిని తీసుకొచ్చి అసెంబ్లీలో అత్యున్నత పదవిని కట్టబెట్టడమే కాక ఏకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) స్థాయి హోదాను కల్పించడం చంద్రబాబు ప్రభుత్వ దిగజారుడు రాజకీయానికి నిదర్శనమన్నారు. వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు చెందిన ప్రసన్నకుమార్‌ను ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌గా తప్పుడు పద్ధతిలో నియమించారని చెప్పారు. కాకర్ల ఏమన్నారంటే..
2024 ఆగస్టులో అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌గా సూర్యదేవర ప్రసన్నకుమార్‌ను ప్రభుత్వం నియమించింది. అందులో ప్రసన్నకుమార్ సుప్రీంకోర్టు మాజీ రిజిస్ట్రార్ జనరల్‌గా పేర్కొంది. కానీ, సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌గా ప్రసన్నకుమార్ నియామకం చెల్లదని అన్ని మీడియాల్లో వచ్చింది. సుప్రీంకోర్టు అతని డెçప్యుటేషన్ నియామకాన్ని రద్దుచేసి ఆయన మాతృసంస్థ ప్రసార భారతికి తిరిగి పంపించింది. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించలేదు.
చట్టసభల్లో పనిచేసిన అనుభవమే లేదు..
లోక్‌సభ/రాజ్యసభలో లేదా ఇతర రాష్ట్రాల అసెంబ్లీల్లో సెక్రటరీ జనరల్‌గా పనిచేసిన వారిని మాత్రమే అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌గా నియమించాలి. కానీ, ప్రసన్నకుమార్‌కు ఎక్కడా ఈ అనుభవంలేదు. మరి అలాంటి వ్యక్తిని ఎలా నియమించారు? కనీసం విద్యార్హతలైనా ప్రభుత్వం చూసిందా? అసెంబ్లీ సర్వీసు నిబంధనల ప్రకారం అసెంబ్లీలో ఉప కార్యదర్శి, ఆపై పోస్టుల్లో వ్యక్తులు తప్పనిసరిగా న్యాయ విద్యలో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ప్రసన్నకుమార్‌కు ఆ అర్హత ఉందో లేదో ఎవరికీ తెలీదు. దీనిపై సమాచార హక్కు చట్టం కింద సమాచారం అడిగితే దాటవేశారు.
ప్రసన్నకుమార్‌కు చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పోస్టు కట్టబెట్టి అసెంబ్లీ శాశ్వత ఉద్యోగులను నిలువునా ముంచేసింది. వాస్తవానికి.. ప్రసన్నకుమార్ ప్రసార భారతిలో న్యూస్ రీడర్–ట్రాన్స్‌లేటర్‌గా మాత్రమే పనిచేశారు. ఇది రాష్ట్ర అసెంబ్లీలో సెక్షన్ ఆఫీసర్ కంటే కిందస్థాయి పోస్టు. ఇక సచివాలయ ఉద్యోగులు పదోన్నతులు అడిగితే.. మీరు సరిగ్గా పనిచేయరు, నేను బయటి వ్యక్తులను తెచ్చుకుని పనిచేసుకుంటానని ప్రసన్నకుమార్ బెదిరిస్తున్నారు.
దుర్బుద్ధితో ప్రసన్నకుమార్ నాటకం..
ప్రస్తుతం అసెంబ్లీ సీనియర్ ఉద్యోగుల్లో జాయింట్ డైరెక్టర్ విజయరాజు పదోన్నతులకు ముందువరుసలో ఉన్నారు. ఆయనకు పదోన్నతి లభిస్తే అడిషనల్ సెక్రటరీ, ఆ తర్వాత సెక్రటరీ హోదా వస్తుంది. కానీ, తప్పుడు ఆరోపణలతో విజయరాజును సస్పెండ్ చేశారు. ఆ తర్వాత మళ్లీ సర్వీసులోకి తీసుకున్న సమయంలో ప్రభుత్వం ‘పెండింగ్ ఎంక్వైరీ’ వేసింది.
కానీ, ఏడాది నుంచి విచారణ కమిటీని నియమించకుండా.. తప్పు జరిగిందో లేదో తేల్చకుండా తాత్సారం చేస్తున్నారు. విచారణ జరిపితే విజయరాజు తప్పులేదని తేలడమే కాక అప్పుడు ఆయనకు పదోన్నతి కల్పించాల్సి వస్తుంది. ఇదే జరిగితే తన పోస్టును కోల్పోతాననే దుర్బుద్ధితో ప్రసన్నకుమార్ నాటకం అడుతున్నారన్నారు.


