
సాక్షి, అమరావతి: కోవిడ్ సమయంలో ప్రభుత్వ సేవల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రశంసించింది. సంక్షేమ పథకాల అమల్లో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్న తీరును మెచ్చుకోవడమే కాకుండా ఈ అనుభవాన్ని ప్రపంచంతో పంచుకోవాలని కోరింది. ఈ మేరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అధ్యక్షులు బోర్గ్ బ్రండే.. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డికి లేఖ రాశారు.
కోవిడ్–19 తర్వాత ప్రజా సేవలు, ఆర్థికాభివృద్ధిలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ప్రపంచానికి తెలిసొచ్చిందని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏప్రిల్‌లో ‘గ్లోబల్ టెక్నాలజీ గవర్నెన్స్ సమ్మిట్’ పేరిట జపాన్ రాజధాని టోక్యోలో అంతర్జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సదస్సును ప్రత్యక్షంగా లేదా వర్చువల్‌గా నిర్వహించబోతున్నామని, ఇందులో పాల్గొని రాష్ట్రం తన అనుభవాలను పంచుకోవాలని కోరారు. ఈ సదస్సుకు వివిధ దేశాల ప్రభుత్వాధినేతలతోపాటు వివిధ రాష్ట్రాల మంత్రులు, వ్యాపార, వాణిజ్య రంగాల ప్రముఖులు హాజరు కానున్నారు.