సామాజిక సేవ చేయండి

AP High Court orders Ananthapur DEO in contempt of court case - Sakshi

వారం పాటు భోజన ఖర్చులు భరించండి

కోర్టు ధిక్కార కేసులో అనంతపురం డీఈవోకు హైకోర్టు ఆదేశం

సాక్షి, అమరావతి: కోర్టు ధిక్కార కేసులో అనంతపురం జిల్లా విద్యాశాఖాధికారి (డీఈవో) కె.శామ్యూల్‌కు హైకోర్టు సామాజిక సేవను శిక్షగా విధించింది. అనంతపురం జిల్లాలోని ఏదైనా వృద్ధాశ్రమం లేదా అనాథ ఆశ్రమంలో ఉన్న వారికి వారం రోజుల పాటు భోజన ఖర్చులను భరించాలని ఆయనను ఆదేశించింది. ఆ వివరాలను తమ ముందుంచాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడమంటే కోర్టులను అవమానించడమేనంది. కోర్టు ఆదేశాలను అధికారులు అమలు చేసేలా తగిన చర్యలు చేపట్టాలని అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌కు స్పష్టం చేసింది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నోషనల్‌ సీనియారిటీని కల్పించే విషయంలో అనంతపురం జిల్లాకు చెందిన సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పి.వెంకటరమణ 2019లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు ఆయనకు నోషనల్‌ సీనియారిటీ కల్పించాలంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. అయితే అధికారులు ఈ ఆదేశాలను అమలు చేయకపోవడంతో వెంకటరమణ గతేడాది కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌.. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, అప్పటి కమిషనర్‌ చినవీరభద్రుడు, అనంతపురం డీఈవో శామ్యూల్‌ వ్యక్తిగత హాజరుకు ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాల మేరకు వారంతా సోమవారం కోర్టు ముందు హాజరయ్యారు. కోర్టు ఆదేశాల అమలులో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, చినవీరభద్రుడు కారణం కాదని న్యాయమూర్తి తేల్చారు. డీఈవో శామ్యూల్‌ వల్లే కోర్టు ఆదేశాల అమలులో జాప్యం జరిగిందన్నారు. ఇందుకు ఆయనను బాధ్యుడిని చేస్తూ సామాజిక సేవను శిక్షగా విధించారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top