మీకిదే చివరి అవకాశం.. కౌంటర్‌ దాఖలు చేయండి

AP HC Order To Central Govt To File Counter On Vizag Steel Plant Privatisation - Sakshi

సాక్షి, అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై కౌంటర్‌ దాఖలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు మరికొంత గడువునిచ్చింది. తదుపరి విచారణ కల్లా పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్రానికి హైకోర్టు స్పష్టం చేసింది. ఇదే చివరి అవకాశమని తేల్చి చెప్పింది. కౌంటర్‌ దాఖలులో జాప్యం చేయడంపై అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి కేసుల్లో జాప్యం తగదన్న హైకోర్టు.. తదుపరి విచారణను ఆగస్టు 2కి వాయిదా వేసింది. ఈ మేరకు సీజే జస్టిస్‌ అరూప్‌కుమార్‌గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది.

ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిమిత్తం కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించి, దాన్ని రద్దు చేయాలని కోరుతూ విశ్రాంత ఐపీఎస్‌ అధికారి వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ (జేడీ లక్ష్మీనారాయణ) పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది కౌంటర్‌ దాఖలుకు మరో వారం గడువు కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ తదుపరి విచారణ కల్లా కౌంటర్‌ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. జేడీ లక్ష్మీనారాయణ తరఫున సీనియర్‌ న్యాయవాది  ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ, ప్రైవేటీకరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం  29న బిడ్డింగ్‌ ప్రక్రియ చేపట్టేందుకు సర్వం సిద్ధం చేస్తోందన్నారు. అలాంటిదేం లేదని కేంద్ర ప్రభుత్వ న్యాయవాది తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top