పొగాకు రైతుల పేరుతో హడావుడి సమీక్ష
ధరల స్థిరీకరణ, రైతుకు మద్దతు ధరపై చర్చ
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులను ఆదుకుంటాయని వెల్లడి
సాక్షి, అమరావతి: పొగాకు రైతుల సమస్యలపై ఇన్నాళ్లు స్పందించని రాష్ట్ర ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని రైతులు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్న తర్వాత ప్రభుత్వంలో ఒక్కసారిగా కదలిక వచ్చింది. రైతులకు అండగా ఉంటానని, పది రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటానని వైఎస్ జగన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం హడావుడిగా సమీక్ష నిర్వహించి, రైతులను ఆదుకుంటున్నామనే సంకేతాలిచ్చేందుకు ప్రయత్నించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
హడావుడిగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించి..
ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం హడావుడిగా నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో పొగాకు ధరల స్థిరీకరణ, రైతులకు మద్దతు అంశాలపై చర్చించారు. పొగాకు కొనుగోళ్లకు కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మద్దతిచ్చేందుకు అంగీకరించాయని, ధరల లోటు భర్తీ కింద కిలోకు రూ.15 చొప్పున కేంద్రం, రూ.5 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం కలిపి.. రూ.20 చొప్పున రైతులకు చెల్లించేలా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ పథకం కోసం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.188 కోట్లు భరించనున్నట్లు తెలిపారు. మొత్తం 94 మిలియన్ కిలోల పొగాకు కొనుగోళ్లకు ఈ మద్దతు వర్తించేలా చర్యలు చేపడతామన్నారు.
బ్రైట్ గ్రేడ్ పొగాకు ధర కిలోకు రూ.240, మీడియం గ్రేడ్ రూ.190, లోగ్రేడ్ రూ.110 కంటే తగ్గకుండా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు ఆదేశాలిచ్చారు. పొగాకు రైతుల సమస్యలపై రెండు రోజుల కిందట కేంద్ర వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి, డైరెక్టర్‌తో సమావేశమైనట్లు వెల్లడించారు. అయితే ఈ నిర్ణయాల వెనుక నిజంగా రైతుల సమస్యలపై చిత్తశుద్ధి ఉందా? లేక రాజకీయపరమైన ఒత్తిడి కారణంగానే ప్రభుత్వం స్పందించిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నికల హామీల తరహాలో ప్రకటనలు చేయడం కాకుండా, రైతులకు వాస్తవంగా నిధులు ఎప్పుడు చేరతాయి? బయ్యర్లు ప్రకటించిన ధరలను నిజంగా అమలు చేస్తారా? ధరల లోటు భర్తీని ఏ విధానంలో చెల్లిస్తారు? అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.


