సీఎం జగన్‌ హామీ.. ఏపీ సర్కార్‌ కీలక ఉత్తర్వులు

AP Govt Orders Merged Ganapavaram Mandal In West Godavari District - Sakshi

సాక్షి, గణపవరం/ భీమవరం(పశ్చిమ గోదావరి): గణపవరం మండలాన్ని పశ్చిమగోదావరి జిల్లాలోకి చేరుస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గణపవరం మండలాన్ని ఏలూరు రెవెన్యూ డివిజన్‌ నుంచి భీమవరం రెవెన్యూ డివిజన్‌లోకి మారుస్తూ రెవెన్యూ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సాయిప్రసాద్‌ పేరుమీద గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

దీనిపై ఏమైనా అభ్యంతరాలు, సూచనలు, సలహాలు ఇవ్వాలనుకుంటే 30 రోజుల్లోపు కలెక్టర్‌కు సమర్పించాలని సూచించారు. ఈ ఏడాది మే నెలలో గణపవరంలో జరిగిన రైతు భరోసా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక నేతల విజ్ఞప్తి మేరకు గణపవరం మండలాన్ని భీమవరం రెవెన్యూ డివిజన్‌లో కలిపేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టమైన హామీ ఇచ్చారు. గణపవరం మండలాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో కలుపుతామని సభాముఖంగా ప్రకటించారు. ఈ మేరకు చర్యలు తీసుకున్నారు.

20 మండలాలతో జిల్లా 
జిల్లాల పునర్విభజనతో పశ్చిమగోదావరి జిల్లా 19 మండలాలు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, ఆకివీడు మున్సిపాలిటీలతో ఏర్పడింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు రెవెన్యూ డివిజన్లతో 2,178 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 17.80 లక్షల జనాభా కలిగి ఉంది. ఇదిలా ఉండగా ఏలూరు జిల్లాలోని గణపవరం మండలాన్ని పశ్చిమలో విలీనం చేయడంతో మండలాల సంఖ్య 20కి చేరనుంది. అలాగే  100 చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణం, 65 వేల మంది జనాభా పెరగనుంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top