ఆలయ ఘటనలపై 'సిట్'‌ స్పీడ్

AP Govt has set up the SIT Investigation On Destruction of idols in Temples - Sakshi

గత సెప్టెంబర్‌ నుంచి జరిగిన అన్ని ఘటనలపై సిట్‌ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం 

16 ప్రధాన ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ 

సంక్రాంతి రోజుల్లోనూ నిర్విరామంగా విధులు 

3 రోజుల పాటు రామతీర్థంలో క్షేత్రస్థాయి దర్యాప్తు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఒక పథకం ప్రకారం జరిగిన ఆలయ ఘటనలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) జెట్‌ స్పీడ్‌తో పనిచేస్తోంది. గతేడాది సెప్టెంబర్‌ 5 నుంచి పలు ఆలయాల్లో జరిగిన విగ్రహాల ధ్వంసం తదితర ఘటనలపై విచారణకు ఈ నెల 8వ తేదీన ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా జీవీజీ అశోక్‌కుమార్‌ నేతృత్వంలో 16 మందితో కూడిన సిట్‌.. సంక్రాంతి రోజుల్లోనూ నిర్విరామంగా విధులు నిర్వహించింది. దేవాలయాలపై దాడుల విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉండటంతో.. సిట్‌ కూడా దర్యాప్తు ప్రక్రియలో స్పీడ్‌ పెంచింది. బృందంలోని 16 మంది వేర్వేరు టీమ్‌లుగా విడిపోయి ముఖ్యమైన కేసులను భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. 

కుట్ర కోణంపై  ఆరా 
ముఖ్యమైన 16 కేసులపై సిట్‌ దర్యాప్తు చేపట్టింది. వాటికి సంబంధించిన ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్‌), కేసు డైరీ తదితర అన్ని వివరాలను సేకరించింది. వాటిలో ఇప్పటికే 50 శాతంపైగా కేసులను నిగ్గు తేల్చిన పోలీసులు అరెస్టులు కూడా చేశారు. అయితే ఆ 16 ప్రధాన కేసులపై దృష్టి సారించిన సిట్‌ వాటి వెనుక కుట్ర కోణం ఏమైనా ఉందా అనేది కూడా ఆరా తీస్తోంది. గత మూడు రోజుల్లో విజయనగరం జిల్లా రామతీర్థం కొండపై క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేసింది. సిట్‌ చీఫ్‌ అశోక్‌కుమార్‌ స్వయంగా రామతీర్థం ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. స్థానికులు, అర్చకులు, విజయనగరం జిల్లా పోలీసుల నుంచి పలు వివరాలు సేకరించారు.  

జిల్లా స్థాయిలో  దర్యాప్తు బృందాలు 
ముఖ్యమైన ఘటనలపై సిట్‌ దర్యాప్తు కొనసాగిస్తుండగా.. మిగతా కేసుల విషయంలో ఆయా జిల్లాల స్థాయిలో స్థానిక పోలీసులతో దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు ఎప్పటికప్పుడు దర్యాప్తు వివరాలను సిట్‌కు అందజేస్తాయి. జిల్లా ఎస్పీల పర్యవేక్షణలో పనిచేసే స్థానిక పోలీస్‌ టీమ్‌లకు అవసరమైన సమయంలో సిట్‌ దిశా నిర్దేశం చేస్తోంది. దీనివల్ల మొత్తం కేసుల దర్యాప్తు త్వరితగతిన పూర్తి అవుతుందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top