
ఆర్టీఈ ప్రవేశాలపై ప్రభుత్వ జాప్యం
స్కూళ్ల స్టార్ రేటింగ్ ప్రకారం రూ.8,500 నుంచి రూ.14,500 వరకు నిర్ణయం
ఈ ఏడాది ఆర్టీఈ అడ్మిషన్లు తీసుకోని ప్రైవేటు స్కూళ్లు..
31701 మందికి సీట్లు కేటాయింపు..
సగం మందినే చేర్చుకున్న యాజమాన్యాలు
ఆర్థికంగా నష్టపోయిన పేద తల్లిదండ్రులు
అమరావతి: బాలల ఉచిత నిర్బంధ విద్యాహక్కు (ఆర్టీఈ) చట్టం ద్వారా 2025–26 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం ఫీజులను ఖరారు చేసింది. పాఠశాలల్లో కల్పిస్తున్న సదుపాయాలను అనుసరించి రూ.8,500 నుంచి గరిష్టంగా రూ.14,500 వరకు ఫీజులను నిర్ణయించింది. గతేడాది కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో ఉన్న మౌలిక సదుపాయాల ప్రకారం ఒకటి నుంచి ఐదు వరకు “స్టార్’ రేటింగ్ ఇచ్చింది. ఈ రేటింగ్‌ను అనుసరించే ఫీజులను ఖరారు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీఈ చట్టం ప్రకారం పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో ఒకటో తరగతిలో ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ చట్టం ద్వారా పిల్లలను చేర్చుకున్న స్కూళ్లకు ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుంది. వాస్తవానికి ఈ ఫీజులను విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఖరారు చేసి ఆర్టీఈ ప్రవేశాలు కల్పించాలి. కానీ ప్రభుత్వం ఏప్రిల్‌లో కమిటీని నియమించింది. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాల్సి ఉండగా, నాలుగు నెలల సమయం పట్టింది. ఇంతలో ఆర్టీఈ ప్రవేశాలు చేపట్టడం, ప్రైవేటు యాజమాన్యాలు విద్యార్థులను తిరస్కరించడం వంటి కారణాలతో ఉచిత సీట్లు వచ్చినా చేసేది లేక చాలామంది తల్లిదండ్రులు వేరే స్కూళ్లలో పిల్లలను చేర్పించేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ ఏడాది ఆర్టీఈ చట్టం ద్వారా సీట్లు పొందిన వేలాది మంది నిరుపేద తల్లిదండ్రులకు ఆర్థికంగా నష్టపోయారు.
32 వేల మందిలో సగం మందికే అడ్మిషన్లు
సుప్రీంకోర్టు ఆదేశాలు, కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం పిల్లల నిర్బంధ ఉచిత విద్యాహక్కు చట్టం–2009 ద్వారా ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలి. ఇందుకోసం ఆంధ్రప్రదేశ్‌లో 2022–23 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లలో పేద పిల్లలకు ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఇలా గత మూడు విద్యా సంవత్సరాల్లో (2022–23, 2023–24, 2024–25) 50 వేల మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశాలు కల్పించారు. 2025–26 విద్యా సంవత్సరంలో 31,701 మందికి సీట్లు కేటాయించారు.
అయితే, ప్రభుత్వ ఫీజులను ఖరారు చేయనందున చాలా స్కూళ్ల యాజమాన్యాలు పిల్లలను చేర్చుకోలేదు. దీంతో చేసేది లేక పిల్లల భవిష్యత్తు రీత్యా తల్లిదండ్రులు ఫీజులు చెల్లించి స్కూళ్లలో చేర్పించారు. మరికొందరు ఆర్థిక భారం భరించలేక ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు తీసుకున్నారు. దీంతో సగం మందికే ప్రైవేటు స్కూళ్లలో అడ్మిషన్ లభించినట్టయింది.
ఆ విద్యార్థులకు తల్లికి వందనం నిలిపివేత
ప్రస్తుత విద్యా సంవత్సరంతోపాటు గత మూడేళ్లల్లో ఆర్టీఈ చట్టం కింద ప్రవేశాలు పొందిన 81 వేల మంది విద్యార్థులకు ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని నిలిపివేసింది. ఫీజులు ఖరారైన తర్వాత వందనం కింద ఇచ్చే మొత్తాన్ని ఆయా స్కూళ్లకే జమ చేస్తామని గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ ఏడాది ఆర్టీఈ చట్టం కింద సీట్లు దక్కినా చాలా స్కూళ్లు అడ్మిషన్లు నిరాకరించాయి. దీంతో తల్లిదండ్రులు పిల్లలను డబ్బులు కట్టి ప్రైవేటు స్కూళ్లలోనూ, ఆర్థిక భారం భరించలేని వారు ప్రభుత్వ పాఠశాలల్లోనూ చేర్పించారు. ఇలాంటి వారు 32 వేల మందిలో దాదాపు 15 వేల మంది వరకు ఉంటారని అంచనా. వీరు ఇంకా ఆర్టీఈ విద్యార్థులుగానే ప్రభుత్వ రికార్డుల్లో ఉన్నారు. ఈ క్రమంలో వీరికి తల్లికి వందనం ఇస్తారా..; లేక పూర్తిగా ఎగవేస్తారా.. అని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఫీజులపై కోర్టుకెళ్లిన యాజమాన్యాలు
గతేడాది స్కూళ్లు నిర్ణయించిన ఫీజులే చెల్లించాలని, లేదంటే విద్యార్థులను పరీక్షలకు అనుమతించబోమని కొన్ని, పై తరగతులకు పంపించేదిలేదని, టీసీలు సైతం ఇచ్చేది లేదని మరికొన్ని స్కూళ్లు తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచి ఫీజులు వసూలు చేశాయి. ఈ ఏడాది సగం మంది విద్యార్థులకు అడ్మిషన్లనే నిరాకరించాయి. తాజాగా నిర్ణయించిన ఫీజులు రూ.8500 నుంచి రూ.14500 కూడా స్టార్ రేటింగ్‌ను బట్టి అన్ని తరగతులకు ఇవే వర్తిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తమకు చెల్లించే ఫీజులు తక్కువగా ఉన్నాయని, వీటిని పెంచాలని ప్రవేటు స్కూళ్ల యాజమాన్యాలు గతంలోనే హైకోర్టును ఆశ్రయించగా, ఫీజులను సవరించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.