సులభంగా ఓపీ రిజిస్ట్రేషన్

AP Govt is exemplary in implementation of digital medical services - Sakshi

సాక్షి, అమరావతి: డిజిటల్‌ వైద్య సే­వలు అందించడంలో ఏపీ ప్రభుత్వం ఇతర రా­ష్ట్రాలకు ఆద­ర్శంగా నిలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రులను అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వండిజిటల్‌ విధానంతో అవుట్‌ పేషెంట్‌ (ఓపీ) సేవలనూ సులభతరం చేస్తోంది. క్యూ­ఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసి ఓపీ రిజిస్ట్రేషన్‌ను తేలికగా పూర్తి చేస్తోంది. ఈ విధానంలో దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది.

ఏపీలోని 909 ప్రభుత్వాస్పత్రుల్లో స్కాన్‌ అండ్‌ షేర్‌ విధానంలో ఓపీ రిజిస్ట్రేషన్‌ అమలు చేస్తోంది. ఇలా గడిచిన 4 నెలల్లో 23.80 లక్షల ఓపీలు నమోదయ్యాయి.55.04 లక్షలతో యూపీ తొలి స్థానంలో, 24.67 లక్షలతో కర్ణాటక రెండో స్థానంలో ఉన్నాయి. వైద్యం కోసం ప్రభుత్వ ఆ­స్పత్రికి వెళితే ఓపీ కౌంటర్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. రోగి పేరు, చిరునామా, ఫోన్‌ నంబర్, ఇతర వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చే­యాల్సి ఉంటుంది. ఇవి పూర్తయిన తర్వాత రోగి ఏ సమస్యతో వైద్య సేవలు పొందాలనుకుంటున్నారో తెలుసుకుని, ఆ విభాగానికి రిఫర్‌ చేస్తూ టోకెన్‌ ఇస్తారు. దీనికి  5–10 నిమిషాలు పడుతుంది.

పెద్దాస్పత్రుల్లో రోగుల తాకిడి ఎక్కువగా ఉండటంవల్ల రోగులు ఓపీ రిజిస్ట్రేషన్ కోసం చా­లా సమయం క్యూలో వేచి ఉండాల్సి వస్తుంది. అదే క్యూఆర్‌ కోడ్‌తో త్వరగా అయిపోతుంది. రోగి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్‌కు వెళ్లి స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా కోడ్‌ స్కాన్‌ చేసి, టోకెన్‌ను తీసుకుని డాక్టర్‌ను సంప్రదించవచ్చు. క్యూలో వేచి ఉండటం, ఇతర అగచాట్లు తప్పుతాయి.  

ఇలా చేసుకోవాలి.. 
► స్మార్ట్‌ ఫోన్‌ నుంచి ఆస్పత్రిలో ప్రదర్శించిన క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే యూఆర్‌ఎల్‌ కోడ్‌ వస్తుంది. దాని మీద క్లిక్‌ చేస్తే..ఆభా,ఆరోగ్యసేతు, వంటి యాప్‌లు కనిపిస్తాయి
►  ఆ యాప్‌­లు ఫోన్‌లో లేకపోతే ప్లే స్టోర్‌ నుంచి ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి
► ఆయుష్మాన్‌ డిజిటల్‌ హెల్త్‌ అ­కౌంట్‌ (ఆభా) 14 అంకెల గుర్తింపు/ఆభాలో రి­జిస్టర్‌ చేసిన ఫోన్‌ నంబర్‌/మెయిల్‌ ఐడీ ద్వారా యాప్‌లో రిజిస్టర్‌ అవ్వాలి
►  యాప్‌లోకి లాగిన్‌ అయితే ఆభా వివరాలు వస్తాయి. వీటిని ఆస్పత్రితో షేర్‌ చేసే ఆప్షన్‌ కనిపిస్తుంది. షేర్‌ ఆప్షన్‌­పై క్లిక్‌ చేస్తే ఓ నంబర్‌ వస్తుంది. ఈ టోకెన్‌కు అరగంట వ్యాలిడిటీ ఉంటుంది. టో­కెన్‌ నంబర్‌ వచ్చాక ఆస్పత్రిలోని కౌంటర్‌కు వెళ్లి ఆభా నంబర్, ఫోన్‌ నంబర్‌ చెప్పి, ఏ స్పెషాలిటీలో ఓపీ అవసరమో చెబితే సిబ్బంది ఓపీ స్లిప్‌ ఇస్తారు. దీన్ని తీసుకుని డాక్టర్‌ను సంప్రదించవచ్చు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top