అబద్ధపు వాంగ్మూలం చెప్పించి.. ఆడిట్‌ నివేదికను తొక్కిపెట్టి | AP Govt conspiracy to close fibernet case: Andhra pradesh | Sakshi
Sakshi News home page

అబద్ధపు వాంగ్మూలం చెప్పించి.. ఆడిట్‌ నివేదికను తొక్కిపెట్టి

Jan 28 2025 4:18 AM | Updated on Jan 28 2025 4:18 AM

AP Govt conspiracy to close fibernet case: Andhra pradesh

ఫైబర్‌నెట్‌ కేసు క్లోజ్‌ చేసేందుకు ప్రభుత్వ కుట్ర

చంద్రబాబే ఏ1గా ఉన్న కేసును నీరుగార్చే కుతంత్రం

చంద్రబాబు అవినీతిని బయటపెట్టిన ఐఏఎస్‌ అధికారికి వేధింపులు

ఆయనతో అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించిన సీఐడీ

ఫైబర్‌నెట్‌ స్కామ్‌ను బయటపెట్టిన ఆడిట్‌ నివేదికనూ తొక్కిపెట్టే కుట్ర

ప్రభుత్వ సంస్థ ఏపీటీఎస్‌ ద్వారా మరోసారి ఆడిట్‌కు నిర్ణయం

సాక్షి, అమరావతి: చంద్రబాబు అవి­నీతి బాగోతాన్ని కప్పిపుచ్చే కుట్రకు కూటమి ప్రభుత్వం మరింత పదును పెడుతోంది. ఇప్పటికే అసైన్డ్‌ భూముల కుట్ర కేసులో గతంలో చంద్రబాబు అవినీతిని బయటపెడుతూ సీఆర్‌సీపీ 164 కింద న్యాయమూర్తి ఎదుట వాంగ్మూలం ఇచ్చిన ఐఏఎస్‌ అధికారి చెరు­కూరి శ్రీధర్‌ను వేధించి లొంగదీసుకుంది. నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి విరుద్ధంగా ఇటీవల అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయించింది.

ఇదే తీరులో చంద్రబాబు నిందితుడుగా ఉన్న ఫైబ­ర్‌­నెట్‌ కుంభకోణం కేసునూ నీరుగార్చే యత్నంలో ప్రభు­త్వం ఉంది. అందుకోసం మరో ఐఏఎస్‌ అధికారిని వేధించి, కీలక పోస్టింగ్‌ ఎరగా వేసి మరీ లొంగదీసుకుంది. ఆయన ఇ­ప్ప­టికే గుట్టు చప్పుడు కాకుండా కోర్టులో వాంగ్మూలాన్ని రీరికార్డింగ్‌ చేయించారు. ఫైబర్‌నెట్‌ అవినీతిని బటయపెట్టిన ఆడిట్‌ నివేదికనూ తొక్కిపెడుతూ అనుకూలంగా నివేదిక ఇప్పించేందుకు ఏపీ టెక్నాలజీ సర్విసెస్‌తో చేయిస్తోంది. 

ఐఏఎస్‌ అధికారిని లొంగదీసుకొని.. 
2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్‌నెట్‌ కుంభకోణం ద్వారా ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. సీఐడీ ప్రత్యే­క దర్యాప్తు బృందం (సిట్‌) ఆధారాలతో సహా ఆ అవినీతిని బట్టబయలు చేసింది. ఈ కేసులో చంద్రబాబు (ఏ1), ఆయన సన్నిహితుడైన టెరాసాఫ్ట్‌ కంపెనీ అధినేత వేమూరి హరికృష్ణ (ఏ2)తో పాటు పలువురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, చార్జ్‌షిట్‌ దాఖలు చేసింది. కాగా గత ఏడాది రాష్ట్రంలో  టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్ర­బాబు­పై కేసులను నీరుగార్చే కుట్రకు తెరతీసింది.

ఫైబర్‌నెట్‌ కేసులో గతంలో చంద్రబాబు ఎలా అవినీతికి పాల్ప­డిందీ, ఆయన ఒత్తిడితోనే తాము నిబంధనలకు విరుద్ధంగా టెరాసాఫ్ట్‌ కంపెనీకి కాంట్రాక్టు కే­టా­­యించిందీ  వెల్లడిస్తూ ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సీఆర్‌సీపీ­ట వాంగ్మూలం ఇ­చ్చా­రు. ఈ వాంగ్మూలానికి పూర్తి విరుద్ధంగా అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలంటూ ఆ ఐఏఎస్‌ అధికారిని కూట­మి ప్రభు­త్వం  వేధించింది. 

ఓసారి ఇచ్చిన వాంగ్మూలానికి పూర్తి విరుద్ధంగా వాంగ్మూ­లం ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని, న్యాయపరమైన చిక్కు­లు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ అధికారి గుర్తించారు. అలా ఇస్తే ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని కూడా నిపుణులు స్పష్టం చేశారు. దాంతో  అబద్ధపు వాంగ్మూలం ఇచ్చేందుకు వెనుకంజ వేశారు. కానీ ఆయన్ని సీఐడీ అధికారులు వారి శైలిలో వేధించి బెంబేలెత్తించారు. ‘మేము చెప్పినట్టు అబద్ధపు వాంగ్మూలం ఇవ్వకపోతే సంగతి తేలుస్తాం. 

ఏం చేసినా పర్వాలేదని ప్రభుత్వ ముఖ్యనేత మాకు ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు’ అంటూ బ్లాక్‌మెయిల్‌ చేశారు. తాము చెప్పినట్టు చేస్తే మరో కీలక పోస్టింగ్‌ కూడా ఇస్తామని ప్రభుత్వ పెద్దలు తాయిలం ఎర వేశారు. దాంతో ఆ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అబద్ధపు వాంగ్మూలం ఇచ్చేందుకు సమ్మతించారు. ఆ వెంటనే గృహ నిర్మాణ శాఖలో కీలక అధికారిగా ఉన్న ఆయనకు పర్యాటక శాఖలో కీలక పోస్టును పూర్తి అదనపు బాధ్యతలతో సహా అప్పగించడం గమనార్హం.  తర్వాత అబద్ధపు వాంగ్మూలం కథ నడిపారు. 

కొన్ని రోజుల క్రితం ఐఏఎస్‌ అధికారి చెరుకూరి శ్రీధర్‌ను సీ­ఐడీ అధికారులు దగ్గరుండి తీసుకువెళ్లి మరీ గుంటూరులోని న్యాయస్థానంలో సీఆర్‌పీసీ 164 వాంగ్మూలాన్ని రీరికార్డింగ్‌ చేయించారు. ఆ విషయం మీడియాలో వచ్చేసింది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. 

దాంతో ఈసారి ఫైబర్‌నెట్‌ కే­సులో సీఐడీ అధికారులు కొత్త ఎత్తుగడ వేశారు. సీనియర్‌ ఐ­ఏఎస్‌ అధికారితో గుట్టు చప్పుడు కాకుండా విజయవా­డలోని న్యాయస్థానంలో వాంగ్మూలాన్ని రీరికార్డింగ్‌ చేయించారు. సీఐడీ అధికారులు, పోలీసులు లేకుండానే ఆ అధికారి తన వాహనంలో వచ్చి సీఐడీ అధికారులు చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాన్ని నమోదు చేసి వెళ్లిపోయారు. ఈ సమాచారాన్ని సీఐడీ వర్గాలు వెంటనే ముఖ్యనేతకు చేరవేశాయి.

అంతా సవ్యంగా ఉందని సర్టీఫికెట్‌! 
గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఫైబర్‌నెట్‌ ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని థర్డ్‌ పార్టీ ఆడిట్‌ నివేదిక తేల్చింది. ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌ ఎండీ జాతీయ స్థాయి­లో గుర్తింపు పొందిన థర్డ్‌ పార్టీ ఆడిటింగ్‌ కన్సల్టెన్సీతో ఆ ఆడిట్‌ చేయించారు. ఏకంగా 8 శాతం ప్రాజెక్టు పనులు  నాసిరకంగా చేసి నిధులు కొల్లగొట్టారని  నివేదిక వెల్లడించింది. సీఐడీ కేసులో ఆ ఆడిట్‌ నివేదిక  కీలక సాక్ష్యం.

 ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ఆ  నివేదికకు ప్రా­దా­న్యం లేకుండా చేసి కేసును పక్కదారి పట్టించే కుట్ర­కు తెరతీసింది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వ విభాగమైన ఏపీ టె­క్నా­లజీ సర్విసెస్‌తో ఫైబర్‌నెట్‌ ప్రాజెక్టుపై మరోసారి ఆడిట్‌ చేయాలని నిర్ణయించింది. అంటే తాము చేసిన ప­ను­లను తామే మదింపు చేసి అంతా సవ్యంగా ఉందని సర్టిఫికెట్‌ ఇచ్చుకునేందుకు సిద్ధపడుతోంది. తద్వారా చంద్రబాబు కీలక పాత్రధారిగా ఉన్న ఫైబర్‌నెట్‌ కేసు దర్యాప్తును నీరుగార్చి,  మూసివేసేందుకు కుతంత్రం పన్నింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement