రేషన్‌ అక్రమార్కులపై కొరడా

AP Govt Actions On Ration ‌Illegals - Sakshi

1,188 మంది డీలర్లకు నోటీసులు.. కొందరిపై కేసు

తనిఖీలు మరింత ముమ్మరం 

సాక్షి, అమరావతి: పేదల ఆకలి తీర్చడం కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనుకాడకుండా ప్రభుత్వం ముందుకెళ్తుంటే.. కొందరు రేషన్‌ డీలర్లు పేదలకు అందాల్సిన సరుకుల్ని నల్ల బజారుకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం నెలలో రెండుసార్లు ఉచిత బియ్యంతో పాటు కందిపప్పు లేదా శనగలు పంపిణీ చేస్తోంది. ఇప్పటివరకు దాదాపు 27 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం కార్డుదారులకు పంపిణీ చేసింది. కొందరు రేషన్‌ డీలర్లు లబ్ధిదారుల్ని ప్రలోభపెట్టి వారికిచ్చే బియ్యాన్ని కిలో రూ.7 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. వాటిని ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి వారిపై ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది.

 ముమ్మరంగా తనిఖీలు
► రేషన్‌ బియ్యం పక్కదారి పట్టకుండా నిరోధించేందుకు పౌర సరఫరాలు, విజిలెన్స్, తూనికలు, కొలతల శాఖ అధికారులు విడివిడిగా రేషన్‌ షాపులను తనిఖీ చేస్తున్నారు.
► అవకతవకలకు పాల్పడిన డీలర్లపై చర్యలు తీసుకునేందుకు తనిఖీ అధికారులు లిఖిత పూర్వకంగా రాష్ట్ర స్థాయి అధికారులకు సమాచారం పంపుతున్నారు.
► రాష్ట్రంలో 29,783 రేషన్‌ షాపులు ఉన్నాయి. వీరిలో 1,188 మంది డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నట్టు గుర్తించి  నోటీసులు జారీ చేశారు. కొందరిపై క్రిమినల్‌ కేసులు కూడా పెట్టి రిమాండ్‌కు పంపారు. తనిఖీల నేపథ్యంలో కొందరు డీలర్లు సెలవుపై వెళ్తున్నారు.
► రాష్ట్రంలో 4,700 మంది డీలర్లు రేషన్‌ షాపులను సరిగా తెరవడం లేదని అధికారులు గుర్తించారు. వేళలు పాటించని డీలర్లను గుర్తించి పని తీరును మార్చుకోవాలని నోటీసులు జారీ చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top