పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వండి

AP Government Affidavit in Supreme Court on Inter exams - Sakshi

సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్‌

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది. అనుభ శ్రీవాస్తవ సహాయ్‌ వర్సెస్‌ కేంద్రప్రభుత్వం కేసులో జస్టిస్‌ ఏఎంఖన్విల్కర్‌ , జస్టిస్‌ దినేష్‌ మహేశ్వరిలతో కూ డిన ధర్మాసనం ఆదేశాల మేరకు పాఠశాలవిద్య ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్‌ తరఫున ప్రభుత్వ న్యాయవాది మెహ్‌ఫూజ్‌ నజ్కీ బుధవారం అఫిడవిట్‌ దాఖలు చేశారు. మే నెలతో పోలిస్తే జూన్‌లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, నిపుణులు కూడా పరీక్షల నిర్వహణ సాధ్యమేనని సూచించారని ప్రభుత్వం అఫిడవిట్‌లో పేర్కొంది. కరోనా ప్రొటోకాల్‌ పాటిస్తూ జూలై చివరివారంలో పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపింది. సుమారు పదిమంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు చొప్పున సిబ్బందిని నియమిస్తున్నట్లు తెలిపింది.  కళాశాలలు నిర్వహించే ఇంటర్నల్‌ పరీక్షల ఫలి తాలపై ఇంటర్మీడియట్‌ బోర్డుకు ఎలాంటి నియంత్రణ ఉండదని, ఈ పరిస్థితుల్లో ఫైనల్‌ పరీక్షలకు వందశాతం మార్కులు ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొంది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఈఏపీసెట్‌)లో 12వ తరగతి మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉందని, ఆయా అంశాలు పరిశీలించి పరీక్షల నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరింది. 

అఫిడవిట్‌లోని మరికొన్ని ప్రధానాంశాలు
► 15 రోజుల ముందుగానే పరీక్ష తేదీలు వెల్లడిస్తాం
► 12వ తరగతి ఫలితాల వెల్లడికి పరీక్షల నిర్వహణ తప్ప ప్రత్యామ్నాయం లేదు. ఎందుకంటే.. పదో తరగతి ఫలితాలు గ్రేడ్‌లలో ఉంటాయి. కళాశాలల్లో నిర్వహించే ఇంటర్నల్‌ పరీక్షల మా ర్కులపై బోర్డుకు నియంత్రణ ఉండదు. ఈ నేపథ్యంలో 12వ తరగతి ఫైనల్‌ ఫలితాలు వందశాతం వెల్లడికి, ఇంటర్నల్‌ మార్కుల అసెస్‌మెంట్‌కు అవకాశం ఉండదు.  
► పరీక్షలకు 12వ తరగతికి 5,19,510 మంది, 11వ తరగతికి 5,12,959 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. 
► ఒకరోజు 11వ తరగతి, మరోరోజు 12వ తరగతి పరీక్షలు నిర్వహిస్తాం.
► పరీక్ష హాలులో 15 నుంచి 18 మంది మాత్రమే విద్యార్థులను అనుమతిస్తున్నాం. గది సైజు 25–25 పరిమాణంలో ఉంటుంది.  విద్యార్థుల మధ్య 5 అడుగుల దూరం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నాం
► విద్యార్థి పరీక్ష గది వివరాలు కళాశాల ప్రాంగణంలో పలుచోట్ల ప్రదర్శిస్తాం. దీంతో విద్యార్థులు గుమిగూడే అవకాశం ఉండదు. ఒక రోజు ముందే ఆ వివరాలు వెల్లడిస్తాం.
► bei.ap.gov.inలో నో యువర్‌సీట్‌ ద్వారా కూడా వివరాలు తెలుసుకోవచ్చు.
► పరీక్ష కేంద్రం వద్ద వైద్యాధికారి, మెడికల్‌ కిట్‌ ఏర్పాటు చేస్తున్నాం.  
► విద్యార్థులు గుంపులుగా రాకుండా.. ముందుగానే వారిని అనుమతించాలని పరీక్ష కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్‌లను ఆదేశించాం. 
► కళాశాలలోకి ప్రవేశ, నిష్క్రమణ మార్గాలు వేర్వేరుగా ఉంటాయి.
► పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం కోసం 50 వేల సిబ్బందిని నియమించాం. 
► పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ విద్యార్థుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని తగిన భద్రత, రక్షణ ఏర్పాట్లతో పరీక్షలు నిర్వహిస్తాం. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top