విద్యార్థుల చేరికల్లో ఏపీ ఫస్ట్‌  | Sakshi
Sakshi News home page

విద్యార్థుల చేరికల్లో ఏపీ ఫస్ట్‌

Published Tue, Jan 30 2024 4:39 AM

AP is first among students school admissions - Sakshi

సాక్షి, అమరావతి : విద్యా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. 2021 విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో స్థూల నమోదు నిష్పత్తి (పిల్లలు చేరికలు)లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో ఉండడమే ఇందుకు నిదర్శనం. ఈ విషయాన్ని ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక వెల్లడించింది. 2017తో పోలిస్తే 2021లో దేశంలోని స్థూల నమోదు నిష్పత్తి పెరిగిన టాప్‌– రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ తొలిస్థానంలో ఉందని ఆ నివేదిక తెలిపింది. అలాగే, 2021లో జాతీయ స్థూల నమోదును మించి ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధిక స్థూల నమోదు ఉందని కూడా పేర్కొంది. 2017తో పోలిస్తే.. 2021లో రాష్ట్రంలో ప్రైమరీ, అప్పర్‌ ప్రైమ­రీ, ఎలిమెంటరీ స్థాయిలో స్థూల నమోదు నిష్పత్తి భారీగా పెరిగిందని కూడా నివేదిక తెలిపింది. 

‘అమ్మఒడి’ ప్రోత్సాహంతోనే..
అలాగే, స్థూల నమోదు నిష్పత్తిలో టాప్‌ నాలుగు రా­ష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్‌ తరువాత ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్‌ ఉండగా.. స్థూల నమోదు 2017­తో పోలిస్తే 2021లో తగ్గిన నాలుగు రాష్ట్రాల్లో ఛత్తీస్‌­గఢ్, గోవా, జార్ఖండ్, బీహార్‌ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2017తో పోలిస్తే 2021లో ప్రైమరీలో 18.4 శాతం, అప్పర్‌ ప్రైమరీలో 13.4 శాతం, ఎలిమెంటరీలో 16.5 శాతం స్థూల నమోదు పెరిగినట్లు నివేదిక తెలిపింది. ఇందుకు ప్రధాన కారణం బడి ఈడు పిల్లలందరూ బడుల్లోనే ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఇందులో భాగంగా.. అన్ని వర్గాల్లోని పేదల తల్లిదండ్రులకు తమ పిల్లల చదువులు భారం కాకూడదనే దూరదృష్టితో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న అమ్మఒడి పథకం అమలుచేస్తోంది. ఈ ప­థకం అమలు ద్వారా పేద వర్గాల పిల్ల­లం­ద­రూ స్కూ­ళ్లలో చేరేలా ప్రోత్సాహం అందిస్తోంది. నిజానికి.. పేదలు పిల్లలను బడికి పంపకుండా పనికి పంపిస్తే తమకు ఆర్థికంగా చేదోడు వాదోడుగా నిలుస్తారనే ఆలోచనలో వారుండే వారు. అయితే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జగనన్న అమ్మఒడి ద్వారా పిల్ల­లను స్కూళ్లకు పంపితే ఏడాదికి రూ.15 వేల చొ­ప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. దీంతో అన్ని వర్గాల్లోని పేదలు తమ పిల్లలను స్కూళ్లకు పంపుతున్నారు. 

స్థూల నమోదు వృద్ధికి దోహదపడిన సంస్కరణలు..
► మనబడి నాడు–నేడు ద్వారా తొలిదశలో.. 15 వేలకు పైగా ప్రభుత్వ స్కూళ్లలో అన్ని మౌలిక సదుపాయాలను కల్పించారు. 
► రెండో దశలో మరో 22,221 స్కూళ్ల రూపురేఖలను మార్చే పనులు చేపట్టారు. 
► దీంతోపాటు.. పిల్లలు మధ్యలో చదువు మానేయకుండా గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా చర్యలను తీసుకుంటోంది. ఇందులో భాగంగా.. పిల్లలు ఎవరైనా స్కూళ్లకు వెళ్లకపోతే వలంటీర్లు ఆ పిల్లల తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి కారణాలు తెలుసుకుని తిరిగి స్కూళ్లకు వచ్చేలా ప్రభుత్వం చర్యలను తీసుకుంది. 

►  అంతేకాక.. స్కూళ్లకు వచ్చే పిల్లలకు జగనన్న గోరుముద్ద ద్వారా నాణ్యమైన ఆహారాన్ని అందిస్తోంది. 
► పేద పిల్లల చదువులకు పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలతో పాటు యూనిఫాం, బూట్లు తల్లిదండ్రులపై భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే జగనన్న విద్యా కానుక ద్వారా ఉచితంగా కిట్‌ను అందిస్తోంది. 
► ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంను కూడా అమలుచేస్తోంది. 
► పిల్లలకు ట్యాబులను కూడా అందిస్తోంది. ఈ చర్యలన్నీ కూడా పాఠశాలల్లో స్థూల నమోదు నిష్పత్తి పెరగడానికి దోహదం చేశాయి. 

Advertisement
 
Advertisement