అందుకే నన్ను తొలగించారు: గౌరీ శంకర్‌

AP Fibernet Project Gouri Shankar Comments Over Vemuri Hariprasad - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌లో వేమూరి హరిప్రసాద్‌ అవినీతి చేశారని ఫైబర్‌ నెట్‌ మాజీ ఈడీ గౌరీశంకర్‌ అన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐటీ సలహాదారుగా పనిచేసిన ఆయన.. తనను బెదిరించారని, చెప్పినట్టు వినాలంటూ వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. టెరా సాఫ్ట్‌వేర్‌కు రూ.333 కోట్ల కాంట్రాక్ట్‌ ఇప్పించారని, ఇందుకు సంబంధించిన టెండర్‌కు సహకరించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తనను హెచ్చరించారని చెప్పారు.  కాగా ఫైబర్‌ గ్రిడ్‌లో జరిగిన అవకతవకల గురించి గౌరీ శంకర్‌ శుక్రవారం మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. (చదవండి: ‘ఫైబర్‌ నెట్‌’లో భారీ అక్రమాలు)

ఈ ప్రాజెక్టు మానటరింగ్ బాధ్యతలు జెమినీ కమ్యూనికేషన్‌కు అప్పగించారని, నెట్‌ ఇండియా కూడా హరిప్రసాద్‌దేనని చెప్పారు. ఫైబర్ నెట్ కనెక్షన్లలో క్వాలిటీ కేబుళ్లను ఉపయోగించకుండా అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. 12 లక్షల సెటప్‌ బాక్సుల్లో 8లక్షల 60 మాత్రమే కనెక్ట్‌ చేశారని.. వీళ్ల బాక్స్‌ల వల్ల ఇబ్బంది ఉందని.. దాసన్‌ అనే కంపెనీ నుంచి అప్పటి అధికారి అహ్మద్‌బాబు చెప్పారని తెలిపారు. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లుగా ఆయన సామాజిక వర్గానికి చెందిన నలుగురికి అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. 

వేమూరి హరిప్రసాద్‌ గురించి చెబుతూ.. ‘‘ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌కు ఆంధ్రాబ్యాంకు రూ.4500 కోట్లు లోన్‌ ఇచ్చింది. కనుమూరు కోటేశ్వరరావు అనే వ్యక్తి వేమూరి హరిప్రసాద్‌కు బినామీ. నేటప్స్‌ అనే కంపెనీ కనుమూరి కోటేశ్వరరావుది. ఈయనకు చెందిన మరో కంపెనీలో హరిప్రసాద్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. ఇక ఈ ప్రాజెక్టులో భాగంగా చివరి రెండు వారాల్లో కొత్తగా ఆర్డర్‌ దక్కించుకున్న నేటాప్స్‌ కంపెనీకి సీఈవోగా హరిప్రసాద్‌ కూతురు వేమూరి అభిజ్ఞ ఉన్నారు. 

నేను ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌కు వస్తే అవకతవకలు బయట పడతాయని భావించారు. అందుకే జూన్‌ 1న నన్ను తొలగించారు. దీనిపై స్పషల్‌ చీఫ్‌ సెక్రటరీ విచారణ చేయించాలి. వీళ్లని కాపాడేందుకు రాజకీయ నేతలు కోర్టుకెళ్లి స్టే తెచ్చారు. సిగ్నమ్‌లో ఫౌండర్‌ డైరెక్టర్‌గా ఉన్న నన్ను టార్చర్‌ పెట్టారు. నన్ను బాగా బెదిరించారు. టెరా సాఫ్ట్‌వేర్‌కు కాంట్రాక్టు ఇప్పించారు. ఆ సాఫ్ట్‌వేర్‌ను అన్‌బ్లాక్‌ చేశారు. నిజానికి సిగ్నమ్‌కి లైసెన్స్‌ బిజినెస్‌ ఉంది. నేను టేరాకు వెండర్‌ని కాదు’’ అని గౌరీ శంకర్‌ చెప్పుకొచ్చారు.  రూ.1,500 కోట్ల విలువైన ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు కాంట్రాక్టు తమ అస్మదీయ సంస్థకు తప్ప ఇతరులకు దక్కకుండా అప్పటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు స్కెచ్‌ వేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన  విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో గత సర్కారు చేపట్టిన ఏపీ ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టులో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ ఇటీవల హైకోర్టుకు నివేదించారు. వీటిని నిర్థారిస్తూ మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపినట్లు తెలిపారు. అర్హతలు లేకున్నా కావాల్సిన వారికి టెండర్లు కట్టబెట్టి నాణ్యత, అనుమతులు పట్టించుకోకుండా గత సర్కారు ముందుకు వెళ్లిందన్నారు. కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరించారని కోర్టుకు నివేదించారు.

రెండు డమ్మీ... అస్మదీయ సంస్థకే టెండర్‌! 
ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టులో టెండర్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని చెప్పేందుకు అప్పట్లో మూడు కన్సార్టియం సంస్థలను అనుమతించారు. కానీ, వాటిలో రెండు సంస్థలు నామమాత్రంగానే పోటీలో ఉన్నాయి. వాటిలో ఓ సంస్థకు రాష్ట్ర రాజధాని నిర్మాణంలో భారీ కాంట్రాక్టులు కట్టబెట్టారు. మరో సంస్థకు కూడా పలు సాఫ్ట్‌వేర్‌ కాంట్రాక్టులు ఇచ్చారు. ముఖ్యనేత బినామీ సంస్థకు మార్గం సుగమం చేస్తూ ఆ రెండు సంస్థలు ఫైబర్‌ గ్రిడ్‌ టెండర్‌లో ఎక్కువ ధర కోట్‌ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాంతో ముఖ్యనేత బినామీగా ఉంటూ ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌లో చక్రం తిప్పుతున్న ఓ కీలక వ్యక్తి ఆధీనంలోని సంస్థకే ఫైబర్‌ గ్రిడ్‌ టెండర్‌ కట్టబెట్టడానికి రంగం సిద్ధమైందని వార్తలు వెలువడ్డాయి. తద్వారా రూ.1,500 కోట్ల కాంట్రాక్టును మూడు ప్యాకేజీలుగా విభజించి, ఆ సంస్థకు దారాదత్తం చేసేందుకు పన్నిన కుట్ర దాదాపు విజయవంతమైంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top