‘ఫైబర్‌ నెట్‌’లో భారీ అక్రమాలు 

Massive irregularities In the AP Fiber Net project by the previous government - Sakshi

గత ప్రభుత్వ తీరుపై మంత్రివర్గ ఉపసంఘం నివేదికను కేంద్రానికి పంపాం

అమరావతి భూకుంభకోణంలో ఇప్పటికే ఈసీఐఆర్‌ నమోదు 

నిందితులుగా భావిస్తున్న వ్యక్తుల తరఫున పిటిషన్లు వేయడానికి వీల్లేదు

హైకోర్టుకు నివేదించిన అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌

సాక్షి, అమరావతి: గత సర్కారు చేపట్టిన ఏపీ ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టులో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ మంగళవారం హైకోర్టుకు నివేదించారు. వీటిని నిర్థారిస్తూ మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపినట్లు తెలిపారు. అర్హతలు లేకున్నా కావాల్సిన వారికి టెండర్లు కట్టబెట్టి నాణ్యత, అనుమతులు పట్టించుకోకుండా గత సర్కారు ముందుకు వెళ్లిందన్నారు. కేంద్ర విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) మార్గదర్శకాలకు విరుద్ధంగా వ్యవహరించారని కోర్టుకు నివేదించారు. ఏజీ ఏమన్నారంటే.. 

► గతంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షిస్తేనే ఇలాంటి అక్రమాలు వెలుగులోకి వచ్చి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అడ్డుకోవచ్చు. 
► ఈ అక్రమాలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేశాం. సిట్‌ నమోదు చేసే కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రభుత్వం ఫిబ్రవరి 28న లేఖ రాసింది. హైకోర్టు దీనిపై ఇప్పటివరకు పాలనాపరమైన నిర్ణయం వెలువరించలేదు. ఈ నేపథ్యంలో సిట్‌ ఎలాంటి కేసులను దర్యాప్తు చేయడం లేదు. ఫిర్యాదులపై సీఐడీ స్వతంత్రంగా దర్యాప్తు చేస్తోంది. అమరావతి భూ కుంభకోణం విషయంలో మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేస్‌ ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌(ఈసీఐఆర్‌) కూడా నమోదు చేసింది. ఈ కేసులో కేంద్రం, సీఐడీ తదితరులను ప్రతివాదులుగా చేర్చి వాదనలు వినాలి. 
► గత సర్కారు నిర్ణయాలను సమీక్షించే కార్యనిర్వాహక అధికారం ప్రభుత్వానికి ఉంది.  న్యాయసూత్రాల ప్రకారం దర్యాప్తు ఫలానా విధంగా జరగాలని నిర్ణయించే అధికారం నిందితుడికి లేదు. నిందితులుగా భావిస్తున్న వ్యక్తుల తరఫున పిటిషనర్లు దాఖలు చేసిన వ్యాజ్యాలకు విచారణార్హత లేదు.  
► గత సర్కారు నిర్ణయాలను సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తూ జారీ చేసిన జీవో 1411, సిట్‌ ఏర్పాటు చేస్తూ జీవో 344 జారీ చేయటాన్ని సవాల్‌ చేస్తూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, రాజేంద్రప్రసాద్‌ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. 
► దీనికి సంబంధించి అడ్వొకేట్‌ జనరల్‌ తన వాదనలను ముగించడంతో న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు విచారణను బుధవారానికి వాయిదా వేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top