
ప్రజల నుంచి వసూలు చేసిన మొత్తంలో రూ.923.55 కోట్లు వెనక్కివ్వాలని ఆదేశాలు
ట్రూ అప్ చార్జీలపై విచారణ జరిపిన విద్యుత్ నియంత్రణ మండలి
డిస్కంలు చెప్పిన లెక్కలు, కొనుగోలు వ్యయంలో భారీ వ్యత్యాసం గుర్తింపు
సాక్షి, అమరావతి: విద్యుత్ చార్జీల విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీ ఈఆర్‌సీ) మొట్టికాయలు వేసింది. అదనంగా వసూలు చేసిన చార్జీలను విద్యుత్ వినియోగదారులకు వెనక్కి ఇవ్వాలని ఆదేశించింది. ఇందుకోసం విద్యుత్ చార్జీలను ట్రూ డౌన్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో ప్రజల నుంచి వసూలు చేసిన మొత్తంలో రూ.923.55 కోట్లను ప్రజలకు వెనక్కి ఇవ్వాలని డిస్కంలను ఆదేశించింది. 2024–25 సంవత్సరానికి రూ.2,758.76 కోట్లు ఇంధన, విద్యుత్ కొనుగోలు సర్దుబాటు (ట్రూ అప్) చార్జీలను డిస్కంలు ఈ ఏడాది జూలైలో ప్రతిపాదించాయి.
ఇందుకు ఏపీఈఆర్‌సీ నుంచి అనుమతి కోరాయి. వీటిపై విచారణ జరిపిన ఏపీ ఈఆర్‌సీ డిస్కంలు చెప్పిన లెక్కలు, విద్యుత్ కొనుగోలు వ్యయంలో భారీ వ్యత్యాసాన్ని గుర్తించింది. డిస్కంలు అడిగిన దానికి యథాతథంగా ఆమోదం తెలపకుండా రూ.895.12 కోట్లు తగ్గించి.. రూ.1,863.64 కోట్లకు అనుమతినిచ్చింది. అలాగే గత ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ను అధిక ధరలకు కొనుగోలు చేసిందంటూ తప్పుడు ప్రచారం చేసిన కూటమి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఏపీ ఈఆర్‌సీ అనుమతించిన దానికి మించిన ధరకు విద్యుత్ కొనుగోలు చేసింది.
ఏపీ ఈఆర్‌సీ యూనిట్‌కు రూ.5.27కు కొనమని చెబితే.. ఈపీడీసీఎల్ యూనిట్ రూ.5.84 చొప్పున, సీపీడీసీఎల్ రూ.5.86 చొప్పున, ఎస్పీడీసీఎల్ యూనిట్ రూ.5.89 వెచ్చించి విద్యుత్ కొన్నట్టు ప్రతిపాదనలో తెలిపాయి. కాగా.. ఏపీ ఈఆర్‌సీ యూనిట్‌కు రూ.0.8 పైసల నుంచి రూ.0.15 పైసలు వరకూ తగ్గించి అనుమతించింది. విద్యుత్ కొనుగోలు ఖర్చు కూడా రూ.34,517 కోట్లకు అనుమతి ఉంటే.. రూ.45,476 కోట్లు వెచ్చించామని డిస్కంలు చెప్పాయి. ఇందులో రూ.44,624 కోట్లకు ఏపీ ఈఆర్‌సీ ఆమోదం తెలిపింది. కాగా.. ప్రసార, పంపిణీ (ట్రాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్) నష్టాలు 10.17 శాతమని డిస్కంలు ప్రతిపాదిస్తే ఈఆర్‌సీ మాత్రం 9.87 శాతానికే అంగీకరించింది.
ఇప్పటికే వసూలు
2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రతి నెలా యూనిట్‌కు రూ.0.40 పైసలు చొప్పున అదనంగా డిస్కంలు వసూలు చేశాయి. ఎస్పీడీసీఎల్ రూ.1,106.56 కోట్లు, సీపీడీసీఎల్ రూ.614.86 కోట్లు, ఈపీడీసీఎల్ రూ.1,065.76 కోట్ల చొప్పున ఇప్పటికే రూ.2,787.18 కోట్లు వసూలు చేసేశాయి. ఈ మొత్తం నుంచి అనుమతించిన రూ.1,863.64 కోట్లు పోగా.. మిగిలిన రూ.923.55 కోట్లను ఈ ఏడాది నవంబర్ నెల బిల్లు నుంచి ట్రూ డౌన్ చేయాలని ఈఆర్‌సీ ఆదేశించింది. అంటే ఇప్పటికే ప్రజల నుంచి వసూలు చేయాల్సిన దానికంటే అదనంగా వసూలు చేశారని, దానిని 12 సమాన వాయిదాల్లో ప్రతి నెలా విద్యుత్ బిల్లుల్లో యూనిట్‌కు రూ.0.13 పైసల చొప్పున సర్దుబాటు చేయాలని అదేశించింది. ఈఆర్‌సీ నిర్ణయం ప్రభుత్వానికి చెంపపెట్టుగా మారడంతో పాటు వినియోగదారులకు కాస్త ఊరట కలిగించనుంది.
రాగానే బాదుడు మొదలు
‘మేం అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచం.. తగ్గిస్తాం’ అని ఎన్నికల ముందు ప్రతి ప్రచార సభలోనూ చంద్రబాబు అండ్ కో చెప్పింది. అధికారంలోకి రాగానే ఆ హామీని గాలికొదిలేశారు. చార్జీలు పెంచం అని నేనెప్పుడు చెప్పానంటూ నిస్సిగ్గుగా మాట మార్చేశారు. ఓ వైపు ‘సూపర్‌సిక్స్’ అంటూ హామీలిచ్చి వాటిలో ఒక్కటీ అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. మరోవైపు ఇలా విద్యుత్ చార్జీల పేరుతో వారిని దోచుకునేందుకు ప్రయత్నిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యుత్ చార్జీల రూపంలో రూ.15,485 కోట్ల భారాన్ని మోపింది.
2024 నవంబర్ బిల్లు నుంచే రూ.6,072.86 కోట్ల భారాన్ని వసూలు చేస్తుండగా.. ఈ ఏడాది జనవరి బిల్లు నుంచి మరో రూ.9,412.50 కోట్ల భారాన్ని జోడించింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి వినియోగదారులకు ఇచ్చే బిల్లుల్లో యూనిట్‌కు రూ.0.40 చొప్పున అదనంగా వసూలు చేయడం ఏడాది ప్రారంభంలోనే మొదలు పెట్టారు. అలా ఈ ఏడాది మార్చి వరకూ జనం డబ్బును అదనపు చార్జీల పేరుతో దోచేశారు. అందులో రూ.1,863.64 కోట్ల విద్యుత్ చార్జీలకు ఆమోదం తెలపడంతో కూటమి ప్రభుత్వం ఇప్పటివరకూ వినియోగదారులపై వేసిన మొత్తం విద్యుత్ చార్జీల బాదుడు రూ.17,348.64 కోట్లకు చేరింది.