ఎవరి ప్రోద్బలంతో ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారు? | AP CID officials questions to MP Raghuram Krishnamraju | Sakshi
Sakshi News home page

ఎవరి ప్రోద్బలంతో ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారు?

May 16 2021 4:58 AM | Updated on May 16 2021 4:58 AM

AP CID officials questions to MP Raghuram Krishnamraju - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వాన్ని పథకం ప్రకారం అస్థిర పరచాలనే కుట్రకు మిమ్మల్ని పురిగొల్పింది ఎవరు.. ఎవరి ప్రోద్బలంతో మీరు ప్రభుత్వ, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారి ప్రతిష్టను దెబ్బతీసే చర్యలకు దిగారు? అంటూ ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఏపీ సీఐడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. కొద్ది రోజులుగా ఆయన పథకం ప్రకారమే కొన్ని మీడియా చానల్స్‌ చర్చ, వీడియో కాన్ఫరెన్సులు, సోషల్‌ మీడియా లైవ్‌లు, రచ్చ బండ పేరుతో ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ.. ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరిచే చర్యలకు పూనుకోవడంతోపాటు సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారు. దీనిపై సీఐడీ అడిషనల్‌ డీజీ పీవీ సునీల్‌ కుమార్‌ ఆదేశాల మేరకు ప్రాథమిక విచారణ అనంతరం ఏ1గా ఎంపీ రఘురామకృష్ణరాజుతోపాటు ఏ2, ఏ3లుగా టీవీ5, ఏబీఎన్, మరికొందరిపై సుమోటోగా కేసు నమోదు చేశారు. ఈ కేసులో తొలుత రఘురామను శుక్రవారం అరెస్టు చేసిన సీఐడీ బృందం గుంటూరులోని కార్యాలయానికి తరలించి అర్ధరాత్రి వరకు, శనివారం ఉదయం మరోసారి సుదీర్ఘంగా విచారించారు. డీఐజీ సునీల్‌ కుమార్‌ నాయక్‌ నేతృత్వంలో రెండు దఫాలుగా సాగిన ఈ విచారణలో రఘురామ నుంచి పలు కీలక విషయాలను రాబట్టినట్టు విశ్వసనీయ సమాచారం. కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం దాటవేయగా, మరికొన్నింటికి బదులు ఇవ్వడంతో వాటిని సీఐడీ అధికారులు రికార్డు (నమోదు) చేసినట్టు తెలిసింది. ఇప్పటికే సేకరించిన ప్రాథమిక ఆధారాలను ప్రస్తావిస్తూ సీఐడీ అధికారులు పలు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. 

కోవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ విచారణ
రఘురామకృష్ణరాజును అదుపులోకి తీసుకున్న దగ్గర్నుంచి కోర్టుకు హాజరు పరిచే వరకు సీఐడీ అధికారులు కోవిడ్‌ జాగ్రత్త చర్యలు పాటించారు. ఆయనకు అవసరమైన మందులు, ఆహారం వంటివి వ్యక్తిగత సహాయకులు అందించేలా ఏర్పాట్లు చేశారు. గుంటూరు ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి చెందిన వైద్య బృందాన్ని తీసుకొచ్చి ఆయనకు బీపీ, షుగర్‌ తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. అత్యవసర సేవల కోసం ముందుగానే అంబులెన్స్‌ను సైతం సిద్ధంగా ఉంచారు. 

టీవీ 5, ఏబీఎన్‌తో కలిసి కుట్ర..
ప్రభుత్వంపై టీవీ 5, ఏబీఎన్‌లతో కలిసి ఎందుకు కుట్ర చేశారని, దీని వెనుక ఎవరి లబ్ధి ఉందని సీఐడీ ప్రధానంగా ఆరా తీసినట్టు తెలిసింది. టీవీ 5, ఏబీఎన్‌ పెద్దలతో ప్రతినిత్యం టచ్‌లో ఉంటూ ప్రభుత్వాన్ని అస్థిర పరిచే చర్యలకు ఎందుకు పాల్పడ్డారని ఆధారాలతో సహా ప్రశ్నించినట్టు సమాచారం. రెడ్డి, క్రిస్టియన్‌ వర్గాలపైన విమర్శలు చేసి కించ పరుస్తున్నారని, సామాజిక వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించినట్టు సమాచారం. ఇవే విషయాలపై టీవీ 5, ఏబీఎన్‌లకు చెందిన వారితో ఏ ఉద్దేశంతో సంప్రదింపులు, సమావేశాలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించినట్టు తెలిసింది.

ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీసేలా, శాంతి భద్రతల సమస్యలు సృష్టించేలా వ్యాఖ్యలు చేస్తూ, ప్రజలను రెచ్చగొట్టేలా, కుల, మత, వర్గాలను టార్గెట్‌ చేసుకుని మీరు నిర్వహించే వీడియో ప్రసంగాలకు, వ్యంగ్య వ్యాఖ్యలకు టీవీ 5, ఏబీఎన్‌లు ఎందుకు సహకరించాయని ప్రశ్నించారు. ప్రభుత్వంపై, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిపై మీరు విషం చిమ్మేందుకు టీవీ 5, ఏబీఎన్‌లు ప్రత్యేక స్లాట్లు కేటాయించడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయని సీఐడీ అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. ఒక పథకం ప్రకారం ఉద్రిక్తతలకు పురిగొల్పే కుట్రతో వ్యవహరిస్తున్న మీకు ఎవరి నుంచి సహకారం అందుతోందని, ఎవరి ప్రోద్బలంతో ఇలా చేస్తున్నారని, ఇలా చేయడం వెనుక ఇంకా ఎవరున్నారు? తదితర విషయాలపై సీఐడీ అధికారులు కీలక వివరాలు రాబట్టినట్టు తెలిసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement