
సాక్షి, అమరావతి : పోలవరం సందర్శన పేరుతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. చంద్రన్న భజన చేయడం కోసం ఏకంగా రూ.83 కోట్లు ఖర్చు పెట్టారని సభలో పేర్కొన్నారు. ప్రజాధనాన్ని ఉపయోగించి చంద్రబాబు ఎలా భజన చేయించున్నారో ఓ వీడియో వేసి చూపించారు. అందులో పోలవరం సందర్శన వచ్చిన కొంతమంది టీడీపీ మహిళా కార్యకర్తలు చంద్రబాబును పొగుడుతూ భజన పాట పాడారు. చంద్రబాబు కృషి వల్లే పోలవరం ప్రాజెక్టు పూర్తయిందని భజన చేశారు.
ఈ వీడియో చూసి సీఎం జగన్, స్పీకర్ తమ్మినేని సీతారాంతో పాటు మిగిలిన సభ్యులు పడి పడి నవ్వారు. నవ్వు ఆపుకోలేకపోయిన సీఎం జగన్ మధ్యలోనే ఆ వీడియోను ఆపేయించారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ.. ఇలా ప్రజల సొమ్ముతో బస్సులు పెట్టించి చంద్రబాబు భజన చేయించుకున్నారని విమర్శించారు. ఇక వీడియో చూసిన స్పీకర్ తమ్మినేని.. అప్పట్లో ఇన్ని నేరాలు.. ఘోరాలు జరిగాయన్నమాట అంటూ ఘోల్లున నవ్వారు.
ఒక్క అంగుళం కూడా ఎత్తు తగ్గించం: సీఎం జగన్
పోలవరం నిర్మాణంలో ఒక్క అంగుళం కూడా ఎత్తు తగ్గించబోమని సీఎం జగన్ స్పష్టం చేశారు. వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా 45.72 మీటర్ల ఎత్తు కచ్చితంగా నిర్మిస్తామన్నారు. యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయని సభకు వివరించారు. ఎట్టి పరిస్థితిల్లో ప్రాజెక్టు ఆపబోమన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి అక్కడ 100 అడుగుల వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ మరోసారి పునరుద్ఘాటించారు.