తిరుమలలో యాంటీ డ్రోన్‌ అటాక్‌ మిషన్లు!

Anti Drone Attack Missions in Tirumala - Sakshi

కొనుగోలు యోచనలో టీటీడీ

సర్వే చేయాల్సిందిగా డీఆర్‌డీవోకు ప్రతిపాదన

సాక్షి ప్రతినిధి, తిరుపతి: కలియుగ వైకుంఠంగా విరాజిల్లుతున్న తిరుమల పుణ్యక్షేత్రంపై డ్రోన్‌ల సంచారం, దాడిని ఎదుర్కొనేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) యాంటీ డ్రోన్‌ ఎటాక్‌ మిషనరీని సిద్ధం చేసుకోవాలని భావిస్తోంది. మిషనరీ కొనుగోళ్లకు టీటీడీ స్పెసిఫైడ్‌ అథారిటీ ఆమోదముద్ర వేసినట్టు సమాచారం. తిరుమలకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందని ఇప్పటికే పలుమార్లు నిఘా సంస్థలు హెచ్చరించిన సంగతి తెలిసిందే.

ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పర్యాటక స్థలాలపై డ్రోన్లతో దాడులు జరుగుతున్న పరిస్థితుల్లో టీటీడీ ఆ మేరకు నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. ఈ విషయమై టీటీడీ చీఫ్‌ విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ గోపీనాథ్‌జెట్టి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. కౌంటర్‌ డ్రోన్‌ టెక్నాలజీపై ఇటీవల డీఆర్‌డీవో, బీహెచ్‌ఈఎల్‌ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమానికి టీటీడీ తరఫున హాజరయ్యామని చెప్పారు. భవిష్యత్తులో డ్రోన్ల దాడిని తిప్పికొట్టగలిగే సామర్థ్యాన్ని టీటీడీ సమకూర్చుకునే క్రమంలో భాగంగానే తిరుమలలో సైట్‌ సర్వే చేయాల్సిందిగా డీఆర్‌డీవో (డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌) అధికారులకు ప్రతిపాదన పంపామని చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top