ముందే మద్దతు ధర.. సీజన్‌ ప్రారంభంలోనే ప్రకటన

Andhra Pradesh Govt Announced Crop Prices Before Kharif - Sakshi

గతేడాది కంటే పెంచిన ప్రభుత్వం 

ఆనందంలో అన్నదాతలు  

కడప అగ్రికల్చర్‌: ఏ పంట సాగు చేసుకుంటే లాభదా యకంతోపాటు గిట్టుబాటు అవుతుందనే విషయాన్ని రైతులకు తెలిసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకు గాను ఖరీఫ్‌ సాగుకు ముందే మద్దతు ధర ప్రకటించింది. గతేడాది కూడా సీజన్‌కు ముందుగానే పంటల వారీగా కనీస మద్దతు ధర ఖరారు చేసింది. కేంద్ర ప్రభుత్వం జాబితాను రాష్ట్రాలకు అందజేస్తూ రైతుల్లో అవగాహన కల్పించాలని సూచించింది.

పంటల వారీగా రైతులు సాగుకు పెడుతున్న పెట్టుబడులు, వస్తున్న దిగుబడులు, మార్కెట్‌లో పలుకుతున్న ధరలు, అన్నదాతకు లభిస్తున్న నికరాదాయం తదితర అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏటా మినియం సపోర్టు ప్రైసెస్‌(ఎంఎస్‌సీ) ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా 17 పంటలకు మద్దతు ధరను ప్రకటించి రైతులకు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది.  

20 రకాల పంటలకు గాను 17 రకాలకు ప్రకటన 
ఖరీఫ్‌నకు సంబంధించి జిల్లాలో సాగయ్యే 20 రకాల పంటలకు గాను ఈ ఏడాది 17 రకాలకు మద్దతు ధర(ఎంఎస్‌పీ)ని ప్రకటించింది. జిల్లాలో ప్రధానంగా వరి, వేరుశనగ, పొద్దుతిరుగుడు, పత్తి, పసుపు, మిరపతోపాటు పలు రకాల పంటలకు మద్దతు ధరను ప్రకటించారు. ఇందులో వరిధాన్యంపై రూ.100, జొన్నలు 232, సజ్జలు 100, రాగులు 201, కందులు, వేరుశనగ 300, పత్తి 335, మినుములు 300, పెసలు 480, సోయాబీన్‌ 350, సన్‌ఫ్లవర్‌పై రూ.385 మేర ధరను పెంచారు.   

ఆర్‌బీకే ద్వారా.. 
పంట చేతికొచ్చిన సమయంలో బహిరంగ మార్కెట్‌లో ఎంఎస్‌పీ కన్నా తక్కువ ధరలు ఉంటే.. వరి, వేరుశనగ, కంది, పసుపులతోపాటు పలు పంటలను ఆర్‌బీకే వేదికగా కోనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసింది. ఇందులో వ్యవసాయ, మార్కెటింగ్‌ సహకారంతో మార్క్‌ఫెడ్, నాఫెడ్, ఏపీ సీడ్స్, కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా తదితర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన నోడల్‌ ఏజెన్సీల ద్వారా కొనుగోళ్లు చేసి సకాలంలో రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. గతేడాది వరి, పసుపు కొనుగోలు గతేడాది ఖరీఫ్, రబీ సీజన్‌లో జిల్లాలో వరి, పసుపు కొనుగోలు చేశారు. రైతులకు డబ్బులను కూడా ఆన్‌లైన్‌ ద్వారా ఖాతాలకు జమ చేశారు.  

చాలా పంటలకు మద్దుతు ధర 
రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కూడా చాలా పంటలకు మద్దతు ధర ప్రకటించింది. బహిరంగ మార్కెట్‌లో ధర తక్కువగా ఉన్నప్పుడు ప్రభుత్వం కల్పించుకుని సంబంధిత గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేస్తోంది. గిట్టుబాధ ధర కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.  
– హిమశైల, ఏడీ, మార్కెటింగ్‌ శాఖ, వైఎస్సార్‌ జిల్లా

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top