
ఒకే ఒక్క సభ్యుడితో నడుస్తున్న ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి
చైర్మన్ పోస్టు భర్తీ చేయకుండానే లీగల్ మెంబర్ నియామక ప్రక్రియ
ఆ పోస్టుకు రెండు సామాజిక వర్గాల నుంచి ఇద్దరు న్యాయవాదుల పేర్లు
చైర్మన్ పోస్టుకు ఇప్పటికే ఓ సీనియర్ ఐఏఎస్ పేరు అనధికారికంగా ఖరారు
లీగల్ సభ్యుడి పోస్టుకూ అదే సామాజికవర్గం వ్యక్తి పేరు ప్రతిపాదన
తమ సామాజిక వర్గానికి ఇవ్వాలని పట్టుబడుతున్న బాబు సన్నిహితుడు
ఎటూ తేలక రోజుల తరబడి సీఎం వద్దనే పెండింగ్‌లో ఫైల్
సాక్షి, అమరావతి: స్వయం ప్రతిపత్తితో నిర్ణయాలు తీసుకుని పారదర్శకంగా ప్రజలకు మేలు చేయాల్సిన వ్యవస్థల్లో సైతం కూటమి ప్రభుత్వం రాజకీయాలను చొప్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)లో జరుగుతున్న పరిణామాలే అందుకు తాజా నిదర్శనం. రాజకీయ, సామాజిక వర్గ సమీకరణలు తేలకపోవడంతో లీగల్ మెంబర్ భర్తీ ఫైల్ సీఎం వద్ద పెండింగ్‌లో పడింది!
ఏం జరుగుతోందంటే..
ఒక చైర్మన్, ఇద్దరు సభ్యులు ఉండే ఏపీఈఆర్‌సీకి 2024 అక్టోబర్ నుంచి పూర్తి స్థాయి చైర్మన్ లేరు. ఈ ఏడాది ఫిబ్రవరిలో లీగల్ సభ్యుడు పదవీ విరమణ చేయడంతో అప్పటి నుంచి ఒకే ఒక్కరు ఇన్‌చార్జ్ చైర్మన్‌గా, సభ్యుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. నెలల తరబడి సాగదీత తరువాత ప్రభుత్వం లీగల్ సభ్యుడి నియామక ప్రక్రియ చేపట్టింది. జూన్ 18న ఈ నోటిఫికేషన్ విడుదల కాగా జూలై 9వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని పేర్కొంది. తరువాత గడువు జూలై 16 వరకు పొడిగించారు. అదీ సరిపోదని జూలై 25 వరకూ మళ్లీ గడువిచ్చారు.
న్యాయ వ్యవస్థలో ఉన్నవారు, ఇతర ఏ కార్యాలయాల్లోనూ ఉద్యోగి కాని వారు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. 50 ఏళ్ల లోపు వయసు ఉన్నవారు అనర్హులని, ఎంపికైన అభ్యర్థి ఐదేళ్ల పాటు ఏపీఈఆర్‌సీ సభ్యుడిగా కొనసాగుతారని నిబంధనల్లో పేర్కొన్నారు. వచి్చన దరఖాస్తుల్లో ఐదుగురి పేర్లను ఎంపిక చేసిన ఇంధన శాఖ ఆ ఫైలును ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించింది. అంతే.. ఆ తరువాత అక్కడి నుంచి ఫైలు కదలలేదు.
స్వయంగా హైకోర్టు కలుగజేసుకోవడంతో..
రూ.వేల కోట్ల విలువైన ప్రాజెక్టులతోపాటు ప్రజల నుంచి వసూలు చేసే విద్యుత్ చార్జీలను నిర్ణయించే ప్రతిపాదనలపై విచారణ జరిపి ఆమోదించడం లేదా తిరస్కరించడం లాంటి కీలక బాధ్యతలను ఏపీఈఆర్‌సీ చైర్మన్ నిర్వర్తిస్తారు. అంత కీలకమైన పోస్టును కూటమి ప్రభుత్వం భర్తీ చేయకపోవడంపై ఇటీవల స్వయంగా హైకోర్టు కలుగజేసుకుంది.
ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ను ఎప్పటిలోగా నియమిస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే రిటైర్డ్ న్యాయమూర్తి స్థాయి వ్యక్తులు ఏపీఈఆర్‌సీ చైర్మన్ స్థానంలో ఉంటే తమ ఆటలు సాగవని ప్రభుత్వ పెద్దలు గ్రహించారు. దీంతో త్వరలో పదవీ విరమణ చేయనున్న సీనియర్ ఐఏఎస్ అధికారికి ఆ పదవిని కట్టబెట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. అనధికారికంగా ఇప్పటికే ఆయన పేరును ఖరారు చేశారు. ఈ క్రమంలో తొలుత లీగల్ మెంబర్ పోస్టు భర్తీ చేయాలని నిర్ణయించారు.
ఓ సీనియర్ నేత జోక్యంతో...
చైర్మన్ పదవికి తాము ఎంచుకున్న సీనియర్ ఐఏఎస్ అధికారి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికే లీగల్ సభ్యుడి పోస్టును కూడా ఇవ్వాలని భావించారు. అయితే అదే సమయంలో కేంద్రంలో రాజ్యాంగబద్ధ పదవిని నిర్వర్తించిన ఓ సీనియర్ నేత జోక్యం చేసుకుని తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తినే లీగల్ సభ్యుడిగా నియమించాలని సూచించడంతో ఎటూ తేలడం లేదు.
చైర్మన్, మెంబర్ పోస్టులను ఒకే సామాజిక వర్గం వారికి ఇస్తే విమర్శలు వస్తాయని ఆ సీనియర్ నేత చెబుతున్నట్లు తెలుస్తోంది. పోనీ లీగల్ మెంబర్ పోస్టును భర్తీ చేయకుండా వదిలేద్దామనుకుంటే అప్పుడు చైర్మన్ పదవిలో తప్పనిసరిగా రిటైర్డ్ న్యాయమూర్తిని నియమించాల్సి ఉంటుంది. దీంతో ఎటూ తేల్చలేక ఏపీఈఆర్‌సీ సభ్యుడి భర్తీ ఫైలు రోజుల తరబడి సీఎం వద్దనుంచి కదలడం లేదు.