Andhra Pradesh: వేతనాలు తగ్గవు..ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ స్పష్టీకరణ

Andhra Pradesh CS Sameer Sharma On Implementation of new PRC - Sakshi

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ స్పష్టీకరణ

హెచ్‌ఆర్‌ఏ జీతంలో ఓ భాగం మాత్రమే

ఐఆర్‌ కేవలం సర్దుబాటే.. ఉద్యోగుల జీతంలో భాగం కాదు

గత పీఆర్సీ, ఈ పీఆర్సీ మధ్య తేడా చూడాలి

సగటున ప్రతి ఉద్యోగికి 20 శాతం జీతం పెరుగుతుంది

ఈ నెల పే స్లిప్‌.. వచ్చే నెల పే స్లిప్‌ పోల్చి చూసుకోండి

ఉద్యోగుల జీతాల బడ్జెట్‌ ఇతర రాష్ట్రాల కంటే చాలా ఎక్కువ

14.29 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని కమిటీ చెబితే.. సీఎం 23% ఇచ్చారు

పెరిగే జీతాల వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.10 వేల కోట్ల అదనపు భారం

ఇతరత్రా భారం మరో రూ.10 వేల కోట్లు 

ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపుతో ప్రతి ఉద్యోగికీ రూ. 24 లక్షల లబ్ధి

ఇళ్ల స్థలం రూపేణా నేరుగా రూ.10 లక్షల వరకు లబ్ధి.. గ్రాట్యుటీ పెంపు 

80 ఏళ్ల తర్వాత ఖర్చులు పెరిగే చాన్స్‌..అందుకే అప్పుడు పెన్షన్‌ పెంపు

కరోనా వల్ల రూ.98 వేల కోట్ల నుంచి రూ.62 వేల కోట్లకు తగ్గిన ఆదాయం

కరోనా సమయంలో ఉద్యోగులకు రూ.17 వేల కోట్ల ఐఆర్‌ ఇచ్చాం

అశుతోష్‌ మిశ్రా కమిటీ సిఫారసులను చాలా వరకు అమలు చేశాం

పీఆర్సీలో 90 శాతం సిఫారసులను ప్రభుత్వం అమలు చేస్తోంది

త్వరలో అన్ని సమస్యలకు పరిష్కారం

సాక్షి, అమరావతి: కొత్త పీఆర్సీ అమలు వల్ల ఎవరి వేతనాలు తగ్గవని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ స్పష్టం చేశారు. పది రోజులు ఆగితే పే స్లిప్‌లు వస్తాయని, గత పేస్లిప్, ఇప్పటి పేస్లిప్‌ను పోల్చి చూసుకుంటే ఈ విషయం అర్థమవుతుందన్నారు. ఉద్యోగులందరి జీతాలను లెక్కించామని, ఏ ఉద్యోగి గ్రాస్‌ జీతంలో తగ్గుదల ఉండదన్నారు. హెచ్‌ఆర్‌ఏ జీతంలో భాగమని, ఐఆర్‌ అనేది సర్దుబాటు అని చెప్పారు. గత పీఆర్సీ, ఈ పీఆర్సీ మధ్య తేడా చూడాలన్నారు. సగటున ప్రతి ఉద్యోగి జీతం 20 శాతం పెరుగుతుందని తెలిపారు. మధ్యంతర భృతి (ఐఆర్‌) తీసి వేసిన తర్వాత కూడా జీతాల్లో తగ్గుదల లేదని చెప్పారు.

సచివాలయంలో బుధవారం ఆయన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ ఇతర అధికారులతో కలిసి పీఆర్సీకి సంబంధించిన పలు అంశాలపై మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. హెచ్‌ఆర్‌ఏ అంశం వేరని, కొత్త స్లాబు ప్రకారం హెచ్‌ఆర్‌ఏ 2 నుంచి 5 శాతం తగ్గినా గ్రాస్‌లో అది కనిపించదన్నారు. కొన్ని తగ్గి, కొన్ని పెరిగినా మొత్తంగా ఉద్యోగుల జీతాలు తగ్గవని స్పష్టం చేశారు. పది సంవత్సరాల క్రితం ఇచ్చిన పీఆర్సీ ప్రక్రియలో తాను ఆర్థిక శాఖ కార్యదర్శిగా పాల్గొన్నానని, అప్పటికి, ఇప్పటికీ చాలా తేడా ఉందన్నారు. కరోనా వల్ల ప్రస్తుతం ఆదాయం రూ.62 వేల కోట్లకు తగ్గిపోయిందని తెలిపారు. కరోనా లేకపోతే ఇది రూ.98 వేల కోట్లకు చేరుకునేదన్నారు. కరోనా వల్ల సొంత రెవెన్యూ తగ్గిందని, ఇప్పుడు మళ్లీ ఒమిక్రాన్‌ వల్ల రెవెన్యూపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పారు. సీఎస్‌ ఇంకా ఏమన్నారంటే..

కేంద్రం మోడల్‌ను అనుసరిస్తున్నాం
► కేంద్ర ప్రభుత్వ వేతన సవరణ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనుసరించింది. ఐఏఎస్‌ అధికారులకు ఎక్కువ జీతాలు వస్తున్నాయనడం నిజం కాదు. పీఆర్సీతో ఉద్యోగులకు చాలా ప్రయోజనాలున్నాయి. కాంట్రాక్టు ఉద్యోగులకు టైమ్‌ స్కేల్స్‌ వచ్చాయి. హోంగార్డులు, ఏఎన్‌ఎంల జీతాలు పెరిగాయి. గ్రాట్యుటీ కూడా పెరిగింది.
► 14.29 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని కమిటీ చెబితే ముఖ్యమంత్రి 23 శాతం ఇచ్చారు. పెరిగే జీతాల వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.10 వేల కోట్లు అదనపు భారం పడుతుంది. ఇతరత్రా భారం మరో రూ.10 వేల కోట్లు ఉంటుంది. 
► ఎంతో అధ్యయనం తర్వాత కేంద్ర వేతన సవరణ కమిషన్‌ 80 ఏళ్ల తర్వాత పెన్షనర్లకు ఖర్చులు పెరుగుతాయని.. ఎక్కువ డబ్బు అవసరం అని చెప్పి, అమలు చేస్తోంది. ఆ కమిషన్‌లో మెరుగైన వృత్తి నిపుణులున్నారు. వారి మోడల్‌ను మేము అనుసరిస్తున్నాం. ప్రస్తుతం పెన్షనర్ల వైద్యం అలవెన్సు పెరుగుతుంది. ఉద్యోగుల కనీస పే స్కేల్‌ రూ.20 వేలకు పెరుగుతుంది. 

మనదంతా ఒకే కుటుంబం..
► అవుట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు పీఆర్సీలో భాగం కాకపోయినా వారికి ఇప్పటి నుంచే డబ్బు ఇస్తున్నాం. ప్రభుత్వం అమలు చేస్తున్నది చాలా మెరుగైన విధానం. ఒకే దేశం, ఒకే పీఆర్సీ. అశుతోష్‌ మిశ్రా కమిటీ సిఫారసులను ప్రభుత్వం పక్కన పెట్టలేదు. వాటిలో చాలా అంశాలను అమలు చేస్తున్నాం.
► పీఆర్సీలో సిఫారసులు మాత్రమే చేస్తాం. వాటిని ప్రభుత్వం అమలు చేయొచ్చు, చేయకపోవచ్చు. అయినా పీఆర్సీలోని 90 శాతం సిఫారసులను ప్రభుత్వం యథావిధిగా అమలు చేస్తోంది. నేను కార్యదర్శుల కమిటీకి నేతృత్వం వహించి నివేదిక ఇచ్చాను. ఇంకా అనేక మార్గాల ద్వారా ముఖ్యమంత్రికి ఎంతో సమాచారం, వివరాలు వెళతాయి. వాటన్నింటినీ చూసి ఆయన నిర్ణయం తీసుకున్నారు. మేము చేసిన సిఫారసుల్లో చాలా వాటిని అంగీకరించారు. 
► ఉద్యోగులు ఇప్పుడైనా ప్రభుత్వంతో మాట్లాడుకోవచ్చు. మనదంతా ఒకటే కుటుంబం. పిల్లలకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే తండ్రినే అంటారు. అలాగే నన్నూ అని ఉండవచ్చు. అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. 
► ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ఈఓ కార్యదర్శి సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

అందరం కలసి సిఫారసులు చేశాం
కొత్త పీఆర్సీలో ప్రతి ఉద్యోగికీ వేతనం పెరుగుతుంది. సీఎస్‌ని నిందించడం సబబు కాదు. కార్యదర్శుల కమిటీకి ఆయన నేతృత్వం వహించారు. అందరం కలసి సిఫారసులు చేశాం. వ్యక్తిగత నిర్ణయం ప్రకారం ఏమీ జరగలేదు. ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని మేము సిఫారసు చేయకపోయినా సీఎం ప్రకటించారు. ఉద్యోగులతో మాకు మంచి సంబంధాలున్నాయి. అవి కొనసాగుతాయి. రాష్ట్ర విభజన వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయింది. 9, 10వ షెడ్యూల్‌లో ఉన్న ఆస్తులకు సంబంధించి రూ.1.06 లక్షల కోట్లు, రూ.39,191 కోట్లు నష్టపోయాం. రాజధాని నగరం కోల్పోవడం వల్ల ఏడేళ్లలో లక్షా 80 వేల కోట్ల నష్టం వచ్చింది. తెలంగాణ ఇవ్వాల్సిన విద్యుత్‌ బకాయిలు రూ.6,284 కోట్లు ఉన్నాయి. కోవిడ్‌ వల్ల రూ.21,933 కోట్ల ఆదాయాన్ని కోల్పోగా, అదనంగా రూ.30 వేల కోట్లు ఖర్చయింది. 
– ఎస్‌ఎస్‌ రావత్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి

ఐఏఎస్‌ అధికారుల హెచ్‌ఆర్‌ఏ రద్దుకు నిర్ణయం
ఉద్యోగులకు ఒక ప్యాకేజీలా ప్రభుత్వ ప్రయోజనాలు అందుతాయి. ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడం వల్ల ప్రతి ఉద్యోగికి రూ.24 లక్షల అదనపు ప్రయోజనం కలుగుతుంది. ఇళ్ల స్థలాల వల్ల రూ.10 లక్షల వరకు నేరుగా లబ్ధి కలుగుతుంది. రిటైర్‌మెంట్‌ సమయంలో ఇచ్చే గ్రాట్యూటీ కూడా పెరిగింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పీఆర్సీ ఏర్పాటు సమయానికి లేరు. అయినా సీఎం వారికి ప్రొబేషన్‌ ఇచ్చి, స్కేలు ఇవ్వాలని నిర్ణయించారు. ఐఏఎస్‌ అధికారుల హెచ్‌ఆర్‌ఏ రూ.40 వేలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని నిర్ణయించింది.
– శశిభూషణ్‌కుమార్, జీఏడీ ముఖ్య కార్యదర్శి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top