
సాక్షి, శ్రీకాకుళం: రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని డిమాండ్ చేస్తూ.. ఆముదాలవలసలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆందోళనకు దిగారు. ఎరువులు అందించడంలో కూటమి సర్కార్ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ్మినేని సీతారాంను అడ్డుకున్న పోలీసులు.. బలవంతంగా జీపులో ఎక్కించి ఆయన ఇంటికి తరలించారు. దీంతో పోలీసులు, తమ్మినేని సీతారాం మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. తమ్మినేని సీతారాంను హౌస్ అరెస్ట్ చేశారు. భారీగా పోలీసులు మోహరించారు.
కాగా, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత జిల్లా శ్రీకాకుళంలో ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. జిల్లాలో ఎరువుల కొరతను దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి బస్తా రూ.400తో అమ్మకాలు చేస్తున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న అరకొర ఎరువులు రైతు భరోసా కేంద్రాలకు కాకుండా కూటమి నాయకుల ఇళ్ల వద్ద ఉంచుకుని ఆ పార్టీ వర్గీయులకే అందిస్తున్నారు.

ఓ వైపు తీవ్ర వర్షాభావం.. మరో వైపు అధిక వర్షాలు.. ఇలా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఖరీఫ్ సాగు చేస్తున్న రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం ప్రత్యక్ష నరకం చూపిస్తోంది. పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో లక్షలాది ఎకరాలు ముంపు బారిన పడ్డాయి. అధికారిక లెక్కల ప్రకారమే 2.5 లక్షల ఎకరాలు ముంపునకు గురైనట్టు చెబుతుండగా, వాస్తవానికి దాదాపు 4 లక్షల ఎకరాలకు పైగా ముంపునీటిలో చిక్కుకున్నాయి. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్, కృష్ణ, గోదావరి జిల్లాలతో పాటు దాదాపు 14 జిల్లాల్లో ఎటు చూసినా ముంపునీటిలో చిక్కుకున్న పంటలను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు.

ఈ పంటలు తిరిగి నిలదొక్కుకోవాలంటే బూస్టర్ డోస్ ఇవ్వాల్సిందే. లేకుంటే పంట పెరుగుదల లేక దిగుబడులు తగ్గి పంట నాణ్యత దెబ్బ తింటుంది. ప్రస్తుతం పిలక కట్టే దశలో వరి పైరు ఉంది. ఈ దశలో ఎకరాకు కనీసం 20 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటాష్, పత్తికైతే 25–30 కిలోల యూరియా, 10–15 కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ పైపాటుగా వేయాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

ప్రణాళికా బద్ధంగా ఎరువుల సరఫరాలో ప్రభుత్వం ఇప్పటికే చేతులెత్తేసింది. బఫర్ స్టాక్ నిర్వహణలో మార్క్‌ఫెడ్ విఫలమైంది. ఈసారి 2 లక్షల టన్నుల ఎరువులను నిల్వ చేయనున్నామని, రైతులకు కొరత లేకుండా సరఫరా చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ ఆచరణలో లక్ష టన్నులు కూడా సరఫరా చేయలేని దుస్థితిలో ఉన్నారు. కారణం బఫర్ స్టాక్ నిర్వహణకు అవసరమైన నిధులు విడుదలలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేయడమే కారణం. మరో వైపు ఉన్న కొద్దిపాటి నిల్వలను టీడీపీ నేతలు దొడ్డిదారిన తమ గోదాములకు మళ్లిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.