ఆకివీడు: హిందూ సంఘాల ర్యాలీలు, సభలు నిర్వహిస్తాయనే సమాచారంతో పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు ఆదివారం పోలీసుల దిగ్బంధనంలోకి వెళ్లిపోయింది. అడుగడుగునా పోలీస్ పహారా నడిచింది. వివాదాస్పద దేవాలయం విషయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. భీమవరం డీఎస్పీ రఘువీర్‌రెడ్డి. ఎస్‌ఐ హనుమంతు నాగరాజు ఆధ్వర్యంలో 300 మంది పోలీసులు పహారా కాశారు. విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనుమానితులను ప్రశ్నించారు.
ఉద్రిక్తతకు తావులేకుండా ఆకివీడుకు వచ్చే అన్ని దారుల్లో పోలీస్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారి నంబర్ 165 ఆకివీడు ఉప్పుటేరు వద్ద నుంచి అజ్జమూరు, కుప్పనపూడి, గుమ్ములూరు, ఉండి, భీమవరం, పాలకొల్లు, నర్సాపురం తదితర ప్రాంతాల నుంచి, కలవపూడి–గణపవరం రోడ్డులో పెదకాపవరం, గణపవరం, ఏలూరుపాడు, అయిభీమవరం, చెరుకుమిల్లి, కాళ్ళ, కుప్పనపూడి తదితర ప్రాంతాల్లో పోలీస్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఆయా చెక్‌పోస్టుల వద్ద డ్రోన్ కెమెరాలతో వాహనాలను తనిఖీ చేశారు.
గ్రామాల నుంచి అనుమానాస్పద వ్యక్తులు తరలిరాకుండా గట్టి బందోబస్తు నిర్వహించారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. భజరంగ్‌దళ్ జిల్లా అధ్యక్షుడు రామన్నపూడి శివప్రసాద్, మరో నేత రాజానాల రామ్మోహనరావుతో పాటు పలువురు భజరంగ్‌దళ్ సభ్యులను అదుపులోకి తీసుకుని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో బైండోవర్ చేశారు. ఎటువంటి ర్యాలీలూ నిర్వహించకుండా అడ్డుకున్నారు. పెదపుల్లేరు నుంచి వస్తున్న శివ భక్తులు, అర్చకులను 20 మందిని అదుపులోకి తీసుకుని ఉండిలో కోట్ల ఫంక్షన్ హాలులో ఉంచారు.


