
రిలయన్స్ సీబీజీ ప్లాంట్‌లను తామే తెచ్చినట్లు చెప్పుకోవడానికి కూటమి సర్కారు గిమ్మిక్కులు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో ప్లాంట్ల ఏర్పాటుకు ఒప్పందం
తొలి దశలో ఎనిమిది ప్లాంట్లకు 2024 ఫిబ్రవరి 14న శంకుస్థాపన
302 ఎకరాల్లో రూ.1,920 కోట్లతో ఏకకాలంలో 8 ప్లాంట్లు ప్రారంభం
వేగంగా పనులు పూర్తి చేసుకుని ఉత్పత్తికి సిద్ధమవతున్న అన్ని ప్లాంట్లు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ చొరవతో మరిన్ని ప్లాంట్లు పెట్టడానికి ముందుకొచ్చిన రిలయన్స్
సాక్షి, అమరావతి: కొత్త ప్రాజెక్టులను ఆకర్షించడంలో విఫలమవుతున్న కూటమి సర్కారు.. గత ప్రభుత్వ హయాంలో వచి్చన ప్రాజెక్టులను నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుంటోంది. వైఎస్ జగన్ సీఎంగా ఉండగా రాష్ట్రంలో 100 కంప్రెస్డ్ బయో గ్యాస్ (సీబీజీ) యూనిట్లను ఏర్పాటు చేసేలా ఒప్పందం కుదుర్చుకోవడమే కాకుండా తొలి దశలో ఎనిమిది యూనిట్లకు శంకుస్థాపన కూడా చేస్తే ఇప్పుడు వాటిని కొత్తగా తామే తెచి్చనట్లు కూటమి ప్రచారం చేసుకుంటోంది. గత ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టు కింద తొలుత కాకినాడలో 3, రాజమండ్రిలో 2, కర్నూలు, నెల్లూరు, విజయవాడలో ఒక్కొక్కటి చొప్పున 8 ప్లాంట్లు ఏర్పాటు చేసింది.
సుమారు రూ.1,920 కోట్ల పెట్టుబడితో 302 ఎకరాల్లో నెలకొల్పిన వీటిలో ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 1,05,500 టన్నులు. 70 వేల మంది రైతులకు ప్రయోజనం కలగనుందని గత ప్రభుత్వం ప్రకటించింది. విజయవాడ సమీపంలోని కంచికచర్ల మండలం దొనబండ, తూర్పుగోదావరి జిల్లా కాపవరం వద్ద సీబీజీ ప్లాంట్ల నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతూ ఈ ఏడాదిలోనే ఉత్పత్తికి సిద్ధమవుతున్నాయి. వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే కూటమి సర్కారు తన అనుకూల పత్రికలు, సోషల్ మీడియా ద్వారా ఈ ప్రాజెక్టును మంత్రి లోకేశ్ తీసుకొచి్చనట్లు భారీ ప్రచారానికి శ్రీకారం చుట్టాయి.
ఎన్టీపీసీ భారీ ప్లాంట్‌పైనా..
రిలయన్స్ సీబీజీ ప్లాంట్ల విషయంలోనే కాదు ఎన్టీపీసీ దేశంలోనే తొలిసారిగా రూ.1.10 లక్షల కోట్లతో రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ యూనిట్ ఏర్పాటుకు గత ప్రభుత్వ హయాంలో విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో ఒప్పందం చేసుకుంది. అన్ని పరిపాలన అనుమతులు, భూ బదలాయింపులు గత ప్రభుత్వ హయాంలోనే జరిగితే దాన్ని కూడా తామే తీసుకొచి్చనట్లు డప్పు కొంటుకుంటున్నారు. ఒక్క గ్రీన్ ఎనర్జీ రంగంలోనే రూ.పది లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే ఇప్పుడు కాకినాడ గ్రీన్‌కో యూనిట్ వంటి వాటిని తమ ఖాతాలో వేసుకుంటున్నారు.
వైఎస్ జగన్ దావోస్ పెట్టుబడుల సమావేశంలో పాల్గొని ఆర్సెలర్ మిట్టల్ గ్రూప్ సీఈవో ఆదిత్య మిట్టల్‌తో సమావేశమయ్యారు. ఆయనను ఏపీలో పెట్టుబడులకు ఒప్పించారు. కానీ, ఒక్కసారి నేరుగా కలవకుండానే ఒక్క ఫోన్ కాల్‌తో అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్‌ను తామే తీసుకొచ్చామని చెప్పుకోవడం చంద్రబాబు, లోకేశ్‌కు తప్ప ఎవరికీ సాధ్యం కాదని అధికారులే ఆశ్చర్యపోతున్నారు.
నాడు ముఖేష్ అంబానీ రాక.. నేడు ఆకాష్ అంబానీ డుమ్మా
రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన పెట్టుబడుల సదస్సుల్లో ఒక్కదానికి కూడా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ హాజరు కాలేదు. కానీ, 2023లో వైఎస్ జగన్ సర్కారు ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్‌లో పాల్గొని గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ.50 వేల కోట్ల పెట్టుబడులు పెట్టే విధంగా ఒప్పందం చేసుకున్నారు. ముఖేష్ అంబానీ, ఆయన తనయుడు ఆకాష్ అంబానీ 2020 ఫిబ్రవరిలో తాడేపల్లిలోని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటికి స్వయంగా వెళ్లి రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చించారు.
ఇప్పుడు కనిగిరిలో రిలయన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీతో కలిసి ఐటీ శాఖ మంత్రి లోకేశ్ రిలయన్స్ సీబీజీ ప్లాంట్ శంకుస్థాపనలో పాల్గొంటారని కూటమి నేతలు పెద్దఎత్తున ప్రచారం చేశారు. ఆకాష్ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నా.. కనిగిరి కార్యక్రమంలో పాల్గొనలేదు. సీఎం చంద్రబాబు కాకుండా ఈ శాఖతో సంబంధం లేని లోకేశ్ హైజాక్ చేయడం.. మొత్తం పెట్టుబడులు తానే ఆకాష్ తో మాట్లాడి తెచ్చానంటూ అతి ప్రచారం చేసుకోవడంతో చివరి నిమిషంలో ఆకాష్ కనిగిరి పర్యటన రద్దు చేసుకున్నట్లుగా విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. ఇది ప్రభుత్వ విశ్వసనీయతకు అద్దం పడుతోందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.