అసలేం జరిగింది! | AE Nookaraju Family Incident | Sakshi
Sakshi News home page

అసలేం జరిగింది!

Aug 20 2026 9:31 AM | Updated on Aug 20 2026 10:02 AM

AE Nookaraju Family Incident

కాకినాడ: పంచాయతీరాజ్‌ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ముందుగా నూకరాజు, ఆయన కూతురు సౌజన్య రాసిన మరణ వాంగ్మూలాలు, అనంతరం వియ్యంకుడు భాస్కరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నూకరాజు, సౌజన్యల సెల్‌ ఫోన్లలో డిలీట్‌ చేసిన డేటాను రికవరీ చేయడం ద్వారా కీలక ఆధారాలు లభిస్తాయనే కోణంలో వారి సెల్‌ ఫోన్లను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించే పనిలో ఉన్నారు. మరో పక్క ఈ కేసులో నిందితుడైన సాధిక్‌ ఖాన్‌ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. అతడు కర్ణాటకకు పారి పోయినట్లు గుర్తించి, నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అలాగే గోదావరిలో గల్లంతైన నూకరాజు భార్య మీనా, కూతురు సౌజన్యల ఆచూకీ మూడో రోజూ లభ్యం కాలేదు.  

ఫోన్‌ సంభాషణలే ఆధారం 
నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు యత్నించిన ఆదివారం రాత్రి ఏం జరిగింది అనే దానిపై పోలీసులు దృష్టి సారించారు. కుటుంబ సభ్యులతో కలిసి కారులో రాజమహేంద్రవరం బయలు దేరిన ఆయన.. దారిలో ఎవరిని కలిశారు, ఎక్కడెక్కడ ఆగారు, ఏ ప్రాంతంలో ఎంత సేపు ఉన్నారు, ఎవరితో మాట్లాడారు తదితర వాటిపై ఆరా తీస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచి అర్ధరాత్రి గోదావరిలోకి దూకే వరకు ఫోన్‌ సంభాషణలను విశ్లేషిస్తున్నట్లు సమాచారం. కాకినాడ నుంచి బయలుదేరి రాజమహేంద్రవరం వెళ్లే వరకు సాధిక్‌ పలు మార్లు కాల్‌ చేసి బెదిరించినట్లు నూకరాజు మనవడు కార్తికేయరెడ్డి ఇచ్చిన సమాచారంపైనా పోలీసులు దృష్టి సారించారు. 

మెసేజ్‌లపై దృష్టి
నూకరాజు కుటుంబ సభ్యులకు సంబంధించిన సామగ్రిని, వారి సెల్‌ఫోన్లను పోలీసులు ఆయన కారులో స్వా«దీనం చేసుకున్నారు. అయితే వారి సెల్‌ఫోన్లలో వాట్సాప్‌ మెసేజ్‌లను ఆత్మహత్యలకు ముందు డిలీట్‌ చేసినట్లు గుర్తించారు. వాటిని రికవరీ చేస్తే కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందని భావించి, ఫోన్లను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 

లేఖల పరిశీలన  
నూకరాజు, సౌజన్య రాసిన లేఖలను విశ్లేషిస్తున్న పోలీసులు నూకరాజు వియ్యంకుడు ఇచ్చిన ఫిర్యాదుపై కూడా దృష్టి సారించారు. తన కుమారుడిపై కోచ్‌ సాధిక్‌ ఖాన్‌ విష ప్రయోగం చేసి చంపేశాడని ఆయన ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మృతుడు జగదీశ్వరరెడ్డి అంతిమ సంస్కారాలు నిర్వహించిన ప్రాంతాలను పరిశీలించారు. అయితే దాదాపు రెండు నెలల క్రితం జరిగిన సంఘటన కావడం, జగదీశ్వరరెడ్డి మృతదేహాన్ని దహనం చేయడంతో ఆధారాలు లభించే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే జగదీశ్వరరెడ్డి చనిపోవడానికి ముందు తీవ్ర అస్వస్థతకు గురై సుమారు 20 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందినట్టు చెబుతున్నారు. విష ప్రయోగం జరిగి ఉంటే అప్పటి మెడికల్‌ రిపోర్టుల్లో విషయం బయటకు వచ్చే అవకాశం ఉండొచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

కర్ణాటకకు పారిపోయిననిందితుడు!
నిందితుడు సాధిక్‌ ఖాన్‌పై రాజమహేంద్రవరం టూటౌన్, కాకినాడ సర్పవరం పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అతడి కోసం పోలీసులు గాలింపును ముమ్మరం చేశారు. అయితే సాధిక్‌ ఖాన్‌ సోమవారం తెల్లవారుజామునే పారిపోయినట్లు గుర్తించి, సాంకేతిక ఆధారాలతో పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కాకినాడలోని అతడి ఇల్లు, రైఫిల్‌ షూటింగ్‌ అకాడమీ, బంధువుల ఇళ్ల వద్ద నిఘా ఏర్పాటు చేశారు. కాగా.. సాధిక్‌ ఖాన్‌ తన సెల్‌ఫోన్‌ వదిలేసి పారిపోయినట్లు తెలుస్తోంది. ఇతర సాంకేతిక ఆధారాల ద్వారా అతడు కర్ణాటక పారిపోయినట్లు గుర్తించిన పోలీసులు, నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను అక్కడకు పంపినట్టు సమాచారం.

మూడో రోజూ లభించని ఆచూకీ
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం వద్ద గోదావరిలో దూకి గల్లంతైన నూకరాజు భార్య మీనా, కుమార్తె సౌజన్య ఆచూకీ బుధవారానికి మూడు రోజులవుతున్నా లభించలేదు. ఈ ఘటనలో నూకరాజు మృతదేహం లభ్యం కాగా, భార్య, కుమార్తె ఆచూకీ తెలియలేదు. గల్లంతైన వారి కోసం రెండో పట్టణ పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, జాలర్లు బోట్లపై తిరుగుతూ గాలిస్తున్నారు. అయితే ఎక్కడా ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదు. గోదావరిలో వరద నీరు అధికంగా ఉండడంతో గల్లంతైన వారి ఆచూకీ కనిపెట్టడం ఇబ్బందిగా మారింది. కాగా.. ఇప్పటికే నూకరాజు కారు డ్రైవర్‌ రాజు నుంచి రాజమహేంద్రవరం టూటౌన్‌ పోలీసులు పలు ఆధారాలను సేకరించారు.

డబ్బున్న పిల్లల తల్లులే టార్గెట్‌!
కాకినాడ రూరల్‌: సాధిక్‌ ఖాన్‌ వృత్తి రైఫిల్‌ షూటింగ్‌ కోచింగ్‌ అయినా, శిక్షణకు వచ్చే డబ్బున్న పిల్లల తల్లులే అతడి లక్ష్యమని పలువురు చెబుతున్నారు. ఈ క్రమంలోనే నూకరాజు కుమార్తె సౌజన్యను టార్గెట్‌ చేశాడని తెలుస్తోంది. కాకినాడలోని గుడారిగుంట సమీపంలో ప్రో షూటింగ్‌ అకాడమీ పేరిట సాధిక్‌ ఖాన్‌ పిల్లలకు శిక్షణ ఇస్తున్నాడు. అంతకు ముందు అకాడమీని రాయుడుపాలెం జంక్షన్‌ వద్ద ఓ భవనంలో నిర్వహించేవాడు. నూకరాజు కుటుంబం ఆత్మహత్య ఘటనతో అతడు పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సాధిక్‌ ఖాన్‌ తల్లి, సోదరుడు, సోదరిని పోలీసులు విచారణ చేసి, కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. మరో వైపు రైఫిల్‌ షూటింగ్‌ శిక్షణ పొందిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కూడా ఆరా తీస్తున్నారు. అలాగే నూకరాజు నివాసంలో సోదాలు జరిపి ఆధారాలు సేకరిస్తున్నారు. 

సౌజన్యది ప్రేమ వివాహం 
నూకరాజు కుమార్తె సౌజన్య, జగదీశ్వరరెడ్డి ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి కార్తికేయ రెడ్డి కుమారుడు. కాంట్రాక్టర్‌ అయిన జగదీశ్వరరెడ్డి కాకినాడలోనే భార్య, కుమారుడితో నివాసం ఉండేవారు. ఆయన గత జూలై 2న మృతి చెందారు. కాగా.. నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు కార్తికేయ రెడ్డి కలిసి ఆదివారం ఉదయమే కాకినాడ అశోక్‌ నగర్‌లో నివాసం నుంచి బయటకు వెళ్లారని స్థానికులు తెలిపారు. ఆ రోజు సాయంత్రం పలుమార్లు సాధిక్‌ ఖాన్‌ ఆ అపార్టుమెంట్‌ వద్ద కంగారుగా తిరుగుతూ కనిపించాడన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement