యాసిడ్‌ పురుగు.. పరుగో పరుగు | Acid bug causing a stir in Kadiyam nursery | Sakshi
Sakshi News home page

యాసిడ్‌ పురుగు.. పరుగో పరుగు

Jul 4 2026 4:05 AM | Updated on Jul 4 2026 4:05 AM

Acid bug causing a stir in Kadiyam nursery

హడలెత్తిస్తున్న ‘యాసిడ్‌ బగ్‌’ 

కడియం నర్సరీల్లో మొక్కల మధ్య సంచారం 

వీటి ప్రభావంతో శరీరంపై కాలిన గాయాల తరహా మచ్చలు 

ఇబ్బంది పడుతున్న కూలీలు, రైతులు 

సాక్షి, అమరావతి/కడియం: తూర్పు గోదావరి జిల్లాలో ప్రకృతి అందాలకు నెలవైన కడియం నర్సరీల్లో యాసిడ్‌ పురుగులు (నైరోబీ ఫ్లై/యాసిడ్‌ బగ్‌) స్వైరవిహారం చేస్తున్నాయి. దీపం పురుగుల మాదిరిగా కనిపిస్తున్న వీటి స్రావాలు మనుషుల శరీరంపై పడితే కాలిన గాయాల మాదిరిగా చర్మంపై దద్దుర్లు, మచ్చలు ఏర్పడుతున్నాయి. మొక్కల ఎగుమతులు జోరుగా సాగుతున్న ప్రస్తుత తరుణంలో వాటిని మోస్తున్న తమ శరీరాలపై ఇవి పడుతున్నాయని కూలీలు గగ్గోలు పెడుతున్నారు. యాసిడ్‌ వంటిపై పడితే చర్మం ఏ విధంగా తయారవుతుందో అదే మాదిరిగా ఈ పురుగుల కారణంగా కూడా గాయాలు కావడంతో వీటిని యాసిడ్‌ పురుగులని పిలుస్తున్నారు. చర్మంపై వచ్చిన బొబ్బలు దాదాపు ఇరవై రోజుల వరకు కూడా తగ్గడం లేదంటున్నారు. భారీసైజు ప్యాకెట్లలో ఉండే మొక్కల్లోనే వీటిని ఎక్కువగా గుర్తించినట్టుగా వివరిస్తున్నారు.

తక్కువ ఎత్తు మొక్కల్లో ఉండటం లేదు
ఆరేడు అడుగులకంటే తక్కువ ఎత్తుగా ఉండే మొక్కల్లో వీటిజాడ ఉండడం లేదని కూలీలు చెబుతున్నారు. భారీ సైజులో ఉండే మొక్కల ప్యాకెట్ల కింద ఇవి నివాసం ఉంటున్నాయి. నర్సరీల్లో సస్యరక్షణ చర్యల్లో భాగంగా తరచు ఏదో ఒక పురుగు మందును వినియోగించే మొక్కలపై కూడా ఇవి కనిపించడం లేదని, రోజుల తరబడి సస్యరక్షణ చర్యలు చేపట్టకుండా వదిలేసిన మొక్కలపైనే కన్పిస్తున్నాయని కూలీలు చెబుతున్నారు. ముఖ్యంగా బుర్రిలంక ఇసుక ర్యాంపు సమీపంలోని వేబ్రిడ్జి తదితర ప్రాంతాల్లో వీటిని చూశామంటున్నారు. వేసవి ఎండల తీవ్రత తగ్గి వర్షాలు కురిసే సమయంలో ఇటువంటి పురుగుల జాడ ఇంతకు ముందు కూడా అక్కడక్కడా నేలల్లో కన్పించేవని, కానీ ఈ సారి మరింత అధికంగా ఉంటున్నాయంటున్నారు.

పెడెరిన్‌ ద్రవం వల్లే శరీరంపై గాయాలు
ప్రస్తుతం యాసిడ్‌ పురుగులుగా భావిస్తున్న వీటి శాస్త్రీయనామం యాసిడ్‌ బగ్‌ లేదా నైరోబీ ఫ్లై వీటిలో ‘పెడెరిన్‌’ అనే ద్రవం ఉంటుంది. ఈ ద్రవం మానవ శరీరంపై పడితే గాలిన గాయాలు మాదిరిగా చర్మం మారిపోతుంది. ఇవి ఎక్కువగా ఉత్తర భారతదేశంలో కనిపిస్తుంటాయి. ఎండ తీవ్రతలు తగ్గి వర్షాలు మొదలయ్యే సమయంలో వీటి జాడ ఇక్కడ కూడా కనిపిస్తుంటుంది. వర్షాలు సమయానికి కురిస్తే వీటి సంతతి కంట్రోల్‌ అయ్యేది. 

వర్షాలు ఆలస్యం కావడంతో వీటి సంతతి వృద్ధి చెందడానికి అవకాశం చిక్కిందని భావిస్తున్నాం. వీటి నివారణకు ఇన్‌సెక్టిసైడ్స్‌ వినియోగించొచ్చు. రాత్రిపూట లైట్‌ ట్రాప్స్‌ పెట్టి, వాటిలో సబ్బునీటిని ఏర్పాటు చేస్తే ఈ పురుగులు అందులో పడి చనిపోతాయి. తద్వారా వీటి సంతతిని కంట్రోల్‌ చేయవచ్చు. రాత్రిపూట అ్రల్టావయోలెట్, నియోన్, ఎల్‌ఈడీ ల్యాంప్స్‌ వైపు ఈ పురుగులు ఎక్కువగా ఆకర్షితమవుతాయి. పగటి పూట నేలల్లోనే ఉంటాయి. శరీర వాసనకు ఆకర్షితమై మనపై వాలతాయి. ఆ సమయంలో వాటిని నలిపితే వాటిలోని పెడెరిన్‌ అనబడే విష ద్రవం చర్మంపై పడుతుంది. తద్వారా చర్మంపై గాయాలు ఏర్పడతాయి. యాంటీ హిస్టమిన్‌/యాంటీ ఎలర్జిక్‌ మందుల ద్వారా ఈ గాయాలకు ఉపశమనం లభిస్తుంది.       – డీవీవీఎస్‌ రాజు, ప్రధాన శాస్త్రవేత్త, వేమగిరి డీఎఫ్‌ఆర్‌సీ

ఆలస్యం చేయకండి 
పొలాల్లో పనులు చేసే­టప్పుడు, పొలాలకు దగ్గరకు ఉండే ఇళ్లలో నివసించేవారు, హాస్టళ్లు, పాఠశాలల్లో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలి. అలాంటి ప్రదేశాల్లోనే ఇలాంటి పురుగులు ఎక్కువగా పెరుగుతుంటాయి. శరీరంలో ఒక చోట పురుగు ప్రభావం ప్రాథమికంగా ఉన్నప్పటికీ అది శరీరంలో మిగతా భాగాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఎక్కువగా వ్యాపించే వరకూ ఆగకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. లేదంటే సమస్య తీవ్రమై ఒక్కోసారి ప్రాణాలమీదకు కూడా వస్తుంది. దీనికి అన్ని రకాల చికిత్స, మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు ఎవరికి వారు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. – డాక్టర్‌ ఎం.రవిబాబు, చర్మవ్యాధుల చికిత్స నిపుణుడు, పశ్చిమగోదావరి జిల్లా ఇన్‌చార్జ్‌ వైద్యారోగ్యాధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement