నేరస్తుని ఆధార్ వివరాలు పోలీసులకు ఇవ్వొచ్చు
ఆధార్ అథారిటీకి హైకోర్టు ఆదేశాలు
సాక్షి, అమరావతి: ఫోర్జరీ ద్వారా నకిలీ ఆధార్ కార్డు సృష్టించి, ఒకరి భూమిని మరొకరికి విక్రయించిన వ్యవహారంలో వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు సదరు నకిలీ ఆధార్‌కు సంబంధించిన బయోమెట్రిక్, ఇతర అనుమతించదగిన వివరాలను పోలీసులకు అందచేయాలని ఆధార్ అథారిటీని హైకోర్టు ఆదేశించింది. వ్యక్తిగత గోప్యత పేరుతో నేరగాళ్లు చట్టం నుండి తప్పించుకోవడానికి వీల్లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆధార్ చట్టం–2016 సెక్షన్ 33(1) ప్రకారం సమాచారాన్ని బహిర్గతం చేయడంపై సంపూర్ణ నిషేధం లేదని హైకోర్టు గుర్తు చేసింది. ‘సాధారణంగా ఒకరి ఆధార్ వివరాలను మరొకరికి ఇవ్వడం వల్ల గోప్యతకు భంగం కలుగుతుంది. కానీ ఈ కేసులో ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది.
వివాదంలో ఉన్న ‘ఆధార్ కార్డు’ స్వయంగా అప్పీలుదారు పేరుతోనే జారీ అయింది. ఎవరో ఒక అపరిచిత మూడో వ్యక్తి తన పేరుతో నకిలీ కార్డు సృష్టించి మోసానికి పాల్పడ్డారని అప్పీలుదారు వాదిస్తున్నారు. అప్పీలుదారు తన స్వంత పేరు, గుర్తింపుతో ముడిపడి ఉన్న సమాచారాన్ని మాత్రమే కోరుతున్నారు కాబట్టి.. ఇక్కడ వేరొకరి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే అవకాశమే లేదు.’ అని హైకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది.
నకిలీ ఆధార్ కార్డ్ సృష్టించి భూమి అమ్మేసిన ఆగంతకుడు...
విశాఖపట్నం జిల్లా, పెందుర్తి మండలం, సరిపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 156/1 , 157/11లో 1.99.5 ఎకరాల భూమికి ఏలప్రోలు సీతారామాంజనేయులు యజమాని. అయితే ఒక గుర్తుతెలియని వ్యక్తి సీతారామాంజనేయులు పేరుతో నకిలీ ఆధార్ కార్డును సృష్టించి, తానే సీతారామాంజనేయులనంటూ 2021లో రెండు వేర్వేరు సేల్ డీడ్ల ద్వారా ఈ భూమిని ఇతరులకు అక్రమంగా అమ్మేశాడు. పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో ఈ మేరకు ఫిర్యాదు నమోదయ్యింది. దీనిపై విశాఖపట్నం జిల్లా కోర్టులో దావా కూడా దాఖలయ్యింది. విశాఖపట్నం జిల్లా రిజిస్ట్రార్, తనిఖీలు చేపట్టి నకిలీ సేల్ డీడ్లను రద్దు చేస్తూ 2021న ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా, పోలీసుల దర్యాప్తులో భాగంగా సదరు నకిలీ ఆధార్ కార్డును సృష్టించిన వ్యక్తి అసలు వివరాలు, బయోమెట్రిక్ సమాచారాన్ని సేకరించడానికి బాధితుడు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నారు. అయితే, చట్టంలోని సెక్షన్ 8 (1)(జే) ప్రకారం మూడో వ్యక్తికి సంబంధించిన వ్యక్తిగత వివరాలను వెల్లడించలేమంటూ ఆధార్ యంత్రాంగం ఆ అభ్యర్థనను తిరస్కరించింది. అటు పోలీసులు కూడా ఈ వివరాలు సేకరించడంలో చొరవ చూపకపోవడంతో, బాధితుడు సీతారామాంజనేయులు 2025లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని సింగిల్ జడ్జి కొట్టివేయడంతో, సీతారామాంజనేయులు ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించారు.


