మోసమే మార్గం.. దోపిడీయే లక్ష్యం

26 people out of 31 were negative who are in Swarna Palace - Sakshi

స్వర్ణప్యాలెస్‌లో ఉన్న 31 మందిలో 26 మందికి నెగిటివ్‌

సిటీ స్కాన్‌ రిపోర్టులతో వైద్యం

లక్షల్లో ఫీజుల వసూళ్లు 

‘హోటల్‌ స్వర్ణ ప్యాలెస్‌లో అశువులు బాసిన వారిని చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. నా డాక్టర్స్‌ కమ్యూనిటీని చూస్తుంటే కోపం కలుగుతోంది. మన ఆశకి అంతులేకుండా పోతోంది. మనందరికీ తెలుసు.. ఇప్పుడు హాస్పిటల్స్‌లో వైద్యం చేస్తున్న కరోనా పేషెంట్స్‌లో ఎంతమందిని ఆస్పత్రుల్లో ఉంచాల్సిన అవసరం ఉందో? ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వీలైనంత తక్కువలో వైద్యం చేయాల్సిందిపోయి మనం ఏం చేస్తున్నామో ఆలోచించుకోవాలి. ఇలాంటి పనుల వల్లే మనం ప్రజల్లో నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నాం’. 

ఇదీ.. విజయవాడలోని రమేశ్‌ ఆస్పత్రికి చెందిన కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో అగ్నిప్రమాదం సంభవించి పదిమంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో డాక్టర్ల వాట్సాప్‌ గ్రూప్‌లో సురక్ష హాస్పిటల్స్‌ యజమాని, ప్రముఖ న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ వీవీబీ చౌదరి ఆవేదన వ్యక్తం చేస్తూ పెట్టిన పోస్టు. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో కరోనా వైద్యం పేరిట జరుగుతున్న దోపిడీ వైనాన్ని డాక్టర్‌ చౌదరి అభిప్రాయాలు తేటతెల్లం చేస్తున్నాయని మెజార్టీ వైద్యులు అంగీకరిస్తున్నారు.  

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: కరోనాను ఆసరా చేసుకుని కార్పొరేట్‌ ఆస్పత్రులు ధనార్జనకు దారులు వేసుకున్నాయి. కరోనా రోగుల నుంచి ఎంత ఫీజు వసూలు చేయాలనే దానిపై విజయవాడలో కొన్ని వారాల కిందట వైద్యులు భేటీ అయ్యారు. ఇందులో ప్రముఖ వైద్యుడు చేసిన ఫీజుల ప్రతిపాదనలను విన్న సీనియర్‌ డాక్టర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రోజుకు రూ.10 వేల నుంచి రూ.15 వేల కంటే ఎక్కువ ఛార్జీ వద్దన్న అభిప్రాయాలకు మద్దతు లభించలేదు. హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సలహాలు ఇద్దామన్న ప్రతిపాదనను కూడా తోసిపుచ్చడం కార్పొరేట్‌ ధనదాహానికి నిదర్శనం.  

ప్రభుత్వ టెస్టులను కాదని సిటీ స్కాన్‌
ప్రభుత్వం నిర్వహిస్తున్న కరోనా టెస్టుల కంటే సిటీ స్కాన్‌ ద్వారా మెరుగైన ఫలితం వస్తుందని కార్పొరేట్‌ ఆస్పత్రులు ప్రచారం మొదలెట్టాయి. టెస్టుల్లోనే రూ.వేలకు వేలు వసూళ్లు చేసుకోవడంతోపాటు జబ్బు రెండు, మూడు, నాలుగు దశలకు చేరిందంటూ ఆస్పత్రిలో చేరాలని, వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరని, క్వారంటైన్‌లో ఉండాలనే సూచనలతో ఎక్కువ మంది ఆస్పత్రుల్లో చేరారు. 

దోపిడీ ఇలా.. 
రమేశ్‌ ఆస్పత్రితోపాటు ఒక్కో కార్పొరేట్‌ ఆస్పత్రికి ఒక్కో రకంగా కరోనాకు ఫీజులు వసూళ్లు చేస్తున్నాయి. పది రోజులకు రూ. 5 లక్షలు, ఏడు రోజులకు రూ.4 లక్షలు, ఐదు రోజులకు రూ.3 లక్షలు చొప్పున నిర్ణయించాయి. బీమా క్లెయిమ్‌ చేసుకుంటామని రశీదులు ఇవ్వాలని రోగులు అడిగినా ఆస్పత్రులు ఇవ్వడం లేదు.   కోవిడ్‌ పేషెంట్‌ల వద్దకు బంధుమిత్రులు ఎవరూ రాకపోవడం, వచ్చినా అనుమతించకపోవడం ఆస్పత్రి వర్గాలకు అనుకూలమైంది. క్వారంటైన్‌లో ఉండే వారే దఫదఫాలుగా డెబిట్, క్రెడిట్‌ కార్డుల ద్వారా బిల్లులు చెల్లించాల్సి వచ్చింది.  
► ఆర్థికంగా స్థితిమంతులను ఎంపిక చేసుకుని మరీ కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో చేర్చుకున్నారు. ఇందుకు సహకరించిన ఆర్‌ఎంపీలు, దళారులకు కొంత చెల్లించారని నిఘా వర్గాలు, పరిశీలన బృందాలు గుర్తించాయి.  

26 మందికి నెగెటివ్‌  
అగ్నిప్రమాదంలో మృతి చెందిన పది మందిలో ఎనిమిది మందికి కరోనా నెగెటివ్‌ వచ్చింది. స్వర్ణ ప్యాలెస్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ప్రమాద సమయానికి ఉన్న మొత్తం 31 మందిలో 26 మందికి నెగెటివ్‌ ఉండటం గమనార్హం. ఒకరికి స్వాబ్‌ టెస్టులో రెండు సార్లు నెగెటివ్‌ వచ్చింది. నిమ్ము చేరిందని వైద్యానికి వస్తే కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో ఉంచడంతో అగ్నిప్రమాదంలో మృతి చెందాడు.  

ప్రభుత్వ ఆస్పత్రులే.. 
కోవిడ్‌ పాజిటివ్‌ ఉన్న వారికి పెద్ద అండగా ప్రభుత్వాస్పత్రులే నిలుస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న కిట్లలో పల్స్‌ ఆక్సీమీటర్‌తో సహా ఏడు వస్తువులు ఉంటున్నాయని, పాజిటివ్‌ వచ్చిన వారు కూడా హోం క్వారంటైన్‌లో ఉండి కోలుకుని వస్తున్నారని నిఘా విభాగంలోని ఓ అధికారి చెప్పారు.  

సమంజసమైతేనే సమర్థిస్తాం 
కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల ఫీజుల విషయానికొస్తే సమంజసమైనంత వరకే ఐఎంఏ సమర్థిస్తుంది. అసమంజస, అనైతిక అంశాలకు మద్దతు ఇవ్వం. ప్రభుత్వమే సముచిత నిర్ణయాలు తీసుకోవాలి.  
– డాక్టర్‌ ఫణిధర్, రాష్ట్ర కార్యదర్శి, ఐఎంఏ  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top