విద్యుత్ ఉద్యోగుల సహకార పరపతి సంఘంలో భారీగా అవకతవకలు
సభ్యులు దాచుకున్న రూ.100 కోట్ల మేర సొమ్ము దుర్వీ నియోగమైనట్లు అంచనా
నిధులను వ్యక్తిగత ఖాతాల్లోకి, రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్‌కు మళ్లించినట్లు ఆరోపణలు
ఏళ్ల తరబడి దాచుకున్న సొమ్మును వ్యక్తిగత ప్రయోజనాలకు వాడుకోవడంపై సభ్యుల ఆగ్రహం
సాక్షి, అమరావతి: విద్యుత్ ఉద్యోగుల భవిష్యత్ భద్రత కోసం ఏర్పాటు చేసిన విజయవాడ విద్యుత్ ఉద్యోగుల సహకార పరపతి సంఘం (ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ)లో చీకట్లు కమ్ముకున్నాయి. ఈ సొసైటీలో భారీ ఆర్థిక కుంభకోణం వెలుగులోకి వచ్చింది. సభ్యులు దాచుకున్న కోట్లాది రూపాయల సొమ్ము దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ మోసం మొత్తం విలువ దాదాపు రూ.100 కోట్లకు చేరినట్లు అంచనా వేస్తున్నారు.
ఏళ్ల తరబడి జీతాల నుంచి పొదుపు చేసి సొసైటీలో డిపాజిట్ చేసిన ఉద్యోగులు, రిటైర్మెంట్ తర్వాత సుఖంగా జీవించాలనే ఆశతో పెట్టుబడులు పెట్టిన వారు ఇలా వందలాది మంది సభ్యులు ఇప్పుడు అయోమయంలో చిక్కుకున్నారు. సభ్యులకు ఇవ్వాల్సిన అప్పులు రూ.35 కోట్లు కాగా, వాయిదా దాటిన అప్పులపై వడ్డీ రూ.10 కోట్లు ఉంది. అంతేకాకుండా సంఘం రూ.6 కోట్ల నష్టాల్లోకి కూరుకుపోయింది. దీంతో సొసైటీ నిర్వాహకులను నమ్మినందుకు నిండా మోసపోయామని ఆందోళన చెందుతున్నారు. అయితే సభ్యులు ఎవరూ కంగారు పడవద్దని, బ్యాంకుల నుంచి రుణం తీసుకుని లేదా ఆస్తులు అమ్మి డిపాజిట్లు వెనక్కు ఇస్తామంటూ సొసైటీ నిర్వాహకులు వారికి సర్ది చెబుతున్నారు.
పాతికేళ్లుగా ఆధిపత్యం..
గత పాతికేళ్లుగా ఒకే వ్యక్తి ఆధిపత్యంలో సొసైటీ నడిచిందని, అదే ఇప్పుడు కుంభకోణానికి కారణమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యవస్థపై పర్యవేక్షణ లేకపోవడం వల్లే అక్రమాలు పెరిగినట్లు సభ్యులు చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే సొసైటీ కార్యకలాపాల్లో లోపాలు బయటపడుతున్నాయి. నిధుల గోల్‌మాల్‌పై సంబంధిత శాఖ ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించారు. చట్ట విరుద్ధంగా డిపాజిట్ల సేకరణ, సభ్యుల నిధులను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించడం, నిబంధనలు ఉల్లంఘిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం, సొసైటీ డబ్బుతో షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం వంటి చర్యలు సభ్యుల భవిష్యత్‌ను ప్రమాదంలోకి నెట్టినట్లు వారి విచారణలో తేలినట్లు తెలుస్తోంది.
ప్రాథమిక విచారణలో రూ.6 కోట్లు నకిలీ పేర్లతో రుణాల మంజూరు, రూ.1.30 కోట్లు డిపాజిటర్లకు తెలియకుండా విత్‌డ్రా చేయడం, రూ.76 కోట్లు నాన్–మెంబర్ల నుంచి అక్రమ డిపాజిట్లు, సరైన పత్రాలు లేకుండా మరిన్ని లోన్ విత్‌డ్రాలు వంటివి వెలుగులోకి వచి్చనట్లు సమాచారం. అయితే దీనంతటికీ సహకార శాఖలోని పలువురు అధికారులు సహకారం అందించడమే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిధుల మళ్లింపు..అక్రమాల తీరు
సహకార శాఖ డివిజనల్ ఆఫీసర్ (డీసీఓ) పి.కిరణ్ కుమార్ క్షేత్రస్థాయి పరిశీలనలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి సంఘం అధ్యక్షుడే స్వయంగా 78 మంది సభ్యుల పేరుతో, వారికి తెలియకుండానే రూ.6.11 కోట్ల రుణాలను తీసుకున్నారు. వడ్డీతో కలిపి ఈ మొత్తం రూ. 17.47 కోట్లకు చేరింది.45 మంది డిపాజిటర్లకు తెలియకుండానే వారి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై రూ. 1.58 కోట్ల అప్పులు తీసుకున్నట్లు గుర్తించారు. సభ్యులుకాని బయటి వ్యక్తుల నుంచి సుమారు రూ.67.71 కోట్ల డిపాజిట్లు సేకరించారు. ఇది మొత్తం డిపాజిట్లలో 89 శాతం కావడం గమనార్హం. ఆడిట్ నివేదికల్లోనూ భారీగా మార్పులు చేసి, రూ.6.86 కోట్ల మేర తగ్గించి చూపినట్లు తేలింది
రంగంలోకి సహకార శాఖ.. ఆస్తుల జప్తు
నిధుల రికవరీ కోసం సహకార శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. సెక్షన్ 51, ఏపీసీఎస్ చట్టం 1964 ప్రకారం సమగ్ర విచారణకు ఆదేశాలిచ్చింది. 2017 నుంచి ఇప్పటివరకు పాలక మండలిలో ఉన్న 14 మంది సభ్యులను బాధ్యులుగా గుర్తించింది. వారి ఆస్తులను సెక్షన్ 41(బి) కింద జప్తు (అటాచ్) చేయాలని, వారు ఆ ఆస్తులను విక్రయించకుండా నిరోధించాలని విద్యుత్ శాఖ అధికారులకు సహకార శాఖ అధికారులు లేఖ రాశారు. అంతేకాదు, ఈ 14 మంది సభ్యులపై ఏపీసీఎస్ చట్టం 1964 లోని సెక్షన్ 41(బి) కింద చర్యలు తీసుకోవాలని డివిజనల్ కో ఆపరేటివ్ ఆఫీసర్ ఆదేశించారు. అలాగే నకిలీ రుణాల ద్వారా డ్రా చేసిన రూ. 17.47 కోట్లు, ఇతర దుర్వీ నియోగమైన నిధులను వీరి నుండే రికవరీ చేయాలని అధికారులు నిర్ణయించారు.
ఎన్నో ఏళ్లుగా ఉండి ఇలా చేస్తారా ?
సంఘం పాలకమండలి ప్రధాన బాధ్యులు విద్యుత్ సంస్థలో ముఖ్యమైన ట్రేడ్ యూనియన్లకు నాయకులుగా ఉండి ఈ విధమైన కార్యకలాపాలకు పాల్పడడం ఏ మాత్రం సమంజసం కాదు. ఎన్నో ఏళ్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నందున మరింత సమర్థవంతంగా, సభ్యులకు మరిన్ని ప్రయోజనాలు కల్పించే విధంగా వ్యవహరించాల్సింది పోయి సొసైటీ డబ్బులను వ్యక్తిగత అవసరాలకు వినియోగించటం దారుణం.’
– ఎ.వెంకటేశ్వరరావు, ఎన్.సి.హెచ్.శ్రీనివాస్, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి, సీఐటీయూ, ఎనీ్టఆర్ జిల్లా


