నార్పల : మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ రాష్ట్రంలోనే పేరుగాంచిన గూగూడు కుళ్లాయిస్వామి వార్షిక ఉత్సవాలు బుధవారం ప్రారంభం కానున్నాయి. 13 రోజుల పాటు వైభవంగా జరగనున్న ఉత్సవాలు ఈ నెల 29వ తేదీతో ముగుస్తాయి. రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు. ఉత్సవాల్లో (పీర్ల పండుగలో) భాగంగా ఈ నెల 17న గూగూడు కుళ్లాయిస్వామి ప్రథమ దర్శనం ఉంటుంది. 18న స్వామికి నిత్యపూజ నివేదన, 19న అగ్నిగుండం ఏర్పాటు, 20న పీర్లను కొలువుదీర్చడం, 21న నిత్యపూజ నివేదన, 22న స్వామివారి ఐదవ సరిగెత్తు, 23న నిత్యపూజ నివేదన, 24న ఏడవ సరిగెత్తు, రాత్రికి మెరవణి, 25న నిత్యపూజ నివేదన, విడిదినం, 26న గ్రామోత్సవం, పెద్దపరిగెత్తు, రాత్రికి పీర్ల మెరవణి, అగ్నిగుండ ప్రవేశం ఉంటుంది. 27న సాయత్రం 4 గంటలకు జలధికి పోవుట, 29న స్వామివారి చివరి దర్శనం ఉంటుంది.
అరకొరగానే సదుపాయాలు : గూగూడు కుళ్లాయిస్వామి ఆలయానికి భక్తులు సమర్పించే కానుకల ద్వారా ఏటా గణనీయమైన ఆదాయం వస్తున్నా సౌకర్యల కల్పనలో అధికారులు విఫలమవుతున్నారే ఆరోపణలు ఉన్నాయి. ఉత్సవాలకు వచ్చే మహిళలు, వృద్ధులు చిన్నారుల కోసం సరిపడ మరుగుదొడ్లు లేకపోవడం, స్నానాల అనంతరం మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు లేకపోవడం తీవ్రమైన లోపంగా మారింది. తాగునీరు, విశ్రాంతి కేంద్రాలు, వసతి గదులు లేకపోవడం వల్ల భక్తులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఇక ఆలయ పరిసరాల్లో పారిశుధ్య నిర్వహణ, వీధి దీపాల ఏర్పాటు వంటి ప్రాథమిక అంశాలపైనా దృష్టి సారించలేదు.
మందుబాబులతో జాగ్రత్త! ఉత్సవాల వేళ జూదం, అక్రమ మద్యం విక్రయాలపై అధికారులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. విచ్చలవిడి మద్యం అమ్మకాలతో మందుబాబు చేష్టల వల్ల మహిళలు, చిన్నారులు ఇబ్బందులు పడుకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


