ఖరీఫ్‌ ఏరువాకకు ఎన్ని కష్టాలో! | - | Sakshi
Sakshi News home page

ఖరీఫ్‌ ఏరువాకకు ఎన్ని కష్టాలో!

Jun 16 2026 12:16 AM | Updated on Jun 16 2026 12:16 AM

విత్తనాలు, ఎరువులు అందక అన్నదాతల అవస్థలు

అనంతపురం అగ్రికల్చర్‌: ఖరీఫ్‌ ప్రారంభం కావడం, వర్షాలు పడుతుండటంతో సాగుకు రైతులు సిద్ధంగా ఉన్నా విత్తన వేరుశనగ, కందులు, యూరియా, డీఏపీ కోసం అవస్థలు పడుతున్నారు. గత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో మే చివరి వారంలోనే విత్తన వేరుశనగ, కందుల పంపిణీ మొదలు పెట్టేవారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 451 ఆర్‌బీకేల్లో రైతులకు తగినంత విత్తనం, ఎరువులు అందుబాటులో పెట్టడంతో ఏ సమస్యా లేకుండా ఖరీఫ్‌ ఏరువాక కొనసాగింది. కానీ చంద్రబాబు ప్రభత్వం వచ్చిన ఈ రెండేళ్లలో రైతులకు సమస్యలు పెరిగిపోయాయి. విత్తన కేటాయింపులు చాలా వరకు తగ్గించారు. ఈసారి అరకొరగా కేటాయించిన 56 వేల క్వింటాళ్ల విత్తన వేరుశనగ కాయలు కూడా సకాలంలో పంపిణీ చేయలేక చేతులెత్తేస్తున్నారు. అలాగే 451 ఉన్న ఆర్‌బీకేల్లో 125 మూసేయడంతో ఇపుడు 326 ఆర్‌ఎస్‌కేలు (రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు) – రైతు సేవ కేంద్రాలు (ఆర్‌ఎస్‌కేలు)గా పేరు మార్చారు) పనిచేస్తున్నాయి. అక్కడ కూడా రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో పెట్టడం లేదు. ప్రస్తుతానికి 159 ఆర్‌ఎస్‌కేల్లో మాత్రమే 12 వేల క్వింటాళ్లు విత్తన వేరుశనగ నిల్వ చేశారు. తాడిపత్రి డివిజన్‌ మినహా ఇంకా అనంతపురం, రాయదుర్గం ప్రాంతంలో ఉన్న ఆర్‌ఎస్‌కేలకు ఇంకా విత్తనం చేరలేదు. ఇదిగో అదిగో అంటున్నా మినీకిట్ల కింద కందులు, రాయితీ కింద కందులు కూడా ఇంకా సరఫరా కావడం లేదని రైతులు వాపోతున్నారు. ఇక వేరే విత్తనాలు ఏవీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 20 వేల మంది రైతులు 18 వేల క్వింటాళ్ల కోసం ఇప్పటికే రిజిస్ట్రేషన్‌ చేసుకుని ఎదురుచూస్తున్నా విత్తన సరఫరా మందకొడిగా చేపడుతున్నారు. విత్తన కొరత కారణంగా మిల్లర్లు పెనుకొండ, పావగడ, చెళ్లకెరె లాంటి ప్రాంతాల నుంచి కల్తీ, నాసిరకం సేకరిస్తున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఎరువులు అందేది గగనమే

యూరియా, డీఏపీ ఎరువులు అందడం గగనంగా మారింది. కొత్తగా యాప్‌ను అందుబాటులోకి తేవడంతో ఒక బస్తాకు కూడా అవస్థలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్‌ఎస్‌కేల్లో 1,700 మెట్రిక్‌ టన్నుల యూరియా, 80 మెట్రిక్‌ టన్నుల డీఏపీ అందుబాటులో ఉండగా పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌, ఎఫ్‌పీఓల్లో 400 మెట్రిక్‌ టన్నుల యూరియా, 400 మెట్రిక్‌ టన్నుల డీఏపీ మాత్రమే అందుబాటులో ఉన్నట్లు చెబుతున్నారు.

మళ్లీ పెరగనున్న ఎరువుల ధరలు

ఎరువుల ధరలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తాజాగా కాంప్లెక్స్‌ ఎరువులు ధరలు పెంచి రైతుల నడ్డి విరిచారు. డీఏపీ బస్తా రూ.1,350 కాగా.. రూ.1,600 నుంచి రూ.1,800 మధ్య వెచ్చించాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఇక 20–20–0–13, 10–26–26, 15–15–15, 28–28–0, 24–24–0, 14–35–14, 16–16–16, 16–20–0–13, 12–32–16 తదితర కాంప్లెక్స్‌ ఎరువుల (ఎన్‌–పీ–కే) ధరలు కొండెక్కాయి. గతేడాదితో పోల్చితే బస్తా మీద రూ.200 నుంచి రూ.500 వరకు పెంపు చేయడంతో రైతులకు భారంగా పరిణమిస్తోంది. గోరుచుట్టుపై రోకటి పోటు అన్న చందంగా వచ్చే నెల నుంచి కాంప్లెక్స్‌ ఎరువుల ధరలకు రెక్కలు వస్తున్నట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. 10–26–26 రకం ఇప్పుడు 2,250 ఉండగా వచ్చే నెలలో రూ.2,400 కావచ్చంటున్నారు. అలాగే 20–20–0–13 రకం గతేడాది రూ.1,550 ఉండగా ఇప్పుడు రూ.2,250కు పెంచారు. వచ్చే నెలకు 2,450కు చేరవచ్చని చెబుతున్నారు. ఇలా అన్ని రకాల కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు మరోసారి పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. సూపర్‌ఫాస్పేట్‌ కూడా ఇప్పు డు రూ.735 ఉండగా వచ్చేనెలకు రూ.1,000 కావచ్చని, పొటాష్‌ ప్రస్తుతం 1,850 ఉండగా వచ్చే నెల రూ.2 వేలు కావచ్చని చెబుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement