రైతుల జీవితాలతో ఆటలు! | - | Sakshi
Sakshi News home page

రైతుల జీవితాలతో ఆటలు!

Jun 15 2026 1:47 AM | Updated on Jun 15 2026 1:47 AM

రైతుల జీవితాలతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై పక్షం రోజులు గడిచినా ఇప్పటికీ విత్తన వేరుశనగ కాయల పంపిణీ చేపట్టలేదు. జిల్లాలో 436 ఆర్‌ఎస్‌కేలు ఉండగా ఇప్పటి వరకూ కేవలం 135 ఆర్‌ఎస్‌కేలకు 8,683 క్వింటాళ్ల విత్తనకాయలే సరఫరా చేయడంతో అన్నదాతలు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఇష్టారాజ్యంగా విత్తనకాయలు సేకరించి రైతులకు కట్టబెట్టేందుకు ఏజెన్సీలు పూనుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పుట్టపర్తి అర్బన్‌: ప్రస్తుతం వేరుశనగలో కే6తో పాటు కదిరి లేపాక్షి, నారాయణి, కే7, కే9 గోల్డ్‌, డబుల్‌ కే6, తిరుపతి రకాలు, గుజరాత్‌ తదితర రకాలు అందుబాటులో ఉన్నా విత్తన నాణ్యత, ఆయిల్‌ అధికంగా ఉండడం, తిరిగి విత్తుకునేందుకు వీలుండడం, గిట్టుబాటు ధర తదితర కారణాలతో రైతులు కే6పైనే ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఈ ఖరీఫ్‌లో పొలాల్లో విత్తుకునేందుకు సింహ భాగం రైతులు కే6 కోసమే రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. ఇప్పటివరకూ జిల్లావ్యాప్తంగా 17,500 క్వింటాళ్లకు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు.

ఇష్టారాజ్యంగా సేకరణ..

గత ఏడాది రైతులకు సబ్సిడీపై సరఫరా చేసిన విత్తన కాయలకు సంబంధించిన బిల్లులను చంద్రబాబు ప్రభుత్వం ఏజెన్సీలకు చెల్లించలేదు. దీంతో రబీ సీజన్‌లో పండించిన వేరుశనగ కాయలను ఏజెన్సీల నిర్వాహకులు కొనుగోలు చేయలేదు. అయితే, ఖరీఫ్‌ ముంచుకు రావడం, రైతులకు పంపిణీ చేసేందుకు ఏపీ సీడ్స్‌ వద్ద సరిపడా విత్తన కాయలు లేకపోవడంతో ఎక్కడ పడితే అక్కడ సేకరిస్తున్నారు. జిల్లాలో ధర్మవరం, కదిరిలో మాత్రమే ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉండగా, పెనుకొండ, హిందూపురం, పుట్టపర్తి తదితర చోట్ల ప్రైవేటు వ్యాపారుల వద్ద కొనుగోలు చేస్తున్నారు.ప్రైవేటు వ్యాపారుల వద్ద కూడా సరిపడా కే6 రకం విత్తనాలు లేకపోవడంతో తక్కువ ధరకు లభించే ఇతర కాయలను కే6 బస్తాల్లో కలుపుతున్నట్లు తెలిసింది.

ధరలు పెంచినా..

జిల్లాలో రైతులకు ఏటా కే6తో పాటు టీసీజీఎస్‌ 1694, కదిరి లేపాక్షి 1812 రకాలను సరఫరా చేస్తున్నారు. అయితే, గత ఏడాదితో పోల్చితే ఈ సారి 30 కేజీల వేరుశనగ విత్తన కాయల బస్తా ధర దాదాపు రూ.120 మేర పెంచారు. అయినా, నాణ్యత గల విత్తన కాయలు పంపిణీ చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తుండడంపై అన్నదాతలు మండిపడుతున్నారు. విత్తనకాయలు కల్తీ జరిగితే పంట పూర్తిగా ఎత్తిపోయినట్లేనని నిట్టూరుస్తున్నారు.

వైఎస్‌ జగన్‌ హయాంలో నిశ్చింత..

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఏటా మే నెలలోనే విత్తన కాయల రిజిస్ట్రేషన్లు పూర్తి చేసి జూన్‌ ఒకటో తేదీ నుంచే రైతులకు పంపిణీ చేసేవారు. దీనికి తోడు సీజన్‌ ప్రారంభంలోనే రైతు భరోసా, పంట నష్ట పరిహారంతో ఆదుకోవడంతో రైతులకు ఇబ్బంది లేకుండా ఉండేది. నిశ్చింతగా పంట సాగు చేసేవారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అడుగడుగునా నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండడంతో రైతులకు ఎటూ పాలుపోవడంలేదు.

విత్తన ఏజెన్సీ నిర్వాహకుల ఇష్టారాజ్యం

విత్తన కాయలను ఎక్కడ పడితే అక్కడ కొనుగోలు చేస్తున్న వైనం

కే6 బస్తాలో ఇతర కాయలు కలిపి

సరఫరా

చోద్యం చూస్తున్న అధికారులు

ఆందోళన చెందుతున్న అన్నదాతలు

కల్తీ చేస్తే చర్యలు

కే6 రకం కాయల్లో ఇతర రకాలను కల్తీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. సోమవారం ఆయా ప్రాసెసింగ్‌ యూనిట్లకు వెళ్లి పరిశీలిస్తా. ఇతర రకాలు పంపిణీ చేస్తే రైతులు వెనక్కు ఇవ్వాలి. కొనుగోలు చేసే సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలి.

– నారాయణనాయక్‌,

జిల్లా వ్యవసాయాధికారి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement