శింగనమల: సంపాదన కోసం అధికార పార్టీ నేతలు అడ్డదారులు తొక్కుతున్నారు. ఏకంగా సహజ వనరులను కొల్లగొడుతున్నారు. అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు చేపట్టి సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు టీడీపీ నాయకులు శింగనమల మండలం ఉల్లికల్లు వద్ద పెన్నానదీ పరివాహక ప్రాంతంలోని వంకలో పది రోజులుగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. జేసీబీతో ఇసుకను తవ్వి ట్రాక్టర్ల ద్వారా సమీపంలోని ఓ ప్రదేశంలోకి డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి తాడిపత్రి, అనంతపురం ప్రాంతాలకు చెందిన టిప్పర్ల వారికి టిప్పర్ ఇసుక రూ.5వేల చొప్పున విక్రయిస్తున్నారు. అలా కొనుగోలు చేసిన టిప్పర్ నిర్వాహకులు రూ.12 వేల దాకా అమ్ముకుంటున్నారు. రోజుకు 20 నుంచి 30 టిప్పర్ల వరకు ఇసుకను బయటకు పంపుతున్నారు. అక్రమ ఇసుక తవ్వకాలతో భూగర్భజలాలు అడుగంటే ప్రమాదం ఉందని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీసులు, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే పోలీసు, రెవెన్యూ, మైనింగ్ అధికారులు ఎవ్వరూ క్షేత్రస్థాయిలో విచారణ చేయడానికి ముందుకు రాలేదు. టీడీపీ నేతలతో అధికారులు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని.. వారి అక్రమాలకు సహకరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు.
ఉల్లికల్లు వద్ద అక్రమ తవ్వకాలు
గ్రామస్తుల ఫిర్యాదులు బుట్టదాఖలు
పట్టించుకోని రెవెన్యూ, మైనింగ్,
పోలీస్ అధికారులు


