కుందుర్పి: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలపై టీడీపీ నేతలు కన్నేసి, ఆక్రమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే కుందుర్పి నడిబొడ్డున ఉన్న పురాతన కాళికాంబ ఆలయానికి చెందిన స్థలాన్ని స్థానిక టీడీపీ సీనియర్ నేత ఆక్రమించుకుని గురువారం బండలు పాతేశాడు. ఈ అంశంపై కలెక్టర్‌కు నేరుగా గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. కాగా, కోట ఆంజనేయస్వామి, లక్ష్మీనృసింహస్వామి ఆలయాలకు చెందిన మాన్యం భూములను సైతం కొందరు టీడీపీ నేతలు కబ్జా చేసి, గడ్డివాములు, కొట్టాలు వేసుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్యాక్రాంతమవుతున్న మాన్యం భూముల అంశంపై గత సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నేరుగా కలెక్టర్‌కు స్థానిక టీడీపీ నేతలే ఫిర్యాదు చేయడం గమనార్హం. దాదాపు ఐదు రోజులు గడుస్తున్నా.. నేటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో అధికారుల తీరుపై గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి అన్యాక్రాంతమైన ఆలయ భూములను స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు.


