● 17 మండలాల పరిధిలో 16.1 మి.మీ సగటు వర్షపాతం నమోదు
● ఈదురుగాలులకు దెబ్బతిన్న ఉద్యాన పంటలు
అనంతపురం అగ్రికల్చర్: భారీ వర్షాలు జిల్లాను అతలాకుతలం చేశాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. 17 మండలాల పరిధిలో 16.1 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. ఆత్మకూరులో 78 మి.మీ, బుక్కరాయసముద్రంలో 65 మి.మీ భారీ వర్షం కురిసింది. అనంతపురం అర్బన్ 56.2 మి.మీ, కణేకల్లు 52, అనంతపురం రూరల్ 48.6, రాయదుర్గం 42.6, రాప్తాడు 38.8, బెళుగుప్ప 33.6, కుందుర్పి 22.6, కళ్యాణదుర్గం 17.4, గుమ్మఘట్ట 10 మి.మీతో పాటు మరికొన్ని మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. మే నెల సాధారణ వర్షపాతం 36.7 మి.మీ కాగా ప్రస్తుతానికి 51.2 మి.మీ నమోదైంది. మొత్తం మీద గత జూన్ ఒకటి నుంచి ఇప్పటి వరకు 507.9 మి.మీ గానూ 3.8 శాతం అధికంగా 527.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది 48 వర్షపు రోజులు (రెయినీడేస్) నమోదయ్యాయి.
ఉద్యాన పంటలకు భారీ నష్టం
భారీ వర్షాలు కురిసిన మండలాల్లో వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు నిండి ప్రవహించాయి. ఉరుములు, మెరుపులతో పాటు 25 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన ఈదురుగాలులకు ఉద్యాన పంటలు దెబ్బతినడంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. చాలాచోట్ల పెద్ద పెద్ద చెట్లు, కరెంటు స్తంభాలు పడిపోయాయి. కొన్ని ఇళ్లు పాక్షకింగా దెబ్బతినడంతో ఆస్తినష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. చెట్లు పడిపోవడంతో మంగళవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. బుధవారం ఉదయానికి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. అనంతపురం, బుక్కరాయసముద్రం, శింగనమల, బెళుగుప్ప, బుక్కరాయసముద్రం, రాప్తాడు, కళ్యాణదుర్గం, ఆత్మకూరు తదితర మండలాల్లో 200 హెక్టార్లలో అరటి, మామిడి, బీర, టమాటా తదితర పంటలు దెబ్బతినడంతో రూ.4కోట్లకు పైగా నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మునుపెన్నడూ లేని విధంగా అనంతపురం నగర పరిధిలో ఈదురుగాలులకు 300కు పైగా చెట్లు పడిపోవడం గమనార్హం.
ఖరీఫ్‌కు ఊరట
నైరుతి రుతుపవనాలు రాకమునుపే తొలకరి వర్షాలు పలకరిస్తున్నాయి. ఖరీఫ్ సాగుకు సమాయత్తం కావడానికి ఈ వర్షాలు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు డాక్టర్ విజయశంకరబాబు, డాక్టర్ నారాయణస్వామి తెలిపారు. ఈ వర్షాలకు లోతుగా దుక్కులు చేసుకోవడంతో పాటు గత ఖరీఫ్ పంట అవశేషాలు తొలగించుకుని సాగుకు సిద్ధం కావాలని సూచించారు. ఎల్–నినో ప్రభావంతో ఏర్పడిన ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల అండమాన్ ప్రాంతంలో నైరుతి రుతుపవనాలు నెమ్మదిగా కదులుతున్నట్లు తెలిపారు. జూన్ మొదటి వారాంతం లేదా రెండో వారం మొదట్లో జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఖరీఫ్‌కు ఉపకరించేలా వర్షాలు కురిసినా ఉద్యాన రైతులకు తీరని నష్టం వాటిల్లేలా చేసింది. ఈ నెలలో ఈదురుగాలులకు ఏకంగా రూ.12 కోట్లకు పైగా పంట నష్టం వాటిల్లింది.
బెళుగుప్ప మండలం కోనంపల్లి వద్ద నేలవాలిన అరటి పంటను చూపుతున్న రైతు రామదాసురెడ్డి
విద్యుత్‌శాఖకు రూ.4 లక్షల నష్టం
అనంతపురం టౌన్: గాలినవానకు విద్యుత్ స్తంభాలు నేలకూలిపోయాయి. మంగళవారం రాత్రి వీచిన గాలికి జిల్లా వ్యాప్తంగా 80కి పైగా విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో రూ.4 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు విద్యుత్ శాఖ ఎస్‌ఈ శేషాద్రి శేఖర్ తెలిపారు. అనంతపురంలో దాదాపు 50 విద్యుత్ స్తంభాలు, తాడిపత్రి ప్రాంతంలో 30కిపైగా విద్యుత్ స్తంభాలు గాలివాన బీభత్సానికి నేల కూలిపోయాయి. దీంతో పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడింది. విద్యుత్ అధికారులు దశలవారీగా విద్యుత్‌ను పునరుద్ధరించారు.


