అనంతపురం అగ్రికల్చర్: అనంతపురం అర్బన్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో ఆధిపత్యపోరు కొనసాగుతోంది. ఇందుకు వ్యవసాయ మార్కెట్ కమిటీ వేదికగా మారింది. గత జనవరిలో పాలకవర్గం కొలువుదీరిన నాటి నుంచి మార్కెట్‌యార్డు చైర్‌పర్సన్ బల్లా పల్లవి, వైస్ చైర్మన్ అర్షదుల్లా మధ్య మాటలు లేవు. కొందరు డైరెక్టర్లు అటు ఇటు ఉండగా.. మరికొందరు ఇరు వర్గాలకూ దూరంగా ఉంటున్నారు. ఇదే అదనుగా మార్కెట్‌యార్డు తనకే రాసిచ్చారన్నట్లుగా చైర్‌పర్సన్ బల్లా పల్లవి వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. గత నాలుగు నెలలుగా చైర్‌పర్సన్ తనదైన శైలిలో వైస్ చైర్మన్, డైరెక్టర్లను కట్టడి చేసి ఏకపక్షంగా వెళుతున్నట్లు టీడీపీ వర్గాలు అంటున్నాయి. వైస్ చైర్మన్‌గా, డైరెక్టర్లుగా తమకు పార్టీ గొప్ప అవకాశం కల్పించినట్లు సంబరపడుతూ పదవులు అనుభవిస్తామని, సంపాదించుకుంటామని అనుకున్న వారు మొదట్లో నెల రోజుల పాటు హడావుడి చేసినా ఇప్పుడు పలకరించేవారు లేక డీలా పడ్డారు. పాలకవర్గ ప్రమాణ స్వీకారం, బాధ్యతలు తీసుకున్న రోజు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సమక్షంలో ఆర్భాటం చేసిన చైర్‌పర్సన్ పల్లవి.. ఆ తర్వాత ఎమ్మెల్యేకు దూరమయ్యారు. ప్రధానంగా మార్కెట్‌యార్డులో వేబ్రిడ్జి (లారీ కాటా) విషయంలో చైర్‌పర్సన్ భర్త బల్లా సురేష్‌కు ఎమ్మెల్యే దగ్గుపాటికి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. అలాగే ఎంపీ అంబికా లక్ష్మీ నారాయణ సహకారంతో ఆర్‌ఓ ప్లాంటు ఏర్పాటుకు నిధులు సమీకరించారు. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి వర్గీయులు కొందరు ఇటీవల మార్కెట్‌యార్డుకు వచ్చి బల్లా పల్లవిని కలిసి వెళుతుండటం జరుగుతోంది. అదే విధంగా టన్నుకు ఇంత అని చీనీ మార్కెట్, వారానికి ఇంత మొత్తం అని పశువులు, జీవాల సంతల్లో చైర్‌పర్సన్ పల్లవి డిమాండ్ చేస్తూ కమీషన్లు దండుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓ వైపు తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతుండటం, అలాగే కమీషన్లు దక్కకపోవడం లాంటి కారణాలతో ఎమ్మెల్యే దగ్గుపాటి తీవ్రంగా పరిగణించి చైర్‌పర్సన్ బల్లాపల్లవి వ్యవహారంపై దృష్టి సారించి వైస్ చైర్మన్, కొందరు డైరెక్టర్లను ఉసిగొల్పినట్లు తెలుస్తోంది.
మార్కెట్‌యార్డుపై పెత్తనం తనదే
అన్నట్టుగా చైర్‌పర్సన్ ముందుకు
చైర్‌పర్సన్‌కు వ్యతిరేకంగా
వైస్ చైర్మన్‌తో కలిసి ఎమ్మెల్యే దగ్గుపాటి రాజకీయం
ఆదివారం ఇరు వర్గాలు వేర్వేరుగా మార్కెట్‌యార్డు పర్యటనలతో హీట్


