తాడిపత్రి రూరల్: యుద్ధ ప్రభావం పేరిట కేంద్రం పెంచిన డీజిల్ ధరలు అనంతపురం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కరువు జిల్లాలో వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా పారిశ్రమిక రంగం అభివృద్ధి చెందుతోంది. అదేస్థాయిలో ట్రాన్స్‌పోర్టు రంగం కూడా పెరుగుతోంది. ఇలాంటి తరుణంలో డీజిల్ ధర పెంపు ప్రభావం పారిశ్రమిక, ట్రాన్స్‌పోర్టు రంగంపై పడుతోంది. జిల్లాలో డీజిల్‌తో నడిచే భారీ వాహనాలు 17వేలకు పైగా ఉన్నాయి. అలాగే లారీలు 5వేలకు పైగా ఉండగా.. ట్రాక్టర్లు 15వేలు, డీజిల్ కార్లు 10 వేలు, ఆటోలు 8వేలకు పైగా ఉన్నాయి. జిల్లాలోని 211 పెట్రోల్ బంకుల ద్వారా రోజూ 3.83 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి. కేంద్రం డీజిల్ లీటర్‌పై రూ.3.14 పెంచింది. గతంలో రూ.97.42 ఉండగా పెరిగిన ధరతో 100.56కు చేరింది. దీంతో జిల్లాలోని వాహనదారులపై రోజుకు రూ.12 లక్షలకు పైగా.. నెలకు రూ.3.60కోట్ల అదరపు భారం పడనుంది.
ఒక్క తాడిపత్రిలోనే 3వేలకు పైగా లారీలు..
తాడిపత్రి ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది. అల్ట్రాటెక్, అదాని, పెన్నా, సాగర్ సిమెంట్ ఫ్యాక్టరీలతో పాటు అర్జాస్ స్టీల్ ప్లాంట్, రూ.4వేల కోట్ల విలువైన జెన్‌కోకు చెందిన సోలార్ ప్లాంట్, అదనంగా మరో రూ.2500కోట్లతో సోలార్ ప్లాంట్, గాలిమరలు విస్తరించాయి. గ్రానైట్, కడప స్లాబ్ యూనిట్లు ఉన్నాయి. వీటిపై దాదాపు 3వేలకు పైగా లారీలు ఆధారపడ్డాయి. గ్రానైట్, కడప స్లాబ్ యూనిట్లు, బండల రవాణా కోసం వందలాది ట్రాక్టర్లు ఉంటున్నాయి. జిల్లాలోని రాయదుర్గం గార్మెట్ పరిశ్రమకు ప్రసిద్ధి. ఇతర రాష్ట్రాల నుంచి గార్మెంట్‌కు సంబంధించిన ముడిసరుకు, వస్తు సామగ్రి, యంత్రాలు రవాణా అవుతున్నాయి. డీజిల్ ధరలు పెరగడంతో వాటి బాడుగలు కూడా పెంచక తప్పనిపరిస్థితి ఏర్పడుతోంది.
అన్ని రంగాలపైనా తీవ్ర ప్రభావం..
పెంచిన డీజిల్ ధరల ప్రభావం పారిశ్రామిక రంగంపై కాకుండా వ్యవసాయ, వాణిజ్య పంటల రవాణా, నిత్యావసర సరుకుల రవాణా, నిర్మాణ రంగం వస్తుసామగ్రి రవాణా, ప్రజా రవాణాపై పడింది. పెరిగిన డీజిల్ ధరలతో ఆయా వాహనాల బాడుగలను కూడా పెంచారు. ప్రజా రవాణాలో కీలకపాత్ర వహిస్తున్న గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే షేర్ ఆటోలు, పట్టణాల్లో తిరిగే ఆటోల బాడుగలు పెరిగాయి.
కర్ణాటక కంటే రూ.6.46 ఎక్కువ..
మన జిల్లాలో కంటే సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రంలో డీజిల్ లీటర్‌పై రూ.6.46 తక్కువ ఉంటోంది. జిల్లాలో లీటర్ డీజిల్ రూ.100.56 ఉండగా కర్ణాటకలోని బెంగళూరులో రూ.94.10కు లభిస్తోంది. ఈ వ్యత్యాసానికి కారణం చంద్రబాబు ప్రభుత్వం వసూలు చేస్తున్న అదనపు వ్యాట్. ఏపీలో వ్యాట్ 31శాతం వసూలు చేస్తుండగా.. కర్ణాటకలో 29 శాతం ఉంది. అదనపు వ్యాట్ వల్ల డీజిల్ ధరలు ఎక్కువగా ఉండటంతో ట్రాన్స్‌పోర్టు రంగం ఇబ్బందులు పడుతోంది.
డీజిల్ ధర పెంపు ఎఫెక్ట్..
జిల్లాలో వేలాది వాహనాలపై ప్రభావం
రోజుకు రూ.12లక్షలకు పైగా
అదనపు భారం
సరిహద్దు కర్ణాటకలో తక్కువ ధరకే
లభిస్తున్న డీజిల్
అదనపు వ్యాట్ పేరుతో
నడ్డి విరుస్తున్న చంద్రబాబు సర్కార్


