నేడు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’ | - | Sakshi
Sakshi News home page

నేడు కలెక్టరేట్‌లో ‘పరిష్కార వేదిక’

May 18 2026 6:33 AM | Updated on May 18 2026 6:33 AM

అనంతపురం అర్బన్‌: కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో సోమవారం ఉదయం 9 గంటలకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఆనంద్‌ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలన్నారు. భూసమస్యలపై అర్జీలను పరిష్కార వేదికలో భాగంగా ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్‌లో అందజేయాలని సూచించారు. ప్రజలు తమ అర్జీ పరిష్కార స్థితిని కాల్‌సెంటర్‌ 1100కు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చన్నారు. అర్జీలను పరిష్కార వేదికలోనే కాకుండా meekosam. ap. gov. in లోనూ సమర్పించవచ్చని తెలియజేశారు.

నేడు డయల్‌ యువర్‌ ఎస్‌ఈ

అనంతపురం టౌన్‌: విద్యుత్‌ సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్‌ యువర్‌ విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎస్‌ఈ శేషాద్రి శేఖర్‌ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫోన్‌ చేసి సమస్యను తెలియజేస్తే సకాలంలో పరిష్కరిస్తామని తెలిపారు. వినియోగదారులు 08554– 272943, 9154790350 నంబర్లకు ఫోన్‌ చేయాలని సూచించారు.

ముగిసిన రాతి దూలం

లాగుడు పోటీలు

బుక్కరాయసముద్రం: పెద్దమ్మ తల్లి జాతర సందర్భంగా బుక్కరాయసముద్రం ఉన్నత పాఠశాల సమీపంలో జరుగుతున్న రాతిదూలం లాగుడు పోటీలు ఆదివారం ముగిశాయి. వివిధ ప్రాంతాల నుంచి ఎద్దులు రాగా.. ఈ పోటీలను తిలకించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తెలంగాణ రాష్ట్రం హుజూర్‌నగర్‌కు చెందిన సురేంద్రరెడ్డి, నంద్యాల జిల్లా పీఆర్‌.పల్లికి చెందిన నాగయ్య ఎద్దులు ప్రథమ స్థానం, గన్నవరానికి చెందిన రాజా చౌదరి ఎద్దులు ద్వితీయ, కడప జిల్లా కమలాపురానికి చెందిన హరినాథరెడ్డి ఎద్దులు తృతీయ స్థానాల్లో నిలిచాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున అన్నదానం చేశారు.

పెద్దవడుగూరులో..

పెద్దవడుగూరు: మండల కేంద్రంలోని వంక వీధి ఆంజనేయస్వామి ఆలయ కమిటీ సభ్యులు ఆదివారం రాష్ట్ర స్థాయి దేశపు ఎద్దుల రాతి దూలం లాగుడు పోటీలను నిర్వహించారు. ఎస్‌ఐ ఆంజనేయులు కార్యక్రమాన్ని ప్రారంభించగా.. 17 జతల ఎద్దులు పోటీల్లో పాల్గొన్నాయి. పరదేశీ కిష్టప్ప ఎద్దులు ప్రథమ, కణేకల్‌ మండలం గోవిందవాడకు చెందిన గురుస్వామి వృషభాలు ద్వితీయ, గుత్తి మండలం వెంగన్నపల్లి మల్లికార్జున వృషభాలు తృతీయ స్థానంలో నిలిచాయి.

ప్రైవేటు బస్సు ఢీకొని

వృద్ధుడి దుర్మరణం

చిలమత్తూరు: ప్రైవేట్‌ బస్సు ఢీకొని వృద్ధుడు దుర్మరణం చెందాడు. ఎస్‌ఐ శ్రీధర్‌ తెలిపిన మేరకు.. మైసూరుకు చెందిన ప్రకాష్‌ (60) ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో రాయచూరు నుంచి బెంగళూరుకు ప్రైవేట్‌ బస్సులో బయల్దేరాడు. చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్టు గంగోత్రి ధాబా వద్ద టీ బ్రేక్‌ కోసం ఆపారు. ఆ సమయంలో ప్రకాష్‌ మూత్ర విసర్జన కోసం రోడ్డు అటువైపునకు నడుచుకుంటూ వెళ్తుండగా బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న 7హిల్స్‌ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రకాష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సదరు బస్సును సీజ్‌ చేసి, కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement