పీఎం సూర్యఘర్‌ పథకం కింద ఎస్సీ, ఎస్టీ గృహాలపై ఉచిత సోలార్‌ యూనిట్ల ఏర్పాటు నత్తనడకన సాగుతోంది. లక్ష్యం బారెడు ఉన్నా... పనులు మాత్రం ఊపందుకోవడం లేదు. కొన్ని ప్రాంతాల్లో కూటమి నాయకులు వాటాలివ్వాలని డిమాండ్‌ చేస్తుండటంతో పనులకు బ్రేక్‌ పడుతోంది. | - | Sakshi
Sakshi News home page

పీఎం సూర్యఘర్‌ పథకం కింద ఎస్సీ, ఎస్టీ గృహాలపై ఉచిత సోలార్‌ యూనిట్ల ఏర్పాటు నత్తనడకన సాగుతోంది. లక్ష్యం బారెడు ఉన్నా... పనులు మాత్రం ఊపందుకోవడం లేదు. కొన్ని ప్రాంతాల్లో కూటమి నాయకులు వాటాలివ్వాలని డిమాండ్‌ చేస్తుండటంతో పనులకు బ్రేక్‌ పడుతోంది.

May 18 2026 6:33 AM | Updated on May 18 2026 6:33 AM

శింగనమలలో ఏర్పాటు చేసిన సోలార్‌ యూనిట్‌

అనంతపురం టౌన్‌: ఎస్సీ, ఎస్టీ గృహాలపై ఉచిత సోలార్‌ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రతి ఇంటిపై 2 కిలోవాట్ల సామర్థ్యంతో దాదాపు రూ.1.50 లక్షల మేర ఖర్చు చేసి సోలార్‌ యూనిట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 29,860 యూనిట్లకు రూ.350 కోట్ల మేర నిధులు కేటాయిస్తూ టెండర్లను పిలిచారు. ఈ ఏడాది ఆగస్టులోపు పనులు పూర్తి చేసే విధంగా లక్ష్యాన్ని నిర్దేశించారు. అయితే పనులు మాత్రం మందకోడిగా సాగుతున్నాయి.

సింగిల్‌ డిజిట్‌ దాటితే ఒట్టు..

ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 8 నియోజకవర్గాల్లో పీఎం సూర్యఘర్‌ పథకం లక్ష్యంలో సింగిల్‌ డిజిట్‌ కూడా దాటలేదంటే పరిస్థితి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అనంతపురం, కళ్యాణదుర్గం, తాడిపత్రి, రాప్తాడు, ధర్మవరం, పుట్టపర్తి, తదితర నియోజకవర్గాల్లో సోలార్‌ యూనిట్లు ఏర్పాటు సింగిల్‌ డిజిట్‌ సైతం దాట లేదు. మిగిలిన నియోజకవర్గాల్లో సైతం అంతంత మాత్రంగానే సాగుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 30 వేలకు పైగా యూనిట్లు మంజూరైతే ఇప్పటి వరకు 350పైగా యూనిట్లు మాత్రమే పూర్తి చేశారు. దీన్ని బట్టి 3 శాతం మాత్రమే పనులు పూర్తి చేశారు. మరో మూడు నెలల కాలంలో 97 శాతం మేర పనులను ఎలా పూర్తి చేస్తారో అధికారులకే తెలియాల్సి ఉంది.

మోకాలడ్డుతున్న కూటమి నేతలు..

సోలార్‌ పనులకు కూటమి నేతలు మోకాలడ్డుతుండటంతో కొన్ని ప్రాంతాల్లో పనులు ముందుకు సాగడం లేదు. తమ వర్గానికి చెందిన వారికి మాత్రమే మొదట సోలార్‌ ఏర్పాటు చేయాలని నాయకులు.. కాంట్రాక్టర్లపై ఒత్తిడి తీసుకువచ్చి పనులను అడ్డుకుంటుండటంతో సోలార్‌ ప్యానెళ్ల ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఇదే విషయాన్ని పలువురు కాంట్రాక్టర్లు విద్యుత్‌శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి తమ ఆవేదనను తెలియజేశారు. మరికొన్ని నియోజకవర్గాల్లో ఏకంగా కాంట్రాక్టర్లనే ముడుపులు అడుగుతున్నారని సమాచారం. దీంతో కాంట్రాక్టర్లు సైతం పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. వీటిపై అధికారులు దృష్టి సారించి పనులు వేగవంతమయ్యేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది.

నత్తనడకన ఎస్సీ, ఎస్టీ గృహాలపై సోలార్‌ యూనిట్ల ఏర్పాటు

ఉమ్మడి జిల్లాకు 30 వేల

యూనిట్లు మంజూరు

పూర్తి చేసింది మాత్రం 350 యూనిట్లే..

కొన్నిచోట్ల వాటాల కోసం

మోకాలడ్డుతున్న కూటమి నేతలు

Advertisement
 
Advertisement
Advertisement