బతుకుబండి లాగేదెలా? | - | Sakshi
Sakshi News home page

బతుకుబండి లాగేదెలా?

May 18 2026 6:33 AM | Updated on May 18 2026 6:33 AM

అనంతపురం కల్చరల్‌: ‘జీతాలొస్తాయన్న ఆశ రోజు రోజుకు సచ్చిపోతోంది. ఒకటి కాదు.. రెండు కాదు జీతాలందక నాలుగు నెలలు దాటిపోయింది. ఎక్కడైనా చెప్పుకుందామన్నా టార్గెట్‌ చేస్తారేమోనన్న భయం వెంటాడుతోంది. బతుకు అప్పుల కుప్పగా మారుతోంది. ఎలా బతకాలో అర్థకావడం లేదు’ ఇదీ గ్రంథాలయ ఉద్యోగుల ఆవేదన. సంపద సృష్టి కర్త చంద్రబాబు పాలనలో గ్రంథాలయ ఉద్యోగుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు.

70 గ్రంథాలయాల్లో...

ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 70 గ్రంథాలయాలు ఉన్నాయి. అందులో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి వేతనం కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. శాశ్వత ఉద్యోగుల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక కాంటాక్టు ఉద్యోగులైతే ఆశలు వదులుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కంటెంట్‌జెంట్‌, పేపర్‌, ఎలక్ట్రికల్‌ బిల్లుల చెల్లింపుకు కూడా నిధులు విడుదల చేయకపోవడం పరిస్థితి దుర్భరంగా మారింది. గ్రంథాలయ ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో ఇటీవల పదవీ విరమణ చేసిన వారికి బెనిఫిట్స్‌ ఆగిపోయాయి. పెన్షన్లు అందక 4 నెలలు గడుస్తున్నాయి. ఇదిలా ఉంటే కొద్ది రోజుల కిందట ప్రభుత్వం రూ.కోటి విడుదల చేసింది. మరో రూ. 82 లక్షలు కూడా ఉండటంతో ఫిబ్రవరి మాసం జీతం, ఆపైన మార్చిది కూడా తీసుకోవచ్చు. కానీ ప్రభుత్వ పెద్దలు నిబంధనలను కఠినంగా మార్చడంతో ఉన్న నిధులు వాడుకోవాలన్నా వచ్చేనెల 1 వరకు ఆగాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. జిల్లా గ్రంథాలయ చరిత్రలో ఇన్ని నెలలు జీతాలు ఆగిన దాఖలాలు లేవని, అబద్దపు హామీలు, ప్రచారాలతో అధికారంలోకి వచ్చిన ప్రజాప్రతినిధులు దీనికి సమాధానం చెప్పాలని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

ఎక్కడా నోరెత్తకూడదు..

జీతాలు రాక నాలుగు నెలలు గడుస్తున్నా లోలోన మదన పడాల్సిందే తప్ప.. బయట చెప్పుకునే పరిస్థితి కూడా ఉద్యోగులకు లేకుండా పోయింది. టార్గెట్‌ చేస్తే తీవ్ర ఇబ్బందులు పడతామన్న భయం వారిని వెంటాడుతోంది. సాధారణ ఉద్యోగులతో పాటు ఉద్యోగ సంఘాల నేతలు కూడా పెదవి విప్పకపోవడం గమనార్హం.

నాలుగు నెలలుగా గ్రంథాలయ

ఉద్యోగులకు జీతాలు కరువు

అరకొర నిధులు విడుదల చేసినా వాడుకోలేని దుస్థితి

తీవ్ర ఇబ్బందుల్లో ఉద్యోగుల కుటుంబాలు

Advertisement
 
Advertisement
Advertisement