అనంతపురం: జిల్లాలోని వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలందరికీ ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, ఏపీ జర్నలిస్ట్ డెవలప్‌మెంట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, ఏపీ జర్నలిస్టు డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న జర్నలిస్టు పిల్లలందరికీ ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేస్తామన్నారు. ఆసక్తి కలిగిన వారు ఈనెల 25వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ఆధార్‌కార్డు, అక్రిడేషన్ కార్డు, మీడియా కార్డు జిరాక్స్ కాపీలతో పాటు కుటుంబ సభ్యుల వివరాలను అనంతపురం నగరంలోని అంకుశం పత్రిక కార్యాలయంలో అందజేయాలన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే నోటు పుస్తకాలు అందిస్తామని పేర్కొన్నారు. వివరాలకు మచ్చా రామలింగారెడ్డి 9849152149, 7386958666, షెక్షావలి : 9985301901ను సంప్రదించాలన్నారు.
మిద్దైపె నుంచి పడి
చిన్నారికి గాయాలు
రాయదుర్గంటౌన్: పట్టణంలోని కోతగుట్ట కాలనీలో ఆడుకుంటూ ఓ చిన్నారి మిద్దైపె నుంచి పడి గాయాలపాలైన ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాలు... ధర్మవరం నియోజకవర్గం సీకే పల్లికి చెందిన హంపి కుమార్తె నిహారిక (8) వేసవి సెలవుల నిమిత్తం రాయదుర్గంలోని పెదనాన్న తిమ్మరాజు ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం మిద్దైపె ఆడుకుంటూ కాలు జారి కింద పడింది. తలకు బలమైన గాయాలు కావడంతో స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురంకు వైద్యులు సిఫార్సు చేశారు. ప్రస్తుతం బాలిక కోలుకుంటున్నట్లు బంధువులు తెలిపారు.
బంజారాలను ఏకం చేసేందుకే
‘ఏక్తా సంకల్పయాత్ర’
గుత్తి రూరల్: భారతదేశంలోని 20 కోట్ల బంజారాలను ఏకం చేయడానికి భారత్ బంజారా ఏక్తా సంకల్పయాత్ర చేపడుతున్నట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి డి.రవీంద్రనాయక్ పేర్కొన్నారు. మండలంలోని సేవాఘడ్ సంత్ సేవాలాల్ ఆలయంలో కర్ణాటకకు చెందిన గురు మహారాజ్ చేపట్టిన బంజారా ఏక్తా సంకల్ప యాత్ర కార్యక్రమానికి మాజీ మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంత్ సేవాలాల్ మహారాజ్ ట్రస్టు అధ్యక్షుడు కొర్రా జగన్నాథరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రవీంద్రనాయక్ మాట్లాడారు. రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాలకు లభిస్తున్న ప్రాధాన్యత మైదాన ప్రాంత బంజారాలకు లభించడం లేదన్నారు. సీఎం చంద్రబాబు ఈ విషయంపై దృష్టి సారించి రాయలసీమ ప్రాంతంలో రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. మహారాజ్ మాట్లాడుతూ బంజారాల హక్కుల సాధనకు కార్యాచరణ రూపొందించి ప్రణాళికతో ముందుకెళ్తామన్నారు. 12 రాష్ట్రాలలో తిరిగి ఆయా రాష్ట్రాల గవర్నర్, సీఎంలను కలిసి వినతి పత్రం సమర్పించి చివరికి దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుని దేశ ప్రధాని నరేంద్ర మోదీకి వినతిపత్రం అందజేస్తామన్నారు. కార్యక్రమంలో ట్రస్టు వర్కింగ్ ప్రెసిడెంట్ పీఎల్.రవీంద్రనాయక్, సభ్యులు రంగానాయక్, ఎస్‌కే.సుబ్రమణ్యంనాయక్, మహారాష్ట్రకు చెందిన రామ్‌దాస్‌సింగ్, ఢిల్లీకి చెందిన ప్రవీణ్‌రాథోడ్, హర్యానాకు చెందిన బీఎల్.నాయక్, మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు అశ్వర్థనాయక్ తదితరులు పాల్గొన్నారు.


