మొక్కుబడి ‘క్లినిక్‌’ | - | Sakshi
Sakshi News home page

మొక్కుబడి ‘క్లినిక్‌’

May 17 2026 12:42 AM | Updated on May 17 2026 12:42 AM

అనంతపురం అర్బన్‌: భూ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్‌ వేదికగా నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్‌ ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు. అర్జీల పరిష్కారం అంతంత మాత్రంగా ఉండడమే ఇందుకు నిదర్శనం. ఈ విషయాన్ని అధికారిక నివేదిక స్పష్టం చేస్తోంది. అందిన అర్జీల సంఖ్యలో సగం కూడా పరిష్కారం కాకపోవడం గమనార్హం. గత ఏడాది డిసెంబర్‌ 26న రెవెన్యూ క్లినిక్‌ ప్రారంభించారు. ప్రతి సోమవారం పరిష్కార వేదికతో పాటు రెవెన్యూ క్లినిక్‌ను కూడా నిర్వహిస్తున్నారు. భూ సమస్యలపై అప్పటి నుంచి అంటే దాదాపు ఐదు నెలల వ్యవధిలో అందిన అర్జీల సంఖ్య 2,602 కాగా.. పరిష్కరించిన అర్జీలు 1,160గా నివేదికలో పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే భూ సమస్యలపై అందిన అర్జీలకు సత్వర పరిష్కారం అందడంలేదనేది సుస్పష్టం.

97 శాతం మండలస్థాయివే..

రెవెన్యూ క్లినిక్‌లో అందుతున్న అర్జీల్లో 97 శాతం మండల స్థాయిలో పరిష్కారం కావాల్సినవే ఉంటున్నాయి. సమస్యలపై అందిన అర్జీల కేటగిరీని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ఇప్పటి వరకు అందిన 2,602 అర్జీల్లో జిల్లాస్థాయిలో పరిష్కారం కావాల్సిన 22ఏ (నిషేధిత భూములు) అర్జీలు 93 మాత్రమే ఉన్నాయి. మిగిలిన అన్నీ సమస్యలు తహసీల్దారు స్థాయిలో పరిష్కారించాల్సినే కావడం గమనార్హం.

సత్వర పరిష్కారమేదీ?

భూ సమస్యలపై మండలస్థాయిలో అర్జీలు స్వీకరించినా... మండలస్థాయి యంత్రాంగం జిల్లా కేంద్రానికి వచ్చి ఇక్కడ తీసుకున్నా... వాటి పరిష్కారంలో చూపుతున్న జాప్యంలో ఎలాంటి మార్పూ లేదు. ఇప్పటి వరకు అందిన 2,602 అర్జీల్లో 831 అర్జీలు అనుమతించగా.. 329 అర్జీలు తిరస్కరించారు. ఇవే 1,160 ఉండగా.. మిగిలిన 1,442 అర్జీలు పరిశీలన దశలోనే ఉన్నాయి. అందిన అర్జీల్లో పరిష్కరించినట్లుగా చూపుతోంది 97 మాత్రమే. పరిష్కార చర్యలు చేపట్టిన అర్జీలు 2,123 ఉన్నాయి. 20 అర్జీలు జిల్లా లీగల్‌ సర్వీస్‌ అథారిటీ (డీఎల్‌ఎస్‌ఏ)కు పంపించారు. సచివాలయాలకు 168 పంపగా, ఆన్‌లైన్‌ రెవెన్యూ కోర్టు మేనేజ్‌మెంట్‌ కింద 103 రిజిస్టర్‌ చేశారు. సివిల్‌ వివాదాలకు సంబంధించి 91 అర్జీలు ఉన్నాయి.

అర్జీలు తీసుకుని వెళ్తున్నారంతే..!

ప్రజల నుంచి వారి సమస్యలపై అర్జీలు స్వీకరించేందు కోసం ప్రత్యేకంగా ప్రతి సోమవారం మండల, డివిజన్‌, జిల్లాస్థాయిలో పరిష్కార వేదిక నిర్వహిస్తున్నారు. అయితే రెవెన్యూ క్లినిక్‌ను ప్రారంభించిన తరవాత సోమవారం మండలాల నుంచి డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్‌ఐ, తదితర సిబ్బంది జిల్లా కేంద్రానికి వస్తున్నారు. వీరంతా ఇక్కడికి వచ్చి చేస్తున్న పని అర్జీలు స్వీకరించడం మాత్రమే కావడం గమనార్హం.

రెవెన్యూ క్లినిక్‌లో భూసమస్యల పరిష్కారం అంతంతే

ఐదు నెలల్లో అందిన అర్జీలు 2,602

అనుమతి పొందిన అర్జీలు 831, తిరస్కరణ 329

పరిశీలన పెండింగ్‌లో ఉన్నవి 1,442

Advertisement
 
Advertisement
Advertisement