● రాగల ఐదు రోజులు తేలికపాటి వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్: రాగల ఐదు రోజులు ఉమ్మడి జిల్లాలో తేలికపాటి వర్షం పడే సూచనలు ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం. విజయశంకరబాబు, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ జి.నారాయణస్వామి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ వాతావరణ కేంద్రం నుంచి ఈ మేరకు సమాచారం అందింద న్నారు. 16 నుంచి 20వ తేదీ వరకు 1 నుంచి 3 మి.మీ మేర తేలికపాటి సగటు వర్షసూచన ఉందన్నారు. ఉష్ణోగ్రతలు కూడా కొనసాగుతాయని, పగలు 41.4 డిగ్రీల నుంచి 41.6 డిగ్రీలు, రాత్రిళ్లు 25.4 డిగ్రీల నుంచి 26.8 డిగ్రీల మధ్య రికార్డు కావొచ్చన్నారు. గాలిలో తేమశాతం ఉదయం 62 నుంచి 65, మధ్యాహ్నం 15 నుంచి 30 శాతం మధ్య ఉంటుందని తెలిపారు. నైరుతి దిశగా గాలులు గంటకు 6 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపారు.
మామిడి టన్ను రూ.34 వేలు
అనంతపురం అగ్రికల్చర్: స్థానిక కక్కలపల్లి మామిడి మార్కెట్‌లో శుక్రవారం టన్ను గరిష్ట ధర రూ.34 వేలు పలికినట్లు రాప్తాడు మార్కెట్ కమిటీ సెక్రటరీ రూప్‌కుమార్ తెలిపారు. మార్కెట్‌కు 304 టన్నులు అమ్మకానికి రాగా, వాటిని వేలం వేశారన్నారు. అందులో బేనీషా రకం మామిడి టన్ను గరిష్టం రూ.34 వేలు, కనిష్టం రూ.20 వేలు, సరాసరి రూ.26 వేల ప్రకారం, మల్లికా రకం టన్ను గరిష్టం రూ.25 వేలు, కనిష్టం రూ.15 వేలు, సరాసరి రూ.20 వేలు కాగా తోతాపురి రకం టన్ను గరిష్టం రూ.20 వేలు, కనిష్టం రూ.10 వేలు, సరాసరి రూ.15 వేల ప్రకారం క్రయ విక్రయాలు జరిగినట్లు తెలిపారు.
జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీలో ఏడుగురికి చోటు
అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో ఏడుగురిని సభ్యులుగా నియమిస్తూ కలెక్టర్ ఆనంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ,ఎస్టీల సంక్షేమ కార్యక్రమాల అమలు, పర్యవేక్షణతో పాటు వివిధ అంశాలపై ఈ కమిటీ పని చేయనుంది. నాన్ అఫీషియల్స్ (ఎస్సీ,ఎస్టీ) కేటగిరీలో ఉల్లికల్లు చిన్నపెద్దన్న, వెంకటేశులు, గడ్డం ముత్యాలప్ప, ఎస్.ముసలయ్య, సి. తిరుపాలుకు సభ్యులుగా అవకాశం కల్పించారు. ఇతర వర్గాల ప్రతినిధుల కేటగిరీలో ఎస్.కృష్ణమూర్తి. బి.వెంకటరమణను నియమించారు.
● ఉల్లికల్లు చిన్నపెద్దన్న జిల్లాస్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబరుగా నియామకం కావడం పట్ల ఎమ్మార్పీఎస్ రాయలసీమ అధ్యక్షుడు యు.రమణ హర్షం వ్యక్తం చేశారు. బడుగు, బలహీన వర్గాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు.


