తాడిపత్రి రూరల్: రెండు రోజుల పాటు కోర్టు ప్రాంగణంలో ఉండాలని జూదరులకు శిక్ష విధిస్తూ తాడిపత్రి సెకండ్‌క్లాస్ మేజిస్ట్రేట్ ప్రభావతి తీర్పు వెలువరించారు. వివరాలను అప్‌గ్రేడ్ పీఎస్ సీఐ శివగంగాధర్‌రెడ్డి శుక్రవారం వెల్లడించారు. తాడిపత్రి మండలం సజ్జలదిన్నె గ్రామ సమీపంలో పేకాట ఆడుతూ పట్టుపడిన 11మందిని శుక్రవారం న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. కేసు విచారణ అనంతరం జూదరులు ఒక్కొక్కరికి రూ.300 చొప్పున జరిమానా, రెండు రోజుల పాటు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కోర్టు ప్రాంగణంలోనే ఉండాలని శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.
వైఎస్సార్‌సీపీ కమిటీల్లో చోటు
శింగనమల: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పలువురికి పార్టీ రాష్ట్ర, జిల్లా కమిటీల్లో చోటు కల్పించారు. ఇంటెలెక్చువల్ ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా వై.రాజకుళ్లాయిరెడ్డి (శింగనమల నియోజకవర్గం), పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా బళ్లారి లక్ష్మీనారాయణ (అనంతపురం అర్బన్), సోషల్ మీడియా విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా చుక్కలూరు నవీన్ కుమార్‌రెడ్డి (తాడిపత్రి), యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా వనం రవి (శింగనమల)లను నియమించారు. అలాగే శింగనమల నియోజకవర్గానికి చెందిన బి.బచ్చలన్న పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, బి.ప్రకాష్‌రెడ్డి జిల్లా ఆర్గనైజేషనల్ కార్యదర్శిగా, అరకటివేముల శ్రీనివాసరెడ్డి రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జి.పెద్ద వెంకట శివారెడ్డి రైతు విభాగం జిల్లా కార్యదర్శిగా, జేసీ నారాయణ బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, పి.రామాంజులరెడ్డి బూత్ కమిటీల విభాగం జిల్లా కార్యదర్శిగా, జి.సుధాకర్‌రెడ్డి యువజన విభాగం జిల్లా కార్యదర్శిగా, అట్ల తాతిరెడ్డి సోషల్ మీడియా విభాగం జిల్లా కార్యదర్శిగా, కె.రామ్మోహన్‌రెడ్డి పంచాయతీ రాజ్ విభాగం జిల్లా కార్యదర్శిగా నియమితులయ్యారు.
బూదివర్తిలో వడగండ్ల వాన
బెళుగుప్ప: మండలంలోని బూదివర్తి గ్రామంలో శుక్రవారం సాయంత్రం పెను గాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. గ్రామస్తులు వడగండ్లను చేతుల్లోకి తీసుకుని మురిసిపోయారు. గ్రామం సమీపంలోని పొలాల్లో కురిసిన వడగళ్లు ముత్యాలు మాదిరిగా మిలమిల మెరుస్తూ కనిపించాయి.


